
గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే... అది రక్తప్రసారాన్ని పూర్తిగా అడ్డుకునే స్థాయికి చేరితే గుండెపోటు వస్తుందని అందరికీ తెలుసు. మరి అవసరానికి తగ్గట్టుగా రక్తనాళాలు విశాలమైతే? కొవ్వు పేరుకునే అవకాశమే ఉండదు. గుండెపోటు, జబ్బులు రానేరావు. బాగానే ఉందిగానీ.. ఇదెలా సాధ్యం అంటున్నారా? స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పనిచేయగల ఓ ప్రొటీన్‌ను గుర్తించారు. జీపీఆర్ 68 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ రక్తప్రవాహాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్టుగా డైలేట్ (విశాలంగా మారడం) కావాలని ఆర్టీరియోల్స్ అనే చిన్నస్థాయి రక్తనాళాలకు సందేశాలు పంపుతాయని వీరు గుర్తించారు. రక్తప్రసరణ వేగంలో వచ్చే మార్పులను రక్తనాళాలు గుర్తించగలవని దశాబ్దాలుగా తెలుసునని, అయితే అదెలా జరుగుతోందన్న విషయం ఇప్పటివరకూ తెలియలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆర్డెన్ పటపౌటియన్ తెలిపారు.
రక్తనాళాలను తలపించే ఓ యంత్రాన్ని తయారుచేసి.. అందులో ద్రవాలు ప్రవహించేటప్పుడు గోడల్లో లాంటి మార్పులు వస్తున్నాయేమోనని గుర్తించడం ద్వారా తాము జీపీఆర్ 68 గురించి తెలుసుకున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల్లోనూ జీపీఆర్ 68 ప్రొటీన్ మన రక్తనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని వివరించారు. ఈ నేపథ్యంలో జీపీఆర్ 68ను ప్రేరేపించగల మందులను తయారు చేయగలిగితే, భవిష్యత్తులో గుండెజబ్బులను నియంత్రించేందుకు అవకాశముంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment