నవయువం | navayuvam | Sakshi
Sakshi News home page

నవయువం

Published Fri, Aug 23 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

నవయువం

నవయువం

 సకలకళామౌళిఒక పక్కన సంగీతం.మరోపక్క సంప్రదాయ నృత్యం.
 ఇంకోపక్క సినీ గీత రచన, గానం.తండ్రి నుంచి సాహిత్యం, తల్లి కోరిక మేరకు సంగీతనాట్యాల అభ్యాసం.ఎన్నో బహుమతులు అందుకొని-‘శభాష్’ అనిపించుకున్నాడు.
 బహుముఖ ప్రతిభ చాటుకుంటున్న రాకేందుమౌళితో సంభాషణ...
 మొదటి అవకాశం...
 రధన్ అనే మ్యూజిక్ డెరైక్టర్‌కు తెలుగులో స్క్రాచ్ వెర్షన్ పాడాలని, నా ఫ్రెండ్ నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయన ‘తననా తననా తననా...’ అంటూ ఒకేలా అంటుంటే... నాకు అర్థం కాలేదు. నేను డమ్మీ లిరిక్స్ ఇస్తానని చెప్పి, ఇచ్చాను. అప్పుడు డెరైక్టర్ హను రాఘవపూడి నా లిరిక్స్ చూసి కొన్ని లైన్స్ మార్పు చేసి ఇవ్వమన్నారు. కొన్నిరోజుల్లోనే ఆయనకు పాట పూర్తిచేసి ఇచ్చాను. ఆ పాటే... ‘అందాల రాక్షసి’ చిత్రంలోని ‘ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు...’. ఆ తర్వాత ఇంకో పాట రాసే అవకాశం ఇచ్చారు. పాట రాసే ముందు... ప్రేమను మధ్యస్థంగా తీసుకొని దానికి కుడి, ఎడమ ఎక్స్‌ట్రిమిటీ వచ్చేలా రాయమన్నారు డెరైక్టర్‌గారు. అదే ‘మనసు పలికే ఆశ ప్రేమ...’ అనే పల్లవితో ప్రారంభమైన పాట. చరణాల్లో ‘ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ...’ అని రాసి ఇచ్చాను. చిత్రమేమిటంటే నేను రాసిన పాటను పాడే అవకాశం కూడా నాకే ఇచ్చారు ఆయన. ఈ పాటకు ఈ మధ్యనే సౌత్ ఇండియా రేడియో మిర్చి అవార్డుల (2012) ప్రదానోత్సవంలో తెలుగుకు గాను అప్ కమింగ్ లిరిసిస్ట్‌గా, సింగర్‌గా రేడియో మిర్చి అవార్డులు అందుకున్నాను.
 
 తెలుగు భాషలో స్టేట్ ఫస్ట్...
 మా అమ్మ (ప్రమీల) గారి ఊరు గుంటూరు. నాన్న వెన్నెలకంటి(సినీ రచయిత) గారిది నెల్లూరు. నేను గుంటూరులో పుట్టాను. అయితే నాకు మూడేళ్లు వచ్చేవరకు నెల్లూరులో ఉన్నాం. నాన్న ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లవలసివచ్చింది. 10వ తరగతిలో తెలుగు లాంగ్వేజ్‌లో స్టేట్‌ఫస్ట్ వచ్చింది. అమ్మకు చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం నేర్చుకోవాలని ఉండేది. కానీ కుదరలేదు. ఆవిడ కోరికను తీర్చడానికి, నాగమణి గారి దగ్గర తొమ్మిది సంవత్సరాలు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇంకా భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు చేశాను. ఎన్నో కచేరీలు కూడా ఇచ్చాను. బహుమతులూ అందుకున్నాను.
 సపోర్ట్: నాన్నకి సాహిత్యంలో పట్టు ఉండటం, అన్నయ్య శశాంక్ వెన్నెలకంటి కూడా రచయిత కావడంతో దాదాపు మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. చిన్నప్పటి నుండి  నాకు అన్నయ్య సలహాలు, సూచనలు ఇస్తుండేవాడు. నాన్న ఎన్నో పాటలను రాసినా, ఆయన శైలికి భిన్నంగా నా శైలి ఉండటానికే ప్రయత్నిస్తుంటాను. పాట పూర్తై తర్వాత నాన్నగారికి చూపిస్తాను.
 
 నటనపై ఆసక్తి...
 నాకు నటించడమంటే చాలా ఇష్టం. ఇప్పటికే రెండు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాను. మరో రెండు షార్‌‌టఫిలిమ్స్‌కు ఒకదానికి కథ, ఇంకోదానికి స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వస్తోంది. వాటి గురించి ఆలోచించాలి.
 
 ప్రేరణ ఇచ్చారు...
 నాకు తెలుగు ఇంత బాగా రావడానికి కారణం మా తల్లిదండ్రులు, అన్నయ్య, నా గురువులు. కమల్‌హాసన్‌గారు కూడా ఒక కారణమనే చెప్పాలి. ఆయన 24 ఫ్రేమ్స్‌లో అనుభవం ఉన్నవారు. మైకేల్ జాక్సన్ కూడా నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్. మా అమ్మ నన్ను ఉద్యోగం చేయమంటే నేను చేయలేదు. చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యం నేర్చుకున్నాను. సాహిత్యంలో కాస్త పరిచయం ఉంది. అందువల్ల నేను ఉద్యోగం చేయలేనని గట్టిగా చెప్పేశాను. అలా చెప్పినందుకు అమ్మ చాలా బాధ పడింది. కాని ఇప్పుడు నాకు వస్తున్న సినిమా అవకాశాలను చూసి సంతోషిస్తోంది.
 
 బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా...
 నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు ఆంధ్రనాటక కళాపరిషత్(మద్రాస్)లో ఒక నాటకంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. అందులో నటించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది బాలనటులు వచ్చారు. అందరిలోనూ నేను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంపిక కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. బెస్ట్‌చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాసరి నారాయణరావుగారి చేతుల మీదుగా స్వర్ణపతకాన్ని అందుకున్నాను. ఒకసారి మా ైెహ స్కూల్‌లో ఆల్ ఇండియా కేమ్లిన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరిగాయి. అక్కడ నేను వేసిన పెయింటింగ్‌కి బహుమతి అందుకోవడం కూడా మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుతం నేను హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నాను. అలాగే కొన్ని సినిమాలకు పాటలు రాస్తున్నాను, పాడుతున్నాను. రచన సహకారం అందిస్తున్నాను, అసిస్టెంట్ డెరైక్టర్‌గా కూడా పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించి 24 ఫ్రేమ్‌ల్లోనూ రాణించాలనేది నా కల.
 - నాగేష్
 
 నేను ఉద్యోగం చేయలేనని గట్టిగా చెప్పేశాను. అలా చెప్పినందుకు అమ్మ చాలా బాధ పడింది.
 కాని ఇప్పుడు నాకు వస్తున్న సినిమా అవకాశాలను చూసి సంతోషిస్తోంది.    
 - రాకేందుమౌళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement