ఓ తండ్రి తీర్పు | Natwar Singhvi succeeds in the Bombay High Court on the sons case | Sakshi
Sakshi News home page

ఓ తండ్రి తీర్పు

Published Fri, Jul 27 2018 12:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Natwar Singhvi succeeds in the Bombay High Court on the sons case - Sakshi

ఏ తండ్రీ పిల్లలు ఓడిపోవాలని అనుకోడు. పిల్లల గెలుపే తన గెలుపు అనుకుంటాడు.పిల్లల గెలుపులో తను ఓడినా పర్వాలేదనుకుంటాడు. అయినా కొన్నిసార్లు మౌనంగా ఉండలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే నట్వర్‌ సింఘ్వీకి వచ్చింది. కొడుకుపై బాంబే హైకోర్టులో కేసు వేసి గెలిచాడు. తన గెలుపుతో ఎంతో మంది తల్లిదండ్రులకు  అన్యాయం జరక్కుండా చూశాడు. 

ఉస్మానియా హాస్పిటల్‌ ప్రాంగణం. చెట్టు కింద ఓ పండుటాకు. పేరు నరసయ్య(పేరు మార్చాం). వయసు డెబ్బైకి పై మాటే. సరైన పోషణ లేక, అనారోగ్యంతో మనిషి పీల్చినట్లయిపోయాడు. కాలికి కట్టుంది. ఆ కట్టు కూడా బాగా మాసిపోయి ఉంది. ఎండిన రక్తపు మరకల మీద ఈగలు వాలుతున్నాయి. పది రోజులుగా అతడు అదే చెట్టు కింద ఉంటున్నాడు. హాస్పిటల్‌ సిబ్బంది అతడి గాయానికి కట్టు కట్టేటప్పుడే ‘తాతా నువ్వు హాస్పిటల్‌లో ఉండాల్సిన పని లేదు. కట్టు కట్టించుకుని ఇంటికెళ్లిపోవచ్చు’ అని చెప్పారు. వాళ్లైతే చెప్పారు కానీ తన కొడుకు అలా చెప్పలేదు. ‘ఇక్కడే కూర్చుని ఉండు మళ్లీ వస్తా’ అని చెప్పి వెళ్లి పోయాడు. ఆ వెళ్లడం పది రోజులైనా రాలేదు. ఈ పదిరోజుల్లో హాస్పిటల్‌ సిబ్బంది నాలుగైదు సార్లు అతడిని హెచ్చరించారు. ‘చెట్టు కింద ఇలా రోజుల పాటు ఉండిపోకూడదు’ అని మృదువుగా చెప్పి చూశారు. తర్వాత మందలించారు. ఇక ఆ రోజైతే ఏకంగా ‘నీ కొడుకు రాకపోతే మేమేం చేయం. వెళ్లు’ అని ఈసడించుకున్నారు కూడా. ఆ కొడుకు వచ్చేవాడు కాదని అందరికీ తెలుస్తోంది. కానీ ఆ తండ్రికే తెలియడం లేదు. ముసలి గుండె.. బిడ్డ వస్తాడన్న నమ్మకంతో కొట్టుకుంటోంది. 

హైదరాబాద్‌ నగర శివారు. హైవే మీద వాహనాలు వెళ్తున్నాయి. హైవే నుంచి ఒక రోడ్డు లోపలికి దారి తీస్తోంది. రోడ్డు పక్కనే చిన్న బస్‌ షెల్టర్‌. లోపల ఊరు ఉన్నట్లుంది. బస్‌ షెల్డర్‌లోని సిమెంట్‌ బెంచి మీదున్న వృద్ధురాలు వచ్చే ప్రతి కారునూ ఆశగా చూస్తోంది. వేగం తగ్గించి షెల్టర్‌ దగ్గర ఆగుతుందేమోననే ఆశ ఆమె కళ్లలో. వేగం తగ్గకుండా వెళ్లిపోతున్న కారు వైపు నిరాశగా చూస్తోంది. పశువులు తోలుకుని వెళ్తున్న ఓ మధ్యవయస్కుడు అక్కడ ఆగి ఆమె వైపు చూశాడు. ‘తమ ఊరి మనిషి కాదు, చూడడానికి బాగా బతికిన మనిషిలాగానే ఉంది. నిన్న సాయంత్రం పశువులను ఇంటికి తోలుకెళ్లేటప్పుడూ ఇక్కడే ఉంది. అప్పట్నుంచి ఒక్కర్తే అలా ఉండిపోయిందేమిటి’... అనుకుంటూ ‘‘పెద్దమ్మా! ఒక్కదానివే ఉన్నావేంటి’’ అని పలకరించారు. ‘‘నా కొడుకు, కూతురు, నేను మా చుట్టాల ఊరికి బయలుదేరాం బాబూ. మా కారు చెడిపోయింది, రిపేరు చేయించుకుని వస్తామని నన్నిక్కడ కూర్చోబెట్టి వెళ్లారిద్దరూ. దగ్గర్లో రిపేరు చేసే వాళ్లు లేరో ఏంటో. ఇంకా రాలేదు. తాగడానికి కొద్దిగా నీళ్లివ్వు నాయనా’’ అని అడిగిందామె.

తన దగ్గరున్న నీళ్లు ఇస్తూ మాటలు కలిపాడతడు. ముసలావిడ భర్త పోయి నాలుగేళ్లయింది. భర్త సంపాదించిన ఇంట్లోనే కొడుకుతో కలిసి ఉండేదామె. ఇల్లు, ఇతర ఆస్తులు తమ పేర విడిగా రాయమని కొడుకు, కూతురు ఒత్తిడి చేశారు. తన తదనంతరం ఏ ఆస్తిని ఎవరు తీసుకోవాలనే వివాదం రాకూడదనుకుంది ముసలావిడ కూడా. ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద రాసేసింది. పెద్దావిడ మాటలను బట్టి ఏం జరిగిందో పశువులు తోలుకెళ్తున్న అతడికి అర్థమైంది. ‘పట్నాల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు కూడా ఇదేం మాయరోగమో. తల్లికి పిడికెడు మెతుకులు పెట్టడానికే కష్టపడుతున్నారు’ అనుకున్నాడు. అతడి ఆవేదన నిజమే. ఫ్యాషన్‌గా కట్టుకున్న ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు ఉండటానికి కూడా ఇష్టపడని వాళ్లు చాలా మందే కనిపిస్తున్నారిప్పుడు. 
     
ఆస్తినంతా పిల్లలకు ఇచ్చిన తర్వాత అవసానదశలో ఇబ్బందులు పడేవాళ్లెందరో రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. పిల్లల నిరాదరణ వల్ల పెద్ద వయసులో సరైన తిండిలేక, మందులు లేక బతుకీడ్చేవాళ్లెందరో. భార్యాభర్తలిద్దరూ కిరోసిన్‌ పోసుకుని కలిసి మండిపోయిన ఉదంతాలూ లేకపోలేదు. మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు అనే తేడా లేకుండా ఇలా ఎంతో మంది వృద్ధులు.. ఉన్నదంతా పిల్లలకు రాసిచ్చి, అనాథలవుతున్నారు. దీనికి పరిష్కారమే లేదా? వీరిని ఆదుకునే చట్టం లేదా? ఉంది!అయితే పిల్లలు తమను ఎంత నిర్లక్ష్యం చేసినా సరే... సమాజం ముందు, చట్టం ముందు వాళ్లను దోషిగా నిలబెట్టడానికి కన్నపేగు అంగీకరించదు. ఎంతో పెనుగులాటకు గురైన వాళ్లు మాత్రం, ఇక మరో మార్గం లేదనిపించినప్పుడు మాత్రమే న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు. రెక్కలొచ్చిన పిల్లల సంరక్షణలో బతుకు వెళ్లదీసే అదృష్టం ఎలాగూ లేదు, కనీసం చట్టం రక్షణలో శేషజీవితాన్ని గౌరవంగా గడుపుదామనే ఆశతో న్యాయపోరాటానికి దిగుతున్నారు. ముంబైలో జరిగిన పై ఉదంతం అలాంటిదే.

చట్టంలోని కీలకమైన అంశాలు
‘తల్లిదండ్రులు,   వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం (2007)’ ఇలా చెబుతుంది. ఒక వృద్ధుడు తనకు ఆలనాపాలనా, సంరక్షణ, సదుపాయాలు కల్పిస్తాడనే షరతుతో ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మి అతనికి బహుమతిగా కానీ, మరేరకంగానైనా తన ఆస్తిని బదిలీ చేసి ఉండి.. ఆ తర్వాత ఆ వ్యక్తి వృద్ధుడిని సరిగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే (అంటే షరతును ఉల్లంఘిస్తే) ఆ ఆస్తి బదిలీని సెక్షన్‌ 23 ప్రకారం రద్దు చేసుకునే అధికారం వృద్ధుడికి ఉంటుంది. అలాగే తన సంతానానికి బహుమతిగా కానీ, సెటిల్‌మెంట్‌గా రిజిస్ట్రేషన్‌ చేసినటువంటి ఆస్తి లావాదేవీని కూడా రద్దు చేసుకుని తమ ఆస్తి మీద పూర్తి హక్కులను తిరిగి సొంతం చేసుకోవచ్చు. వీలునామా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. తమ ఆస్తి తమ తదనంతరం సంతానానికి చెందేటట్లు రాసినప్పటికీ చివరి వరకు ఎప్పుడైనా సరే ఆ వీలునామాను రద్దు చేస్తూ కొత్త వీలునామా రాసుకోవచ్చు.  తల్లిదండ్రులనూ, వయోవృద్ధులనూ  నిరాదరణకు గురిచేసినా, వదిలేసి వెళ్లిపోయినా సెక్షన్‌ 24 ప్రకారం 3 నెలల జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్షను ఆరు మాసాలకు పెంచుతూ ఈ ఏడాది సవరణ జరిగింది. తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్ల నుంచే కాక కోడళ్లు, అల్లుళ్ల నుంచి కూడా పోషణ లేదా భరణం పొందవచ్చు. ‘కుటుంబము’ అంటే కోడళ్లు, అల్లుళ్లు కూడా అని ఈ ఏడాది చట్టాన్ని సవరించారు. 

పిల్లల నుంచి భరణం పొందొచ్చు!
వయోజనులకు, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, భద్రత కోసం పటిష్టమైన చట్టమే ఉంది. వయసు పై బడిన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. పేదవారైన వృద్ధులకు వృద్ధాశ్రమాలు నెలకొల్పడం, వృద్ధుల ఆస్తులకు రక్షణ కల్పించడం, పిల్లల నుంచి కాలయాపన, ఖర్చు లేకుండా సత్వరం భరణం పొందేలాగ ఏర్పడిన చట్టమే.. ‘తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టము 2007’. ఈ చట్టం ప్రకారం... ‘తల్లిదండ్రులు తమ సంతానం (సొంత పిల్లలు, దత్తత తీసుకున్న పిల్లలు, సవతి పిల్లలు) నుంచి భరణం పొందవచ్చు. ఇక్కడ పిల్లలు అంటే... ఆడ, మగ ఇద్దరూ. కూతుళ్లు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడానికి వీల్లేదు. ఒకవేళ వృద్ధుల సంతానం మరణించినట్లయితే... వారి సంతానం (మనుమలు, మనుమరాళ్లు) బాధ్యత వహించాలి. ఒకవేళ... వృద్ధులకు పిల్లలు లేకపోతే... తమ ఆస్తికి చట్టరీత్యా ఎవరు వారసులు అవుతారో (తదనంతరం) వారి నుంచి పోషణ కోసం భరణం పొందవచ్చు. అనాథలు, పేదవారైన వృద్ధుల విషయానికి వస్తే... వారి కోసం వృద్ధాశ్రమాలు స్థాపించి సరైన వైద్య సేవలు, పోషణ, రక్షణ, వినోద సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెబుతోంది చట్టం. 
– ఇ. పార్వతి, హైకోర్టు న్యాయవాది

తండ్రి వర్సెస్‌ కొడుకు
నట్వర్‌ కేశవ్‌లాల్‌ సింఘ్వికి ముంబయి, బ్రూక్లిన్‌ హిల్స్‌లో ఫ్లాట్‌ ఉంది. తన ఫ్లాట్‌లో యాభై శాతం వాటాను తన కొడుకు ప్రీతిష్‌కి బహుమతిగా ఇస్తూ రిజిస్టర్‌ చేశాడతడు. కొడుకు, కోడలితోపాటు కేశవ్‌లాల్‌ అతడి భార్య కూడా అదే ఇంట్లో ఉండేవారు. కొన్నాళ్లకు కొడుకు, కోడలి వేధింపులు భరించలేక కేశవ్‌లాల్‌ దంపతులు అద్దె ఇంటికి మారిపోయారు. కొడుకు నిరాదరణపై టిబ్యునల్‌ను ఆశ్రయించాడు కేశవ్‌లాల్‌. ప్రీతిష్‌ దంపతులు కేశవ్‌లాల్‌ దంపతులను నిరాదరణకు గురి చేస్తున్నారనే వాదనతో సంతృప్తి చెందిన మేజిస్ట్రేట్‌ ఆ ఫ్లాట్‌ను తిరిగి ఆయనకే ఇప్పించడం జరిగింది. ‘తల్లిదండ్రులు,   వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టాన్ని (2007)’ అనుసరించి ఈ తీర్పు వెలువడింది. దీని ప్రకారం 2007 తర్వాత సంతానానికి రాసిచ్చిన ఆస్తులను, సంతానం సరిగ్గా చూడకపోతే తల్లిదండ్రులు తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.  
– వాకా మంజులారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement