చట్టం దూరంగా ఉంచింది... బంధం దగ్గర చేసింది!
కేస్ స్టడీ
రజనీ, మాధవ్‌లది అన్యోన్య దాంపత్యం. వివాహమై ఎనిమిదేళ్లైనా ఏమాత్రం వారి మధ్య అపోహలు అపార్థాలు లేవు. ఉద్యోగంలో, ఇంటిపనిలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. ఒక పూట వంట రజని చేస్తే, మరో పూట మాధవ్ చేస్తాడు. ఇరువురు ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకుంటారు. కానీ కడివెడు పాలల్లో ఒక విషం బొట్టులా ఆర్నెల్ల క్రితం రజనీ మేనత్త పల్లెటూరి నుండి వచ్చింది. తనకు ఏ దిక్కూ లేదని, మేనకోడలింట్లో పెద్ద దిక్కుగా ఉంటానని తిష్ట వేసింది. ఇకనేం రజనీ మనస్సులో రోజూ విషం చిమ్మే కబుర్లు మొదలెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చు రగిల్చింది. చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్లింది. కేసు విచారణ ముగిసింది.
జడ్జిగారికి విడాకులకు కారణాలు కన్పించలేదు. కేస్ కొట్టివేస్తే అప్పీల్‌కు వెళ్తారు. ఈ లోగా ఇరువురి మధ్య ద్వేషం పెరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమనంగా సెక్షన్ 13-ఎ ప్రకారం అంటే ఆల్టర్నేటివ్ రిలీఫ్‌గా వారికి ‘జుడీషియల్ సపరేషన్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భార్యాభర్తల మధ్య వివాహం రద్దు పరచదు. కేవలం ఒక కప్పు కింద సంసారం చేసే బాధ్యతను రద్దు పరచి, పరస్పరం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
కోర్టు ఆర్డర్స్ ప్రకారం రజనీ, మాధవ్‌లు వేరువేరుగా కొంతకాలం ఉన్నారు. తమ లోపాలను, ఆలోచనా విధానాలను సరిదిద్దుకున్నారు. అపోహలు తొలిగాక హాయిగా కలిసి కాపురం చేస్తున్నారు. రజనీ మేనత్తను సాగనంపారు. న్యాయమూర్తిగారు సెక్షన్ 13ఎ హిందూ వివాహచట్టం ప్రకారం ఆల్టర్నేటివ్‌గా జుడీషియల్ సపరేషన్ ఆర్డర్స్ ఇచ్చి వారికి కాపురం నిలబెట్టుకునే అవకాశం ఇచ్చారు.