ఆ మిగిలిన గడ్డను ఇప్పుడు తీసేయవచ్చా?
మా నాన్నగారి వయసు 65 ఏళ్లు. విపరీతమైన తలనొప్పి వస్తుంటే ఒక పెద్ద ఆసుపత్రిలో చూపించాం. మెదడులో ట్యూమర్ ఉందని చెప్పి, గతేడాది ఆగష్టులో ఆపరేషన్ చేశారు. కానీ గడచిన పదిహేను రోజులుగా మళ్లీ నొప్పి వస్తుండటంతో ఆ ఆసుపత్రిలోని డాక్టర్లను కలిశాం. మళ్లీ పరీక్షలు చేయించి, ట్యూమర్‌లోని కొంతభాగం మిగిలిపోయినట్లు గుర్తించారు. 3టీ ఐఎంఆర్‌ఐతో గడ్డను ఇప్పుడు సమూలంగా తొలగిస్తామని అంటున్నారు. ఈ 3టీ ఐఎంఆర్‌ఐ ఏమిటి? కిందటిసారి అలా జరగడంతో ఇప్పుడు మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వివరించండి. – ఆర్. కృపారాణి, సంగారెడ్డి
ఇటీవలి కాలంలో మెదడులోని గడ్డల తొలగింపు ఆపరేషన్‌ను చాలా ఎక్కువగా ప్రభావితం చేసిన అత్యాధునిక ఉపకరణమే 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. దీన్ని సంక్షిప్తంగా 3టీ ఐఎంఆర్‌ఐ అంటారు. మొదట్లో వైద్య పరీక్షలకు ఎక్స్‌రే, తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారైలపై ఆధారపడిన విషయం తెలిసిందే.
ఇది తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఐఎంఆర్‌ఐ (ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై)తో ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే శరీరం అంతర్భాగంలోని అవయవాలకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను ఇది అందిస్తుంది. దీని సహాయంతో నాడీవైద్యనిపుణులు గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు మెదడులోని గడ్డలను తొలగించగలుగుతున్నారు. ఈ ఉపకరణం అందుబాటులోకి వచ్చాక బ్రెయిన్ సర్జరీల విషయంలో మునుపటి కంటే ఎక్కువ కచ్చితత్వంతో, సునిశితత్వంతో ఫలితాలు సాధించడానికి అవకాశం వచ్చింది.
ఈ ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారైతో మెదడులో ఉన్న గడ్డలు, పార్కిన్‌సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ ట్రెమర్స్) వంటి వ్యాధులకు కూడా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మెదడులోని ఇతర ఆరోగ్యకరమైన కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా నిర్వహించేందుకు వీలుంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించవచ్చు.
అకస్మాత్తుగా బలహీనపడ్డ కాలూ–చేయి... ఎందుకిలా?
నా వయసు 29 ఏళ్లు. సివిల్ ఇంజనీర్‌ను. రోజూ ఈతకు వెళ్తా. ఇటీవల ఒక రోజు ఈతకు వెళ్లి వస్తుండగా, దారిలో బలహీనంగా అనిపించింది. ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టమైంది. డాక్టర్‌ను కలిస్తే ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. ఎందుకిలా జరిగింది? పరిష్కారం ఏమిటి? వివరంగా చెప్పండి. – మనోహర్ ప్రసాద్, హనుమకొండ
మీ సమస్యకు ఈత కారణం కాదు. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల అవి చిట్లడం జరగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరోవీనస్ మాల్ ఫంక్షన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా, బలహీనంగా అనిపించిందని చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.
ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనుల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటారు. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి.
మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభావ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి.
హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్ ఏర్పడి ఉండవచ్చు. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్‌కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది.
మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ చిన్నదిగానే అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదమూ పొంచి ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి, జాగ్రత్త వహించండి.
ఆ ట్యూమర్లతో నా వినికిడి శక్తి దెబ్బ తిన్నది... పరిష్కారం చెప్పండి
నా వయసు 38 ఏళ్లు. మెదడులో గడ్డ ఏర్పడిందని గుర్తించి పదకొండేళ్ల కిందట శస్త్రచికిత్స చేశారు. ఆ ట్యూమర్ (గడ్డ) తొలగించాక ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ చెవిలో ఇప్పుడు నిరంతరం శబ్దం వస్తోంది. మరో ఎనిమిదేళ్లకు ఇంకో గడ్డను గుర్తించి రేడియేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో చెవిలోనూ శబ్దాలు వస్తున్నాయి. సరిగా వినిపించడం లేదు. చెవిలో హోరు తగ్గేదెలా? నా వినికిడి శక్తి మెరుగుపడటానికి మార్గం ఉందా? దయచేసి తెలియజేయండి. – కె. దయాకర్, వరంగల్
మెదడులో ట్యూమర్లు... మెదడు, కేంద్రనాడీ మండలంలోని వివిధ రకాల కణాల నుంచి ఏర్పడతాయి. బినైన్, మాలిగ్నెంట్ అని వీటిలో రెండు రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకొని ఉండవు. అందువల్ల అవి ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలైతే, వీటిని సులభంగా తొలగించి వేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకాలు కావు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా... ఇవి మళ్లీ తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ మెదడులో ఏర్పడినవి బినైన్ ప్రైమరీ ట్యూమర్లు కావచ్చు. ఒకవైపు తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడ్డాయి.
మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తూ, శరీరంలోని వేర్వేరు అవయవాలను/భాగాలను నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగంలో మెదడు తన విధులను నిర్వహంచడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, శరీరంలోని వివిధ భాగాల్లో / అవయవాల పనితీరులో దాని ప్రభావం కనిపిస్తుంది. పదకొండేళ్ల కిందట మీరు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటితో పోలిస్తే... మెదడు ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు అసాధారణమైన మార్పులు వచ్చాయి.
మెదడులో ఏర్పడిన ట్యూమర్లను ఇప్పుడు సమూలంగా తొలగించడంతో పాటు, వారు సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధం చేయడం కూడా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో భాగంగా రూపొందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం చేయకుండా, మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమరును తొలగించివేయగల ఆధునిక వైద్య పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
అందువల్ల మీరు మరోసారి డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్యపరిస్థితిని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సరైన విధానాన్ని మీకు సూచించగలుగుతారు. ఇక మీ వినికిడి శక్తిని పునరుద్ధరించే విషయంలో
ఈఎన్‌టీ వైద్యనిపుణుడి సాయం అవసరమా అని కూడా నిర్ధారణ చేస్తారు.
- డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment