తిరుపతి తుడా : ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఓ నిడు ప్రాణాన్ని బలితీసుకుంది. సీఎం సహాయ నిధి కోసం ఏడాదిన్నరగా అర్థించి అలసిపోయిన ఓ రోగి చివరకు తనువు చాలించాడు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని లింగేశ్వరనగర్‌కు చెందిన కరణప్రసాద్ (70) కొన్నేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో ఏడాదిన్నర క్రితం అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
7నెలల క్రితం మళ్లీ సమస్య తలెత్తడంతో రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు వ్యయమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక కరణప్రసాద్ ఏడాదిన్నరగా సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుగుణమ్మను వేడుకుంటున్నాడు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరింత వేదనకు గురయ్యాడు. తాజాగా 4 రోజుల క్రితం మళ్లీ ఎమ్మెల్యేను కలిస్తే గురువారం రావాలని సూచించారు. దీంతో ఆయన గురువారం ఎమ్మెల్యే ఇంటికి చేరుకునాడు. ఎంతోసేపు నిరీక్షించిన కరుణప్రసాద్ నీరసంతో ఎమ్మెల్యే ఇంటి గుమ్మం ముందే కుప్పకూలిపోయాడు. అతన్ని 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment