
సాహిత్యం సమాజాన్ని, వ్యక్తులను సమూలంగా మార్చేస్తుందనే వాదనలపై నాకు నమ్మకం లేదు. సమాజమంతా ఒకే రకమైన ఒత్తిడిలో ఉండే ఉద్యమాల, పోరాటాల రోజులు వేరు. అప్పుడు సాహిత్యం పాత్ర అగణ్యం. అనేక రకాల ఆశలు, స్వార్థాలు కమ్మేసిన మనుషులు సాహిత్యంతో మారిపోరు. మహా అయితే వారి సహజాతమైన జీవన ఒరవడికి భిన్నమైనా సరే, ఒక ఆలోచన వారిలో పుట్టవచ్చు. అలా మొదలంటూ జరిగితే, పలచనైపోతున్న మనిషితనం కాస్త చిక్కబడగలదని ఆశ. రచన ఏ రూపంలో ఉన్నప్పటికీ, కొత్త ఆలోచన పుట్టించాలి. లేదా, ఉన్న ఆలోచనను పరిపూర్ణంగా బలపరిచి, తృప్తి కలిగించాలి. లేకపోతే అది నిలబడదు. కథలు రాయడంలో నేను ఎక్కువగా తీసుకునే జాగ్రత్త ఇది.
చదివిన వారిలో అలా ఆలోచన కలిగిందని తెలిసినప్పుడు ధన్యమైనట్టు అనిపిస్తుంది. ‘...మనిషి కుక్కను కరిస్తేనే అది వార్త’ అని జర్నలిజం తొలిపాఠంలో నేర్చుకున్న సత్యం, కథలకూ అన్వయిస్తుందనేది నా నమ్మకం. జీవితాలు, సంఘటనలు, పోకడలు... బతుకు గమనంలో ఎదురయ్యే వాటిలో, విలక్షణత, నన్ను నిలబెట్టేస్తే అక్కడ నా కథకు వస్తువు ఉంటుంది. అది పదుగురికీ హత్తుకునేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. విస్తృతమైన కేన్వాసును ఎంచుకున్నప్పుడు మాత్రమే సీరియల్ నవలలుగా రాశాను. కవితలు, కార్టూన్లలో కృషి తక్కువ. కడుపు మండినప్పుడు; నాలోని నిస్సహాయత, అశక్తత నన్ను వెక్కిరించినప్పుడు; అసహ్యాలు, ఆగ్రహాలు పుట్టినప్పుడు కొన్ని ‘ఇన్‌స్టంట్’ కవితలు వస్తుంటాయి. కొందరికి అభ్యంతరంగా అనిపించే భాషలో కొన్ని ఉంటాయి.
వాటిని కూడా ‘అన్‌సెన్సార్డ్’ కవితల సంపుటిగా వేయాలని ఉంది. ఏ మాత్రం అవగాహన లేని సబ్జెక్టు గురించి అయినా సరే– ‘రాసేముందు క్షుణ్నంగా తెలుసుకోవాలి’ అనే పాఠం నాకు జర్నలిజం నేర్పింది. ‘నేర్చుకుంటూ ఉన్నంతవరకే జీవిస్తున్నట్టు’ అనేది కూడా నా అనుభవం. నేర్చుకుంటున్న విషయాలను పునశ్చరణలాగా కథల్లోనూ ప్రస్తావిస్తుంటాను. మొనాటనీ లేకుండా కథలు కొత్తగా ఉండడానికి ఆ కృషి నాకు ఉపకరిస్తుంది. అందరి కష్టాలనూ జర్నలిస్టులు ప్రపంచానికి చెబుతుంటారు. మరి వారి కష్టాలను స్పర్శించేదెవ్వరు? వారి వృత్తిగత, ఆత్మానుగత వేదనల్ని పరామర్శించేదెవరు? రాంగోపాల్ వర్మకు మాఫియా, దయ్యం ఎలాగో అలా నా కథలకు జర్నలిజం ఒక ఇష్టమైన సబ్జెక్ట్. ఇక్కడి బతుకుల్లోని, సార్వజనీనమైన చీకట్లపై వీలున్నపుడెల్లా ముసుగు తొలగించి చూపించాలనేది నా ఆశ.
కె.ఎ.మునిసురేశ్ పిళ్లె
పూర్ణమూ నిరంతరమూ (కథలు); పేజీలు: 200;
రాతి తయారీ (కథలు); పేజీలు: 176;
సుపుత్రికా ప్రాప్తిరస్తు (నవల); పేజీలు: 176;
వెల: ఒక్కోటి రూ.200; రచన: కె.ఎ.మునిసురేశ్ పిళ్లె;
ప్రతులకు: ఆదర్శిని మీడియా, మాదాపూర్,
హైదరాబాద్–81. ఫోన్: 9959488088
Comments
Please login to add a commentAdd a comment