
పోలోమని.. ఫాలో!!
ఫ్యాషనమ్మా ఫ్యాషన్!ఒకరేస్తే వెయ్యిమంది వేసే ఫ్యాషన్!
ఫ్యాషనమ్మా ఫ్యాషన్!
ఒకరేస్తే వెయ్యిమంది వేసే ఫ్యాషన్!
వెయ్యిమంది వేస్తే లక్షమంది అనుసరించే ఫ్యాషన్!
మరి అది ‘పోలో’ఫ్యాషన్ అయితే, పోలోమని ఫాలో అవరూ!!
►అమెరికా జాతీయ జెండా నక్షత్రాలు లారెన్ చేతిలో కొత్తగా మెరిసాయి. అంతేకాదు, ఆ జెండాలోని చారలనూ తన డిజైన్స్‌లో చూపించి, మెప్పించడం లారెన్‌కే దక్కింది.
►షర్ట్స్‌కి ఉపయోగించే చెక్స్, లైన్స్, ప్రింట్లు గల మెటీరియల్‌ని పొట్టి, పొడవు గౌన్లుగా రూపొందించడంలోనూ, సింపుల్ కట్‌తో ‘ఔరా!’ అనిపించడంలోనూ లారెన్‌ది ప్రత్యేకమైన స్టైల్.
►లారెన్ లాంగ్ మ్యాక్సీ గౌన్ ధరిస్తే మత్స్య సుందరి కళ్ల ముందు సాక్షాత్కరించిందా అనిపిస్తుంది. ఇలా ఒకే రంగుతో లారెన్ చేసే మాయాజాలం ఫ్యాషన్ ప్రియులను అబ్బురపరుస్తుంది.
►లారెన్ దుస్తులలో ధైర్యం, చొరవ ఈ రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఫ్యాషన్ వేదిక అయినా, అవార్డు వేడుకలైనా సెలబ్రిటీల ఓటు లారెన్ డ్రెస్‌కే .
►వెడ్డింగ్ గౌన్స్‌లోనూ లారెన్ ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అందుకు మన భారతీయ కళనూ అందుకున్నాడు. లాంగ్ గౌన్స్‌లో మనదైన ఎంబ్రాయిడరీ కళను చూపిస్తూనే పాశ్చాత్య స్టైల్‌ని కళ్లకు కట్టాడు.
►ఒక్క రెడ్ మార్క్‌తో డ్రెస్‌కి ఓ కొత్త లుక్‌ని తీసుకురావడంలో లారెన్ ఎప్పుడూ ముందుంటారు. లాంగ్ వైట్ ఫ్రాక్‌కి రెడ్ స్టైలిష్ కట్ న్యూయార్క్ వేదికల మీద ఇలా వైబ్రెంట్‌గా వెలిగిపోయింది.
► జార్జెట్, షిఫాన్..ఏ సిల్క్ మెటీరియల్ అయినా లారెన్ కట్‌తో ఇలా కొత్తగా మెరిసిపోవాల్సిందే! బెల్ట్ ఫ్రాక్‌కి జత చేస్తే మోడ్రన్ లుక్‌తో అదరగొట్టేస్తారు.
ఉమెన్ షర్ట్
‘పోలో’ ఆటగాడు ఉన్న గుర్తు మహిళల దుస్తుల్లో ఛాతీ మీద ఉండేలా, చొక్కా కఫ్ కనిపించేలా మొదటిసారి పరిచయం చేసిన సాహసికుడు రాల్ఫ్ లారెన్. ఆధునిక మహిళ భావాలను ఒడిసిపట్టుకున్న రాల్ఫ్ మగవారికోసం రూపొందించే షర్ట్ స్టైల్‌ని మహిళల దుస్తులలో ఉపయోగించారు.
రెడ్ కార్పెట్‌ని ఊడ్చేసిన బ్లేజర్స్!
‘పాతదనం అంటే చాలా ఇష్టం’ అని ఎప్పుడూ వేదికల మీద చెప్పే లారెన్ నావీ బ్లేజర్ లుక్‌ని తన సూట్‌లలో పరిచయం చేశాడు. ఆఫీసువేర్‌లో భాగం అయిన బ్లేజర్స్‌ని అతివల మేనిపై స్టైలిష్‌లుక్‌తో మెరిపించాడు. హాలీవుడ్ అగ్రతారలే కాదు మన బాలీవుడ్ భామలైన ప్రియాంకాచోప్రా, దీపికాపదుకొనే వంటి నటీమణులు సైతం రాల్ఫ్ లారెన్ లాంగ్ బ్లేజర్స్‌ని ధరించి ప్రఖ్యాత వేదికల మీద అందరినీ ఆకట్టుకున్నారు. బ్లేజర్స్‌తో పాటు పిల్లల స్కూల్ యూనిఫామ్ మోడల్స్, అధికార ప్రతినిధులు ధరించే సూట్స్, సాడెల్ షూస్‌ని సరికొత్తగా చూపించాడు. సంప్రదాయ వెడ్డింగ్ గౌన్స్‌లోనూ గ్లామర్ ఒలికించే వినూత్న శైలిని చూపించాడు లారెన్.
పాశ్చాత్య దేశాలలో పేరొందిన ఆట ‘పోలో’. గుర్రంపై వెళుతూ వెళుతూ పొడవాటి స్టిక్‌తో కింద ఉన్న బాల్‌ని కొట్టడం ఈ ఆటలో చూస్తాం. ఇదే వేగాన్ని దుస్తులలో చూపించాలి అనుకున్నాడు యాభై ఏళ్ల క్రితం రాల్ఫ్ లారెన్. ఆ ‘పోలో’ గేమ్ అతని దుస్తులకు బ్రాండ్ నేమ్ అయ్యింది. ‘పోలో’మని ప్రపంచంలోని ధనికులందరినీ తన డిజైనర్ దుస్తుల కోసం ఫాలో అయ్యేలా చేసింది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచ ఫ్యాషన్ పదిమంది ధీరులలో లారెన్‌ని ఒకరిగా నిలిపింది. 77 ఏళ్ల వయసులో ప్రపంచవ్యాప్త పేరిన్నిగన్న ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ (పి అండ్ జి) గ్రూప్‌కి అధ్యక్షుడిగా ఉన్న లారెన్ ఫ్యాషన్ కార్పోరేషన్ దుస్తుల తయారీలో చేసే అద్భుతాలు ఎన్నో! ఎన్నో ఫ్యాషన్ అవార్డులు అందుకున్న లారెన్ తన 28 ఏళ్ల వయసులో మెన్స్ టైలను డిజైన్ చేసే చోట చేరాడు. టై తయారీలో బెస్ట్ అనిపించుకున్నాడు. తర్వాత మెన్స్‌వేర్, ఆ తర్వాత ఉమెన్స్‌వేర్, అటు తర్వాత చిల్డ్రన్‌వేర్‌ని ప్రపంచంలోని తన ఔట్‌లెట్‌ల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. అలాగే ఇంటీరియర్ కలెక్షన్, రెస్టారెంట్స్, జువెలరీ రంగంలోనూ కాలుమోపి విజయాలను అందుకున్నాడు.