ఫెంటాస్టిక్ ఫోర్ | new stories coming soon | Sakshi
Sakshi News home page

ఫెంటాస్టిక్ ఫోర్

Published Thu, Aug 25 2016 10:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫెంటాస్టిక్ ఫోర్ - Sakshi

ఫెంటాస్టిక్ ఫోర్

కథలు కంచిలో దొరుకుతాయో లేదో కాని బాలీవుడ్‌లో మాత్రం కచ్చితంగా దొరుకుతాయి. ఒకప్పుడు ఠాకూర్ ఘరానా కథలు, బందిపోట్ల కథలు, సంపన్న కుటుంబాల కథలతో మూస సినిమాలు తయారయ్యే బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త కథల వెతుకులాట, అందుకు అవసరమైతే రిస్క్ తీసుకునే తత్వం పెరిగింది. మంచి కథ... ఒప్పించే నెరేషన్... ఇవి రెండూ ఉంటే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని నమ్ముతున్నారు. ప్రేక్షకులు కూడా ఆ మాట నిజం చేస్తున్నారు. ‘వెయిటింగ్’, ‘తీన్’, ‘ఉడ్‌తా పంజాబ్’, ‘మదారి’... ఇవన్నీ ఇటీవల భిన్నమైన కథాంశాలతో బాలీవుడ్‌లో మెరిసిన సినిమాలు.


నిన్న మొన్న విడుదలైన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’లో ఇష్టం లేని పెళ్లి నుంచి పారిపోదామనుకున్న పెళ్లికూతురు సరాసరి పాకిస్తాన్‌లో తేలుతుంది. ఇక అక్కణ్ణుంచి ఇండియా ఎలా చేరిందనే అంశాన్ని నవ్వులతో చెప్పడం వల్ల ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారాల్లో రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల కథాకమామీషు...

 

అకీరా
సెప్టెంబర్ 2న విడుదల. ఇది తమిళ సినిమా ‘మౌనగురు’కి రీమేక్. సాధారణంగా దర్శకుడు మురుగదాస్ సొంత కథలతో సినిమా తీస్తాడు. కాని కరుణానిధి మనవడు అరుళ్‌నిధి నటించిన ఈ సినిమా ఐదేళ్ల క్రితానిది. అయినప్పటికీ ఇందులోని కథ, కథనం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేది కనుక మురుగదాస్ హిందీలో సోనాక్షీతో రీమేక్ చేశాడు. తమిళంలో హీరో పాత్రను హిందీలో హీరోయిన్‌గా మార్పు చేయడం విశేషం. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. నారా రోహిత్ హీరో. కె.ఎస్.రామారావు సమర్పణ. కిన్ను నిర్మాత.  పేరు ‘శంకర’. అయితే ఎందుకనో విడుదలలో జాప్యం ఉంది. ఈ సినిమాకు హాలీవుడ్ మూలం ‘ఫార్‌గో’ అని చెప్పవచ్చు. అందులో దివాళా తీసిన ఒక భర్త తన ఆర్థిక అవసరాల కోసం సొంత భార్యనే కిడ్నాప్ చేయమంటాడు.

కాని ఎంతో సింపుల్ అనుకున్న ఆ విషయం చాలా పాశవికమైన హత్యలకు దారి తీస్తుంది. ‘అకీరా’లో ఒక కారు యాక్సిడెంట్‌లో దొరికిన భారీ డబ్బును పోలీసులు సొంతం చేసుకుంటారు. కాని ఆ ఒక్క సంఘటన అనేక దారుణాలకు కారణం అవుతుంది. ఆ దారుణాలలో హీరోయిన్ చిక్కుకుంటుంది. ఆసక్తికరమైన ఈ కథను వెండితెర మీద చూడాల్సిందే.

 

బార్ బార్ దేఖో
సెప్టెంబర్ 9న విడుదల. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో పరిచయమైన సిద్ధార్థ మల్హోత్రా ఇందులో హీరో అయితే కుర్ర హీరో అయినప్పటికీ పక్కన నటించడానికి అంగీకరించిన హీరోయిన్ కత్రినాకైఫ్. ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి గొప్ప సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేసిన నిత్య మెహ్రా అనే కొత్త దర్శకురాలు రాసుకున్న ఈ కథ కరణ్ జోహార్‌ను కూడా ఆకట్టుకుని నిర్మాతగా మారేలా చేసింది. మొదట ఈ సినిమాలో హీరోగా ఆమిర్‌ఖాన్ గానీ హృతిక్ రోషన్ గానీ నటిస్తారనుకున్నారు. చివరకు సిద్ధార్థకు దక్కింది. కొంచెం సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో హీరో వయసు రోజులు గడిచే కొద్దీ మారిపోతూ ఉంటుంది.

ఒక్కరోజులో పదహారు సంవత్సరాలు గడిచిపోతాయి. దానికి తగినట్టుగా అతడి ప్రేమ కథ కూడా మారిపోతూ ఉంటుంది. తనకే తెలియని తన గతాన్ని వెనక్కి తిప్పడానికి అతడేం చేశాడనేది కథ. దీని ప్రోమోకు విశేషమైన ఆదరణ లభించింది. రవి కె.చంద్రన్ వంటి సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ పని చేయడం మరో ఆకర్షణ. కత్రినా కొంచెం అరమరికలు లేకుండా తన సౌందర్యాన్ని ప్రదర్శించిందని భోగట్టా. అభిమానులు అందుకోసం కూడా ఎదురుచూస్తున్నారు.

 

ఫ్రీకీ అలీ
సెప్టెంబర్ 9న విడుదల. నవాజుద్దీన్ సిద్దిఖీ ఏ ముహూర్తాన ‘బజరంగీ భాయ్‌జాన్’ చేశాడో కానీ సల్మాన్ మనసును ఇట్టే గెలిచేశాడు. సల్మాన్ తమ్ముడు సొహైల్‌ఖాన్ ఇప్పుడు సిద్దిఖీని పెట్టి ‘ఫ్రీకీ అలీ’ అనే సినిమా తీశాడు.  సల్మాన్ సమర్పకుడు. హాలీవుడ్ సినిమా ‘హ్యాపీ గిల్‌మోర్’ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఒక పేవ్‌మెంట్ వ్యాపారి పెద్ద గోల్ఫ్‌స్టార్ కావడం గురించి హాస్య రసస్పోరకంగా చర్చిస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ పేవ్‌మెంట్ మీద చడ్డీలు అమ్ముతుంటాడు. పార్ట్‌టైమ్‌గా ఒక దాదాగారితో వెళ్లి రౌడీ మామూళ్లు వసూలు చేస్తుంటాడు.  కాని అతడికి క్రికెట్‌లో షాట్స్ కొట్టే సహజమైన టాలెంట్ ఉంటుంది.


ఒకరోజు ఒక గోల్ఫ్ కోర్టులో ఒక పెద్ద మనిషి దగ్గర రౌడీ మామూలుకు వెళ్లిన సిద్ధిఖీ అతడు ఎంతకూ షాట్ కొట్టకపోవడం గురించి బూతు జోక్ వేస్తాడు. దాంతో ఆయన నీకు అంత సత్తా ఉంటే నువ్వు షాట్ కొట్టి చూపించు అంటాడు. సిద్దిఖీ కచ్చితంగా షాట్ కొడతాడు. అందరూ హతాశులవుతారు. అప్పటి నుంచి సిద్ధిఖీకి గోల్ఫ్ స్టార్ కావాలని ఉంటుంది. అందుకు ఎటువంటి అడ్డంకులు వచ్చాయనేది కథ.

 

పింక్
సెప్టెంబర్ 16న విడుదల. అమితాబ్‌తో ‘పికూ’ తీసి పెద్ద హిట్ కొట్టిన సూజిత్ సర్కార్, ఇప్పుడు అనిరుధ్‌రాయ్ చౌదురి దర్శకత్వంలో ‘పింక్’ పేరుతో అమితాబ్ ముఖ్యపాత్రగా ఈ సినిమా నిర్మించాడు. సమాజంలో జరుగుతున్న స్త్రీల పై అత్యాచారాలు నేపథ్యం. ముగ్గురమ్మాయిలు ఒకరాత్రి షికారుకెళుతుంటే ముగ్గురు కుర్రాళ్లు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారు. కేస్ అవుతుంది. అయితే పలుకుబడి ఉన్న ఈ కుర్రాళ్ల తరుఫువారు ఆ అమ్మాయిల్ని అప్రతిష్టపాలు చేయాలని వారిపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తారు. దీనిని ఖండించడానికి అమ్మాయిలు చాలా అవస్థ పడాల్సి వస్తుంది.

‘బైపోలార్ డిజార్డర్’, అంటే తరచూ మారిపోయే భావావేశాల జబ్బుతో బాధపడే లాయర్ అయిన అమితాబ్ వీరిని ఈ కేసు నుంచి ఎలా బయటపడేశాడన్నది కథ. తాప్సీ ముఖ్యపాత్రను పోషించింది. ప్రోమో రిలీజైన వెంటనే చాలామంది బాలీవుడ్ సూపర్‌స్టార్లు కథాంశాన్ని మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా మంచి ఫలితాలను రాబడుతుందని అందరి ఆకాంక్ష.


ఈ నాలుగు సినిమాలే కాదు... ఎం.ఎస్.ధోని, రాక్ ఆన్ 2, కహానీ 2, దంగల్ వంటి సినిమాలు ఈ సంవత్సరాంతం వరకూ ప్రేక్షకులను చేరనున్నాయి. తెలుగు సినిమాలు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. కొత్త రకం కథే ఇప్పుడు విజయానికి పాస్‌పోర్ట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement