రంగు పడాల్సిందే!
నెయిల్ పాలిష్ గోళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది కదా! అయితే దాని పాత్ర అక్కడితో ముగిసిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కసారి చాన్స్ ఇచ్చి చూడండి... అది మన ఇంట్లో చాలా పనులు చేసేస్తుంది. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే...
ఎన్వలప్ అతికిద్దామంటే జిగురు డబ్బా కనిపించడం లేదా? నెయిల్ పాలిష్ ఉంటే దానితో అతికించండి. జిగురుకన్నా బాగా కవర్‌ని సీల్ చేసేస్తుంది!
వార్డ్‌రోబ్స్, కిచెన్ షెల్ఫుల్లో పెయింటు పోయి మచ్చలు కనిపిస్తుంటే... అక్కడ బ్రౌన్ కలర్ నెయిల్ పాలిష్ పూయండి. మచ్చలు కనిపించవిక! {స్కూలు వదులై జారిపోతుంటే... వాటిమీద నెయిల్ పాలిష్‌ను పూయండి. ఆ తర్వాత బిగించి చూడండి... ఎంత బిగుతుగా ఉంటాయో!
ఒకేలాంటి తాళాలు బోలెడు ఉన్నాయనుకోండి. ఏది దేనిదో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు ఒక్కో తాళానికీ ఒక్కో రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆ తాళం దేనికి సంబంధించినదో ఆ కీ హోల్‌కి అదే రంగు పాలిష్ పూయండి. ఇక కన్‌ఫ్యూజనే ఉండదు!
మీకెంతో ఇష్టమైన ఆర్టిఫీషియల్ జ్యూయెలరీ రంగు పోయిందని దిగులు పడ నక్కర్లేదు. మీకు నచ్చిన రంగు నెయిల్ పాలిష్‌తో ఓ కోటింగ్ ఇవ్వండి. కొత్తగా కనిపిస్తాయి ఆభరణాలన్నీ. కావాలంటే మరో డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ రంగును రిమూవర్‌తో తొలగించేసి, మీ డ్రెస్సు రంగు పాలిష్‌ను వేసుకోవచ్చు. దాంతో ఒకే సెట్ అన్నిటి మీదకీ వచ్చేస్తుంది!
సూదిలో దారం ఓ పట్టాన ఎక్కకపోతే, దారం చివర నెయిల్ పాలిష్ పూయండి. స్టిఫ్‌గా అయ్యి వెంటనే ఎక్కేస్తుంది! వాహనాల మీద గీతలు పడినప్పుడు పెయింట్‌తో వాటిని కవర్ చేయవచ్చు! షూ లేసుల చివర ఉన్న టిప్స్ ఊడిపోయాయనుకోండి... ఆ స్థానంలో నెయిల్ పాలిష్ రాసి ఎండబెడితే పోగులు ఊడిపోకుండా ఉంటాయి!
కొన్ని రకాల లోహాల్ని తాకితే అలర్జీ వస్తుంది కొందరికి. అలాంటి వాటికి నెయిల్ పాలిష్ పూసేస్తే... ముట్టు కున్నప్పుడు లోహం చేతికి తాకదు, అలర్జీ రాదు! చలికాలంలో అగ్గిపెట్టెలు నానినట్టుగా అయ్యి, పుల్లలు సరిగ్గా వెలగవు. అలా అవ్వకుండా ఉండాలంటే... చలికాలం రాగానే అగ్గిపెట్టెలకు నెయిల్ పాలిష్ పూత పూయాలి. అప్పుడు తేమకి అట్ట నానకుండా ఉంటుంది!