సాక్ష్యాధారాలు మరకల్లాంటివి. ఏళ్లు గడిచే కొద్దీ ఆనవాళ్లు లేకుండాపోతాయి. మనసుకు తగిలిన గాయం మచ్చలాంటిది. ఎన్నేళ్లు గడిచినా బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. తనుశ్రీదత్తా నానా పటేకర్‌పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి!
నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసు తేలిపోయింది. పోలీసులే తేల్చేశారు! కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా కోర్టుకు ‘బి సమ్మరీ’ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బి సమ్మరీ రిపోర్టును ఇవ్వడం అంటే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దొరకలేదని చేతులు ఎత్తేయడం. ఇక కేసును కొట్టేయడమా, కొనసాగించడమా అన్నది కోర్టు పరిధిలోని విషయం. సాక్ష్యాధారాలను ‘సేకరించలేక పోయిన’ పోలీసులు 51 పేజీల బి సమ్మరీలో కొన్ని అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. మిస్‌అండర్‌స్టాండింగ్ కారణంగా, మలేషస్ ఇంటెంట్‌తోనూ తనుశ్రీ నానా పటేకర్ మీద కేసు పెట్టారట. అపార్థం కారణంగా, హాని తలపెట్టే ఉద్దేశంతో అని.
నానా పటేకర్‌తో పాటు మరో ముగ్గురిపైన కూడా తనుశ్రీ కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ సమీ సిద్ధిక్, నిర్మాత రాకేశ్ సారంగ్. వీళ్లలో ప్రధాన నిందితుడు నానా పటేకర్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో 2008 మార్చి 23–26 మధ్య.. సీన్‌ని అడ్డుపెట్టుకుని పటేకర్ తనను వేధించాడని, మిగతావాళ్లు అతడికి సహకరించారని తనుశ్రీ దత్తా ఫిర్యాదు. బి సమ్మరీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నిందితులంతా నిర్దోషులుగా విడుదల అవొచ్చు. అంతేకాదు, పోలీసులు తలచుకుంటే (పటేకర్ తలచుకుంటే అనాలి) రివర్స్‌లో తనుశ్రీ మీదే కేసు పెట్టొచ్చు. పటేకర్ గారి ప్రతిష్టకు ఆమె భంగం కలిగించిందని. తనుశ్రీ దత్తా పటేకర్ పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! తనుశ్రీ కేసు ఫైల్ చేసింది గత ఏడాది అక్టోబర్ 6న. ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది అక్టోబర్ 10న అందులో నానా అండ్ టీమ్‌పై ఆమె చేసిన ఆరోపణలు..
పదేళ్ల క్రితం జరిగిందని ఆమె చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించినవి. అప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేయకుండా ఏమీ లేరు. పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఫైల్ చేసిన బి సమ్మరీ ప్రకారం.. తనుశ్రీ మొదటే 2008 మార్చిలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుర్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. తను లైంగిక వేధింపుల కేసు పెడితే పోలీసులు దానిని వట్టి వేధింపుల కేసుగా నమోదు చేశారని కూడా అప్పట్లోనే ఆమె ఆరోపించారు. తర్వాత పదేళ్లకు.. గత ఏడాది అక్టోబర్‌లో ఒషివారా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ వివరాలన్నీ బి సమ్మరీలో పొందుపరుస్తూ.. ‘కనీసం పదమూడు మంది సాక్షుల్ని విచారిస్తే వాళ్లలో ఒక్కరు కూడా నానా పటేకర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పోలీసులు.
తనుశ్రీ ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం.. నిర్మాత, డైరెక్టర్ ఆమెకు మొదట చెప్పింది.. సోలో ఐటమ్ సాంగ్‌కు మాత్రమే ఆమె చెయ్యాల్సి ఉంటుందని. చేస్తాను కానీ, స్టెప్పులు అశ్లీలంగా ఉంటే తను చెయ్యనని ఆమె అన్నారు. అశ్లీలం మాత్రమే కాదు, తనకు అసౌకర్యంగా ఉండే మూవ్‌మెంట్స్‌ని ఇవ్వలేనని కూడా ముందే స్పష్టంగా చెప్పేశారు. వాళ్లు ఒప్పుకున్నారు. సాంగ్‌లో పటేకర్‌కు మాత్రం సింగిల్ లైన్ ఉంటుందనీ, అది కూడా వేరుగా షూట్ చేసుకుంటామని అన్నారు. అయితే పాట షూటింగ్ జరుగుతున్న నాలుగు రోజులూ నానా పటేకర్ సెట్స్ లోపలికి వచ్చి తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించే నెపంతో ఆమె ఒంటిని టచ్ చేస్తూనే ఉన్నాడు. అది బ్యాడ్ టచ్. అదంతా ఓ స్ట్రాటెజీతో జరుగుతోందని, మిగతావాళ్లు అతడికి సహకరిస్తున్నారని గ్రహించిన వెంటనే సెట్స్‌లోంచి బయటికి వెళ్లిపోయారు తనుశ్రీదత్తా.
అయితే పటేకర్ అసలలా ప్రవర్తించనేలేదని జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన విషయానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు! డైసీ షా స్టేట్‌మెంట్‌ను కూడా వాళ్లు తీసుకున్నారు. డైసీ డ్యాన్సర్, మోడల్. తనుశ్రీ వయసే. ‘‘నానా పటేకర్‌కి పెద్దగా డ్యాన్స్ రాదు. స్టెప్పులు ఎలా వేయాలో నేను, నా మేల్ కొరియోగ్రాఫర్స్ ఆయనకు నేర్పిస్తున్నాం. మార్చి 26 ఉదయాన్నే పటేకర్ సెట్స్‌కి వచ్చేశారు. తనుశ్రీ మధ్యాహ్నం వచ్చారు. అందరు డ్యాన్సర్‌లు సెట్‌లో ఉన్నారు. పటేకర్ తనుశ్రీ వెనుక ఉన్నారు. హఠాత్తుగా తనుశ్రీ అగ్నిపర్వతమే అయ్యారు. విసురుగా బయటికి వెళ్లిపోయారు. ఏమైందో మాకెవరికీ తెలియదు. నిర్మాత, దర్శకుడు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. తన కారులో తను వెళ్లిపోయారు’’ అని డైసీ చెప్పారు.
పటేకర్‌కి అనుకూలంగా ఉన్న ప్రతి పాయింట్‌నీ పోలీసులు శ్రద్ధగా నోట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే పటేకర్ బయటపడినట్లే. తనుశ్రీ బయటపడుతుందా అన్నది పటేకర్ దయాదాక్షిణ్యాలపై ఉంటుంది! తనుశ్రీ నానా పటేకర్‌పై తప్పుడు కేసు పెట్టారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కనుక పటేకర్ ఆమెను వేధించాలనుకుంటే తిరిగి ఆమె మీదే కేసు పడేలా పోలీసుల్ని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. నానా పటేకర్‌కు క్లీన్ చిట్ వచ్చిందన్న వార్త యు.ఎస్.లో ఉన్న తనుశ్రీకి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇండియాలోని ఆమె ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులు కేసు క్లోజ్ చెయ్యవచ్చు. కోర్టు కేస్ కొట్టేయవచ్చు. తను మాత్రం న్యాయపోరాటం చేస్తాననే అంటున్నారు తనుశ్రీ! దేవుడి నుంచి రావలసిన జడ్జ్‌మెంట్ ఇంకా మిగిలే ఉంది కదా అని ఆమె ఆశ.
ఆమె ఆశ పెట్టుకున్న దేవుడు, ఆమె అప్లికేషన్ పెట్టుకున్న న్యాయదేవత.. ఆ ఇద్దరూ ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతున్నప్పటికీ పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణల్లో మాత్రం అబద్ధం లేదని.. డ్యాన్స్ రాని పటేకర్, డ్యాన్స్ నేర్పించడానికి తనుశ్రీ మీద చెయ్యి వెయ్యడాన్ని బట్టే స్పష్టం అవుతోంది. దీన్ని ఇంకో యాంగిల్‌లో చూసేవాళ్లూ ఉండొచ్చు. డ్యాన్స్ రాని పటేకర్ తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించడానికి ఎందుకు ట్రై చేస్తాడు, కేసు ఇక్కడే తేలిపోవడం లేదా అని! పళ్లు లేనివాడు కొరకలేడు నిజమే. పళ్లు లేనంత మాత్రాన కొరికే ఉద్దేశం లేకుండా పోతుందా? పాతికేళ్ల అమ్మాయి.. ఉద్దేశాలను గ్రహించలేకపోతుందా?!
నానా పటేకర్, తనుశ్రీ దత్తా : సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తనుశ్రీ కేసును క్లోజ్ చేసేశారు. మరకల్లేవని మచ్చ కూడా లేకుండా పోతుందా? పటేకర్‌కి క్లీన్ చిట్ వచ్చిందని తనుశ్రీ పదేళ్ల ఆవేదన వట్టి అబద్ధమైపోతుందా?
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment