మతగ్రంధాల మర్మాలేమిటో తెలుసుకోవాలనిపించింది ఓ ముస్లిం అమ్మాయికి.‘పెద్దల్లో ఓ గుణముంది.తాము అర్థం చేసుకున్న రీతిలోనేవాళ్లు వ్యాఖ్యానిస్తారు.అందుకే... మూలాల్లోకి వెళ్లు. మూలసారం గ్రహించు’ అన్నది ఆమె తండ్రి సలహా.అంతే... పట్టుబట్టి భగవద్గీత చదివిందామె. చదవడమే కాదు... తర్జుమానూ చేసింది.‘సర్వమతాల సంగ్రహమేమిటోగ్రహించావా అమ్మా’ అని అడిగితే...‘ఒరులేయవి’ అనే మహాభారత పద్య సారాంశంలా... ఆ చిన్నారితల్లి చెప్పిన మాటలే... ఈ ‘హీబా’సారం!
‘మిగతా మత గ్రంథాల్లో ఏం చెప్పారో? అవీ ఖురాన్‌లాగే ఉంటాయా నాన్నా?’ అడిగింది హీబా.‘అన్ని మతాల సారం ఒక్కటే బేటా’ నింపాదిగా సమాధానమిచ్చాడు తండ్రి.అప్పటి నుంచి ఆ అమ్మాయిలో ఆలోచన ... మిగిలిన మత గ్రంథాలనూ చదవాలి. ముఖ్యంగా భగవద్గీత. గీత గురించి చాలా గొప్పగా విన్నది. జీవితంలోని ఎన్నో సంఘటనలను గీతా శ్లోకాలతో అన్వయిస్తారు. అసలు జీవన సారం అందులోనే ఉన్నదని చెప్తారు.. అది చదవాలి.. తెలుసుకోవాలి.. అర్థం చేసుకోవాలి అన్న పట్టుదల పెరిగింది. యూట్యూబ్‌లో మత ప్రవచనాలు వినడం ఆమెకు ఆసక్తి. అలా ఒకసారి ఒక మౌల్వి చెప్పిన మాటలు విన్నది... ‘మత గ్రంథాల సారం తెలుసుకోవాలంటే ఆయా మతాలను అనుసరిస్తున్న వ్యక్తులతో మాట్లాడి తెలుసుకోవడం కన్నా నేరుగా ఆ గ్రంథాలను చదవడమే మంచిది. అధ్యయనం వల్లనే దాని సారం అర్థమవుతుంది. అడిగి తెలుసుకుంటే చెప్పేవాళ్ల వ్యాఖ్యానమే ఎక్కువగా వస్తుంది. గ్రంథంలోని అసలు విషయం కన్నా. అందుకే చదవండి .. విస్తృతంగా చదవండి’ అని.
అప్పుడు మొదలుపెట్టింది భగవద్గీతను చదివే ప్రయత్నం.ఆ అమ్మాయి పూర్తిపేరు హీబా ఫాతిమా. నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణ నివాసి. ఆమె తండ్రి అహ్మద్ ఖాన్ ఓ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి జాహెదా పర్వీన్. గృహిణి. హీబా ఫాతిమాకు ఓ చెల్లెలు కూడా ఉంది జేబా ఫాతిమా. ఇంటర్ చదువుతోంది. హీబా బీఎస్సీ బీజెడ్‌సీ గ్రాడ్యుయేట్. టీచర్ కావాలన్న ఆశయంతో టీచర్ ట్రైనింగ్‌లో డిప్లమా చేస్తోంది నిజామాబాద్‌లో.
అర్థంకాకుండా ఎలా?
భగవద్గీత చదవాలనే ప్రయత్నంతో సికింద్రాబాద్, చత్తీస్‌గఢ్‌ల నుంచి పుస్తకాలను తెప్పించుకుంది. దేవనాగరి లిపిలో ఉన్న ఆ సంస్కృత శ్లోకాలు, హిందీ తాత్పర్యం చూసి తెల్లమొహం వేసింది హీబా. తొలి నుంచి ఇంటర్ దాకా ఆ అమ్మాయిది ఉర్దూ మీడియం. హిందీ చదవడం వచ్చు కాని అంత అనర్గళంగా రాదు. ముందు చదువుకుంటూ పో.. తర్వాత అర్థతాత్పర్యాల గురించి ఆలోచించవచ్చు అని సలహా ఇచ్చాడు తండ్రి. కాని అర్థంకాకుండా ఎలా చదివేది? తన వల్ల కాదు అంది. యూట్యూబ్ సహాయంతో తన దగ్గరున్న భగవద్గీతను చదివింది. అర్థం చేసుకుంది. అంతా అవగతమయ్యాక ఆశ్చర్యం వేసింది హీబాకు. ఖురాన్ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది. భగవంతుడు ఒక్కడే– కొలిచే రూపాలు.. ఆరాధించే తీరే వేరు అని తెలిసి. ఈ విషయం తన ధర్మంలోని వారికీ తెలియాలి. అంటే గీతను ఉర్దూలోకి అనువదించాలని నిశ్చయించుకుంది.
2018 , ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు..
మళ్లీ భాషతో చిక్కొచ్చింది. అప్పుడు హీబా తల్లి జాహెదా.. దేవనాగరి లిపిలో ఉన్న ఆ శ్లోకాలను ఉర్దూలోకి అనువదించడంలో కూతురికి తోడ్పడింది. మరాఠీ మీడియంలో చదివినా హిందీ మీదా పట్టుంది జాహెదాకు. అలా అమ్మ సహాయంతో అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత.. రోజుకి ఒక్క శ్లోకమే ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగింది. ఆతర్వాత రోజుకు రెండు.. మూడు శ్లోకాలు.. క్రమక్రమంగా అవి పెరిగి రోజుకి పది శ్లోకాలు రాసేంతగా పట్టు సాధించింది ఆ అమ్మాయి. పుస్తకం పూర్తయ్యే టైమ్‌కు రోజుకు ఇరవై శ్లోకాలను అనువదించగలిగింది. మొత్తానికి 2018, అక్టోబర్ వరకు భగవద్గీత ఉర్దూ తర్జుమాను పూర్తి చేసింది హీబా.
అందరూ ఎలా స్పందించారు?
‘ఎవరో స్పందించాలనో.. ప్రశంసించాలనో నేనీ పని చేయలేదు. అన్ని మతాలూ బోధించేది ఒక్కటే.. మానవత్వం. సర్వ మానవ సమానత్వం. ఈ విషయం నాతోటి వాళ్లకూ తెలియచేయాలనుకున్నా. చేశాను. గీత చదివాక నాకు అర్థమైంది ఒక్కటే.. ఖురాన్‌కు, గీతకు మధ్య తేడా భాష మాత్రమే అని. దీన్ని తెలిజేయడం కోసమే గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేశా. ఫీడ్‌బ్యాక్ అడిగాననుకోండి.. వాళ్ల వాళ్ల నాలెడ్జ్, అనుభవాన్ని బట్టి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. నా లక్ష్యం నేను చేసిన దాని మీద పదిమంది అభిప్రాయాలు పోగేయడం కాదు... నేను రాసిన దాంట్లోని సారం పదిమంది తెలుసుకోవాలని. అన్ని ధర్మాల పట్లా గౌరవాన్ని పెంచుకోవాలి.. సామరస్యాన్ని పాటించాలి’ అంటుంది హీబా.
నేనూ వేదాలు, ఉపనిషత్తులను కొంత తెలుసుకున్నాను. వాటి గురించి నా పిల్లలతో చర్చిస్తాను. ఆ వాతావరణమే బహుశా హీబాలో ఈ జిజ్ఞాసను కలిగించిందేమో. చిన్నప్పటి నుంచీ తను చదువులో చురుకే. డిఎడ్ ఎంట్రెన్స్‌లో స్టేట్ తొమ్మిదో ర్యాంక్ తెచ్చుకుంది. మా ఇద్దరమ్మాయిలకూ ఒకటే చెప్పా.. మీ ద్వారా సమాజానికి మంచి జరగాలి. ఒకవేళ మంచి చేయలేకపోయినా చెడు అయితే జరక్కూడదు అని. ఆ తీరుగానే ఆలోచిస్తారు వాళ్లు. పొరపాటున కూడా అబద్ధం చెప్పరు. ఏదున్నా నాతో, వాళ్లమ్మతో షేర్ చేసుకుంటారు. మేమూ అంతే పిల్లలతో స్నేహితుల్లా ఉంటాం. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండే కుటుంబం మాది. ఇలాంటి మంచి పనులకు భగవంతుడు మరింత శక్తినివ్వాలనే కోరిక తప్ప ఇంకేం లేదు మాకు.– అహ్మద్‌ఖాన్
ఇప్పుడు..
‘ఖురాన్, గీతను ఒక్క చోటనే ఒకే పుస్తకంలో పొందుపరిస్తే చదివేవాళ్లకు ఉపయోగంగా ఉంటుందని.. ఖురాన్‌ను, గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. ఎలాగంటే.. ఖురాన్‌లోని ప్రతి అయాత్‌ను ఇంగ్లీష్ ఫొనెటిక్‌లో.. దాని కిందనే ఉర్దూలో రాసి.. అర్థమూ చెప్తాను. అలాగే గీతను కూడా అంతే. ప్రతి శ్లోకాన్ని ఇంగ్లీష్ ఫొనెటిక్‌లో.. దాని కిందనే ఉర్దూలో అర్థం వివరిస్తాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే పూర్తిచేసి పుస్తకంగా తెస్తాను. దీని తర్వాత నా దృష్టి అంతా టీచర్ ఉద్యోగం మీదే. నేను నేర్చుకున్నది పది మందికి చెప్పాలి. నాది, నీది అని తేడా లేకుండా బతకాలి. జ్ఞానాన్ని పొందడం.. దాన్ని పంచడానికి మించిన మంచి కార్యక్రమం లేదు. అలాగే మనం పొందిన జ్ఞానం బ్యాలెన్సింగ్ గుణాన్ని అలవర్చాలి.. హింసాప్రవృత్తిని తగ్గించాలి. ఇది ప్రాక్టీస్‌లో పెట్టలేని మేధస్సు ఎంత ఉన్నా వృధాయే’ అని చెప్పింది హీబా ఫాతిమా.– గడ్డం గంగులు, సాక్షి, బోధన్‌ఫొటోలు: బి. రాజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment