‘బ్యాలెన్స్ షీట్ ట్యాలీ కావడం లేదు. ఎక్కడ ఎంట్రీ మిస్సయ్యిందో గమనించావా?’ ఆ అమ్మాయి తల వొంచుకుని నిలబడి ఉంది.‘ఓచర్స్ చెక్ చేశావా?’ అలాగే నిలుచుని ఉంది. ‘సేల్స్ ట్యాక్స్ రిటర్న్సూ?’ మళ్లీ అలాగే. స్ట్రేంజ్. ఏంటీ అమ్మాయి జవాబు చెప్పకుండా. ‘సరే వెళ్లు’ పంపించేసింది. ఇవాళ రోజు బాగా లేదు. చిరాగ్గా ఉంది. ఇవాళేనా? ఈ మధ్య అంతా చిరాగ్గా ఉంటోంది. కాసేపు మంచిమూడ్... అంతలోనే డల్‌నెస్... మళ్లీ మంచి మూడ్. భర్త కూడా గమనించి అదే కంప్లయింటు చేస్తున్నాడు. ‘ఇది నీ బాడీలో ఉండే హార్మోన్స్ చేసే మాయాజాలం’ అంటుంది డాక్టర్ ఫ్రెండ్‌ని కలిస్తే. ఏం హార్మోన్సో. అవేనా మాయాజాలం చేసేది. ఈ మొత్తం సొసైటీ మాయాజాలంలో ఉంది.
మగ మాయాజాలంలో. ఆడిటర్‌గా ఆ ఊళ్లో ప్రాక్టీసు మొదలెట్టాలనుకున్నప్పుడు మొదట కుటుంబమే ఆశ్చర్యపోయింది. ‘ఈ రంగంలో నువ్వు రాణించలేవమ్మా. నా మాట విని ఎవరైనా సీనియర్ ఆడిటర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరు’ అన్నాడు తండ్రి– ఆడిటర్‌గా తన అనుభవం అంతా బేరీజు వేసి. సీఏ చేస్తానంటే ఆయన డిస్కరేజ్ చేశాడు. కాని తనే పట్టుబట్టి చదివింది. ‘ఏం ఎందుకు రాణించనూ?’ నిలదీసింది. ‘నీకే తెలుస్తుందిగా’ అన్నాడు. ఆరు నెలలు సంవత్సరానికంతా తెలిసొచ్చేసింది.
ఫోన్ మోగింది. ‘ఏమ్మా... ఆడిటరమ్మా... మీరేదో ట్యాక్స్ తగ్గిస్తారనుకుని పెట్టుకుంటే ఇంతింత కట్టాలని నీ అసిస్టెంట్‌ను పంపావేంటి తల్లీ’... అవతల ఏదో కంపెనీ ఎం.డి అడుగుతున్నాడు. అతని టోన్‌లో అసంతృప్తి. నువ్వు ఆడదానివి... అయినా నిన్ను ఆడిటర్‌గా పెట్టుకున్నాను... నా అనుమానానికి తగినట్టే నీ ప్రతిభ అఘోరిస్తోంది అన్నట్టుగా ఉంది అతడి గొంతు. ‘ఆ పేపర్స్ అన్నీ పంపండి సార్. చెక్ చేసి చెప్తాను’ పెట్టేసింది. ఎక్కడుంది లోపం? తను చక్కగా ఆడిట్ చేయగలదు. ఫైనాన్షియల్ రిపోర్ట్ రాసిందంటే కనుక తిరుగుండదు. కేస్‌ను అద్భుతంగా డీల్ చేయగలదు. అకడమిక్స్‌లో గోల్డ్ మెడల్స్ వచ్చాయంటే ఊరికే రావుగా. ‘అవన్నీ ఎవరికి కావాలమ్మా’ అంటాడు తండ్రి. అవును. ఎవరికి కావాలి. ట్యాక్స్‌కు ఎలా మస్కా కొట్టాలి. నంబర్ టు ఖాతాలు ఎలా మెయింటెయిన్ చేయాలి.
బ్లాక్‌ను ఎలా మేనేజ్ చేయాలి... ఇవి చెప్పాలి క్లయింట్స్‌కి. ఆడిటర్ అనే బాధ్యత పెద్దది. అది ఉన్నది సక్రమంగా పన్ను కట్టించడానికి. ఎగ్గొట్టించడానికి కాదు. ‘మేడమ్.. మీరిలా మాట్లాడితే క్లయింట్లెవరు వస్తారు’ అంటాడు మగ అసిస్టెంటు. చురుకైన కుర్రాడు. ఉన్న ఇద్దరు ఆడపిల్లల కంటే ఈ అసిస్టెంట్ అంటేనే క్లయింట్లకు చనువు. క్లయింట్లకేనా... ఐ.టి ఆఫీసులోని ఆఫీసర్లకు కూడా ఆ కుర్రాడంటేనే మాలిమి. ‘నువ్వు రావయ్యా. అమ్మాయిలను ఎందుకు పంపుతావు’ అంటారు.
అమ్మాయిలు కూడా ఈ రంగంలో రాణించాలని ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకున్నప్పుడు ‘మార్చి, ఏప్రిల్‌లలో రేయింబవళ్లు పని ఉంటుంది. వీళ్లు తట్టుకోగలరా? ఒక క్లయింట్ యాన్యువల్ ఆడిటింగ్ కోసం ఓవర్‌నైట్ స్టేకు పిలిస్తే ఈ అమ్మాయిలను పంపగలవా?’ అన్నాడు తండ్రి. పంపొచ్చు. ఎందుకు పంపకూడదు. కాని పంపే వాతావరణం మగవాళ్లు కల్పించారా? కణతల దగ్గర నొప్పి మొదలైంది. బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయితే తప్ప ఈ నొప్పి తగ్గదు. మగ అసిస్టెంట్ వచ్చాడు.
‘మేడమ్... ఒక మాట అంటే ఏమీ అనుకోరుగా’ ‘చెప్పు’ ‘ఐ.టి. ఆఫీసర్సు మీ నుంచి ఫార్మాలిటీస్ ఆశిస్తున్నారు మేడమ్’ ‘అంటే?’ ‘మగ ఆడిటర్స్ అయితే బయటే చాలా జరుగుతుంటాయి మేడమ్. ఐ.టి ఆఫీసర్సు వాళ్లు మార్నింగ్ వాకుల్లో కలుస్తుంటారు. క్లబ్బుల్లో కలుస్తుంటారు. లేదంటే పార్టీల్లో కలుస్తుంటారు. చాలా మాటలు నడుస్తుంటాయ్. ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది. మీరు అలా కలవరుగా. అందుకే మన పనులకు ఆఫీసులో కొర్రీలు ఎదురవుతున్నాయ్’ అతడేం చెబుతున్నాడో అర్థమైంది. కట్టాల్సిన ట్యాక్స్ కన్నా ముందు, ఆడిట్ ఫీజు కన్నా ముందు అనఫీషియల్ ఆఫీస్ ఫీజు చెల్లించుకోవాలి. లేకుంటే అంతే. ‘మనల్ని కూడా అడగొచ్చుగా’ అంది. ‘ఆడవాళ్లను ఎలా అడగడమా అని మొహమాట పడుతున్నారు. అలాగని వదిలేయలేకపోతున్నారు.
అందుకే మన పని సాగట్లేదు’ ఆడా. మగా. ఇద్దరికీ ఒక్క క్రోమోజోమే తేడా. చిన్న బ్యాలెన్స్ తేడా. అంతమాత్రానికే పురుష ప్రపంచం వేరు స్త్రీ ప్రపంచం వేరు అయిపోయింది. ఇంతలో పక్క క్యూబికల్‌లో నుంచి చిన్న అరుపు వినిపించింది. అసిస్టెంట్ అమ్మాయి దాదాపు స్పృహ తప్పి పడిపోయింది. ఇంకో అసిస్టెంట్ అమ్మాయి, మగ అసిస్టెంటు, తను కంగారు కంగారుగా అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి ముభావంగా ఉన్నది ఇందుకేనా. ఆరోగ్యం సరిలేకనా? ‘తీవ్రంగా బ్లీడింగ్ అవుతోంది. డిస్‌ఫంక్షనల్ యుటినర్ బ్లీడింగ్. ఉదయం మొదలై ఉండాలి. ఇప్పటిదాకా హాస్పిటల్‌కి రాకుండా ఏం చేస్తున్నట్టు? నీలాంటి లేడీబాస్ ఉంటేనే చెప్పుకోలేకపోయిందే ఇక మగబాస్ అయితే చచ్చి ఊరుకునేది.
ఏం తలరాతలో మనవి’ అంటూ డాక్టర్ ఫ్రెండ్ విసుక్కుంటూ ట్రీట్‌మెంట్ మొదలెట్టింది. అవును... ఈ తలరాతలు ఎవరు రాశారు? ఇలాంటి అవకతవకల బ్యాలెన్స్ షీట్ ఎవరు తయారు చేశారు. దీనిని సరిచేసేదెవరు? కథ ముగిసింది. చంద్రలత రాసిన ‘ఆవర్జా’ కథ ఇది. అంటే ‘లెడ్జర్’ అని అర్థం. లోకంలో మగవాళ్లు ఉండటం సమస్య కాదు. కాని వాళ్ల మధ్య ఒక బ్రదర్‌హుడ్ ఉండటం సమస్య. డాక్టర్లంతా ఒక గ్రూప్ అవుతారు. ఐఏఎస్‌లంతా ఒక గ్రూప్ అవుతారు. లాయర్లంతా ఒక గ్రూప్ అవుతారు. ఆడిటర్లు... జర్నలిస్టులు... ప్రొఫెసర్లు... పొలిటీషియన్లు... వీళ్ల మధ్య మతలబులు నడుస్తుంటాయి. ఆ మతలబులకు ఆడవాళ్లు అడ్డం. అందుకని వాళ్లను రానివ్వరు. పోనీ వాళ్ల దారిన వాళ్లను పోనివ్వరు. మగవాళ్లే ఇటుకలుగా మారి అన్ని చోట్లా ఆడవాళ్లకు ప్రవేశం లేకుండా గోడలు కట్టి ఉన్నారు. కాని ఆడవాళ్లు ఊరుకోరు. సంకల్పం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ అనే గునపాలతో ఆ గోడలను కూల్చి అవతల పారేస్తారు. తథ్యం.
- చంద్రలత
Comments
Please login to add a commentAdd a comment