new treatment
-
ఇన్ఫెక్షన్లకు కొత్త చికిత్స
సంగారెడ్డి టౌన్: ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఎసెన్షియల్ ఆయిల్ బేస్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్కు ట్రీట్మెంట్ చేయవచ్చని మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ ముద్రికా ఖండేల్వాల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఆర్థిక సాయం చేసింద న్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అమెరికన్ మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్ ఏటీఅండ్‌టీ సాయం చేసిందన్నారు. యాంటీఫంగల్ ఫ్యాంటీ లైనర్లను అభివృద్ధి చేసి చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాల నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్నామన్నారు. తమ పరిశోధన పత్రానికి కోఆథర్గా పీహెచ్డీ విద్యార్థిని శివకల్యాణి ఉన్నారని, ఈ పత్రాన్ని అంతర్జాతీయ జర్నల్ మెటెరియేలియాలో ప్రచురితమైందన్నారు. -
క్యాన్సర్ కాటుకు కొత్తచికిత్సల దెబ్బ!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 90 లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. అయితే ఎన్నెన్నో పరిశోధనల కారణంగా క్రమంగా కొత్త చికిత్స విధానాలు, కొత్త ప్రక్రియలు, కొత్త మందులు, కొత్త పరీక్షలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా గతంలో 85% కేసులు ప్రాణాంతకంగా ఉండగా...ఇప్పుడు దాదాపు 85% క్యాన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. క్యాన్సర్ చికిత్స రంగంలో ఇంకా ఎన్నెన్నో కొత్త ఆశారేఖలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నేడు క్యాన్సర్ డే సందర్భంగా వాటిలో కొన్నింటి గురించిన వివరాలు... ప్రపంచంలో ఏదైనా కొత్త మందు లేదా చికిత్స విధానం రోగులకు అందుబాటులోకి రావాలంటే... రోగికి అది సురక్షితమైందా, ఏమేరకు లాంటి అనేక అంశాలను అనేక దశల్లో పరిశీలించి అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) అనే అత్యున్నత సంస్థ అనుమతులను ఇస్తుంది. గత ఏడాది అది 18 కొత్త రకాలైన క్యాన్సర్ చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చింది. క్యాన్సర్ ప్రక్రియల వల్ల 13 రకాల ఉపయోగాలను కొత్తగా కనుగొన్నట్లు ప్రపంచానికి వెల్లడించింది. వ్యక్తిగతమైన ఔషధాలు : ఒక రకం క్యాన్సర్‌కు ఒక మందు కనుక్కున్నారని అనుకుందాం. అప్పుడు ఆ రకం క్యాన్సర్ రోగులందరూ వాడాల్సిందే. అయితే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఇచ్చే మందులైన ఇమ్యూనోథెరపీ అనే ప్రక్రియలూ, ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే పట్టి పట్టి చంపేసే టార్గెట్ థెరపీలలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ఫలితంగా ఊపిరితిత్తుల, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో మునుపెన్నడూ ఊహించనంత పెను మార్పులు వచ్చాయి. వాటి వల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. అందరూ క్యాన్సర్ రోగులకూ గంపగుత్తగా ఒకే మందు వాడటానికి బదులు... ఆ మందును మరింత ప్రభావపూర్వకంగా మార్చేందుకు వీలున్న మరో ప్రక్రియకు ఎఫ్‌డీఏ ఇటీవల అనుమతిని ఇచ్చింది. స్వభావంలోనూ, ఒక మందుకు స్పందించే విషయంలోనూ వ్యక్తికీ వ్యక్తికీ మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా అతడి జన్యుపరిస్థితిని, జన్యువుల తీరుతెన్నులను పరిశీలించి, ఒక అవయవంలో క్యాన్సర్ ఉన్న స్థానాన్ని బట్టి... ఇలాంటి కొన్ని అంశాల ఆధారంగా ఆ మందులలో మార్పులు చేసి, అవి ఆ వ్యక్తిలో మరింత ప్రభావపూర్వకంగా, బలంగా పనిచేసేలా చేస్తారు. ఇలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పనకే ఇటీవల ఎఫ్‌డీఏ అనుమతులను ఇచ్చింది. దీన్నే ‘పర్సనలైజ్డ్ థెరపీ’ అని చెప్పవచ్చు. ఇది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఒక చికిత్సాప్రక్రియ. టీఆర్కే ఫ్యూజన్ ప్రోటీన్ : క్యాన్సర్ చికిత్సల కోసం పరిశోధకులు ప్రతిరోజూ కొత్తదారులు వెదుతుకూనే ఉన్నారు. ఆ మార్గాల్లో పయనిస్తూ, కొత్త చికిత్సా ప్రక్రియలను కనుగొంటున్నారు. క్యాన్సర్ కూడా ఒక కణమే కదా. అన్ని కణాలకు ఉన్నట్లే దానికీ ఒక జన్యుపటలం ఉంటుంది. కాకపోతే ఆరోగ్యకరమైన కణంలా కాకుండా అది విభిన్నంగా, విపరీతంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ కొత్తమార్గంలో చూసినప్పుడు దాని జన్యుపటలంలోని ప్రోటీన్ల గొలుసుల్లో(‘ప్రోటీన్ చైన్’లో) ఏదైనా మార్పులు చేయడం వల్ల అది తనకు తానుగా నశించిపోతుందేమోనంటూ పరిశోధకలు పరిశీలించారు. ఇది కూడా క్యాన్సర్ రోగులకు వ్యాధి పూర్తిగా తగ్గేలా చేసే ఒక ప్రక్రియ అనీ, త్వరలోనే అది అందుబాటులోకి వస్తే అది క్యాన్సర్ చికిత్సా రంగంలోనే ఓ పెద్ద మార్పు తీసుకొస్తుందనే ఆశలున్నాయి. హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీని మరింత విస్తృత పరచడం : సాధారణంగానైతే కీమోథెరపీని నిర్దిష్టంగా ఒక చోట కాకుండా శరీరమంతటా ఆ మందు ప్రవహించేలా డాక్టర్లు ఇస్తుంటారు. అయితే శస్త్రచికిత్స ద్వారా కడుపును తెరచి, ఆ కడుపు కుహరంలో కీమోథెరపీకి ఉపయోగించే మందును ఉంచడం ద్వారా ఇచ్చే చికిత్సను ‘హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ (హెచ్ఐపీఈసీ) అని అంటారు. సాధారణ కీమోథెరపీలో మందు శరీరమంతటికీ విస్తరిస్తుంది కదా... కానీ ఈ హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో మందు కేవలం కడుపు ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ విశేషమైన వేడికి పుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను భస్మం చేస్తుంది. సాధారణ కణాలకు తనను తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంటుంది. ఫలితంగా ఈ ప్రక్రియలో దెబ్బతిన్న సాధారణ ఆరోగ్యకరమైన కణాలు మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. కానీ భస్మమైన క్యాన్సర్ కణాలు మళ్లీ పుట్టవు. అలాగే దెబ్బతిన్న క్యాన్సర్ కణాలకు తమను తాము రిపేర్ చేసుకునే శక్తి ఉండదు. ఈ అంశం ఆధారంగా ఈ ప్రత్యేకమైన థెరపీని కడుపునకు సంబంధించిన కొన్ని క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. క్యాన్సర్ చికిత్సలో కృత్రిమ మేధస్సు సహాయం తీసుకోవడం : ఊహల్లోనూ మన మేధస్సుకు ఒక సరిహద్దు లేదు. అయిప్పటికీ ఎన్నో సంక్లిష్టమైన నిర్మాణాలతో ఉండే జన్యుపటలం లాంటి అంశాలను కేవలం మనిషి ఒక్కడే (అంటే మ్యాన్యువల్‌గా) విశ్లేషిస్తూ అర్థం చేసుకోవడంలో ఎంతో సమయం పట్టవచ్చు. ఆ సమయం ఆదా అయ్యే విధంగా మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సే క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను అర్థం చేసుకునేలా ప్రోగ్రామ్ చేస్తారు. దాని విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా ధ్వంసం చేయవచ్చో తేలిగ్గా తెలిసిపోతుంది. ఇలా క్యాన్సర్‌పై పోరాటంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సు కూడా సహాయం చేస్తోంది. ఇవీ... ఇటీవల క్యాన్సర్ రంగంలో చోటు చేసుకున్న, చేసుకోబోతున్న విప్లవాత్మకమైన మార్పులు. ఇవన్నీ త్వరలోనే దాదాపుగా ‘క్యాన్సర్ రహిత లోకం’ వైపునకు బాటలు పరుస్తాయేమోనని ఆశాభావంతో రాబోయే తరాలు ఎదురుచూస్తున్నాయి. సాధారణ మూత్రపరీక్షతోనే క్యాన్సర్‌ను తెలుసుకోవచ్చు లక్షణాలను బట్టి కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోయి, చికిత్సకు లొంగకుండా పోవడం అన్నది కొన్ని సందర్భాల్లో కనిపించే అవకాశం ఉండటం ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్ కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో రొమ్ము క్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతో మంది మహిళల ప్రాణాలు నిలబడతాయి. ఇదీ క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి ‘ఈ–నోస్’ (ఎలక్ట్రానిక్ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. డాక్టర్ ఏవీఎస్ సురేశ్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నానోకణాలతో కేన్సర్‌కు కొత్త చికిత్స..
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడి. ఇది కేన్సర్ విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థ కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుందని.. తద్వారా వ్యాధి ముదిరిపోయేందుకు అవకాశముంటుందన్నది తెలిసిన విషయమే. కేన్సర్ కణితి చుట్టూ ఏర్పడే రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలను, మందులను కూడా అడ్డుకోవడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్ స్టేట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిపై ప్రయోగాలు చేశారు. కేన్సర్ కణితిలోని కణాలను తీసుకుని వాటిల్లోకి కేన్సర్ చికిత్సకు వాడే మందులను జొప్పించారు. ఈ కణాలను మళ్లీ శరీరంలోకి జొప్పించినప్పుడు అవి కేన్సర్ కణాల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని నేరుగా కణితిపై దాడి చేయగలిగింది. సాలెగూడు పోగులు, బంగారు నానో కణాలు, తెల్ల రక్తకణాలతో గతంలో ఇలాటి ప్రయత్నం జరిగినప్పటికీ అంతగా ప్రభావం లేకపోయింది. తాజాగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్’తో తయారైన నానో కణాల్లోకి గెలోనిన్ అనే మందును జొప్పించి తాము ప్రయోగాలు చేశామని కణితినుంచి సేకరించిన గొట్టంలాంటి నిర్మాణాల్లోకి వీటిని చేర్చి ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సియాంగ్ ఝెంగ్ తెలిపారు. -
గుండెజబ్బులకు కొత్త చికిత్స...?
గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే... అది రక్తప్రసారాన్ని పూర్తిగా అడ్డుకునే స్థాయికి చేరితే గుండెపోటు వస్తుందని అందరికీ తెలుసు. మరి అవసరానికి తగ్గట్టుగా రక్తనాళాలు విశాలమైతే? కొవ్వు పేరుకునే అవకాశమే ఉండదు. గుండెపోటు, జబ్బులు రానేరావు. బాగానే ఉందిగానీ.. ఇదెలా సాధ్యం అంటున్నారా? స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పనిచేయగల ఓ ప్రొటీన్‌ను గుర్తించారు. జీపీఆర్ 68 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ రక్తప్రవాహాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్టుగా డైలేట్ (విశాలంగా మారడం) కావాలని ఆర్టీరియోల్స్ అనే చిన్నస్థాయి రక్తనాళాలకు సందేశాలు పంపుతాయని వీరు గుర్తించారు. రక్తప్రసరణ వేగంలో వచ్చే మార్పులను రక్తనాళాలు గుర్తించగలవని దశాబ్దాలుగా తెలుసునని, అయితే అదెలా జరుగుతోందన్న విషయం ఇప్పటివరకూ తెలియలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆర్డెన్ పటపౌటియన్ తెలిపారు. రక్తనాళాలను తలపించే ఓ యంత్రాన్ని తయారుచేసి.. అందులో ద్రవాలు ప్రవహించేటప్పుడు గోడల్లో లాంటి మార్పులు వస్తున్నాయేమోనని గుర్తించడం ద్వారా తాము జీపీఆర్ 68 గురించి తెలుసుకున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల్లోనూ జీపీఆర్ 68 ప్రొటీన్ మన రక్తనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని వివరించారు. ఈ నేపథ్యంలో జీపీఆర్ 68ను ప్రేరేపించగల మందులను తయారు చేయగలిగితే, భవిష్యత్తులో గుండెజబ్బులను నియంత్రించేందుకు అవకాశముంటుందని చెప్పారు. -
సాలెగూడు స్ఫూర్తితో..
టైప్–1 మధుమేహానికి చికిత్సను ఆవిష్కరించారు చైనా శాస్త్రవేత్తలు. సాలెగూడు స్ఫూర్తిగా తయారుచేసిన ఓ పోగులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐస్లెట్ కణాలు వేలకువేలు ఉంచి.. శరీరంలో అమర్చడం ఈ పద్ధతిలో కీలకమైన అంశం. ఈ రకమైన మధుమేహంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుందన్నది తెలిసిన విషయమే. ఫలితంగా టైప్–1 మధుమేహం బారిన పడినవారు తరచు ఇన్సులిన్‌ను ఎక్కించుకోవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఐస్లెట్ కణాలను శరీరంలోకి చొప్పించడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటిరవకూ బోలెడు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. శరీరం ఈ కొత్త కణాలను నిరోధించే సమస్యను ఎదుర్కొనేందుకు మరిన్ని మందులు వాడవలసి రావడం దీనికి ఒక కారణం. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు నానో స్థాయిలో అతి సూక్ష్మమైన రంధ్రాలున్న ఓ పోగును తయారుచేసి అందులో ఈ ఐస్లెట్ కణాలను ఉంచారు. సాలెగూడు పోగంత పలుచగా ఉండటమే కాకుండా... కణాలను తనలో దాచుకోగలగడం వీటి ప్రత్యేకత. అవసరమైనప్పుడు దీన్ని సులువుగా తీసేసే అవకాశమూ ఉంటుంది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక అంగుళం పొడవైన పోగును రెండు రోజుల పాటు ఇన్సులిన్ అవసరం లేకుండా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
అద్భుత శోధన
సాక్షి, అమరావతి: హీమోఫీలియా (నిరంతర రక్తస్రావం) వ్యాధికి అద్భుత చికిత్స ఆవిష్కృతమైంది. చిన్న గాయమైనా చాలు నిరంతర రక్తస్రావంతో బాధపడే రోగులకు తీపివార్త ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జబ్బుతో బాధపడుతున్న లక్షలాది మంది బాధితులకు ఈ పరిశోధన ధైర్యాన్నిచ్చింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ హిమటాలజీ, యూనివర్శిటీ ఆఫ్ పిట్స్బర్గ్, రాయల్ కాలేజీ ఆఫ్ లండన్, ఫిలడెల్ఫియా చిల్డ్రన్ హాస్పిట్ వైద్యులు డా.లిండ్సే జార్జ్, కార్నెల్ మెడికల్ కాలేజీ వైద్యులు డా.రొనాల్డ్ జి క్రిస్టల్ తదితర వైద్య బృందాలు కొన్నేళ్లుగా జరిపిన అద్భుత పరిశోధన ఫలితాలే ఇవి అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నిరంతరంగా జరిగిన పరిశోధనలు సత్ఫలితాలనివ్వడమే కాదు, వైద్యపరిశోధనలకు బైబిల్‌గా చెప్పుకునే ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనా పత్రాల్లోనూ ఈ చికిత్స ఫలితాలు ప్రచురితమయ్యాయి. జీన్ థెరపీతో చికిత్స... హీమోఫీలియా వ్యాధి ఉన్న వారికి చిన్న గాయమైనా రక్తస్రావం ఆగదు. ఈ వ్యాధి బాధితులు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్ వల్ల చిన్న గాటు ఏర్పడినా గంటల తరబడి రక్తం కారుతూనే ఉంటుంది. రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. వీరిలో ఫాక్టార్–8, ఫాక్టార్–9 అనే ప్రొటీన్ల లోపం కారణంగా ఇలా నిరంతర రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఫాక్టార్8, ఫాక్టార్ 9 ఇంజక్షన్లతో బాధితులు చికిత్స తీసుకునే వారు. ఈ ఇంజక్షన్ ధర ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.40వేల వరకూ ఉంటుంది. ఇది కూడా తాత్కాలిక చికిత్సే. దీనికి అమెరికా, బ్రిటన్‌కు చెందిన వైద్యులు జీన్ థెరపీ పేరుతో శాశ్వత పరిష్కారాన్ని కనుగొ న్నారు. హీమోఫీలియా రెండు రకాలుగా ఉంటుంది. హీమోఫీలి యా ఎ, హీమోఫీలియా బి అనేవి. చికిత్సలో భాగంగా ఆరోగ్యవంతుడి నుంచి ఫాక్టార్ 9 ప్రొటీన్ కణాలను తీసుకుని ఒక వైరస్ (మనిషికి హానిచేయని–మోడిఫై చేసిన ఎడెనా అసోసియేటెడ్ వైరల్) నుంచి వ్యాధిగ్రస్థుడి కాలేయంలోని కణాల్లోకి ఎక్కిస్తారు. వాస్తవానికి ఫాక్టార్ 9 ప్రొటీన్లను కాలేయంలోని కణాలే ఉత్పత్తి చేస్తాయి. కృత్రిమంగా వైరస్ ద్వారా ఎక్కించిన ఈ కణాలు కాలేయంలోని కణాలను ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పలువురు రోగులకు ఈ పరీక్షలు చేసిన అనంతరం ఫలితాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధనలో వారం నుంచి 6 నెలల వరకూ ఈ కణాల ఉత్పత్తి, పనితీరు పరీక్షించగా ఆశించిన రీతిలో పనిచేస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని, తక్కువ వ్యయంతో శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాధితులు భారీగానే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సుమారు 20 వేల మందికి పైగానే హీమోఫీలియా బాధితులు ఉన్నట్టు తేలింది. వీళ్లందరూ ప్రస్తుతం ఫాక్టార్ ఇం జక్షన్లతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఖరీదైన ఇంజక్షన్లు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఒక్కోసారి వీటికి కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వాలు కూడా హీమోఫీలియా బాధితుల ఇంజక్షన్ల కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జన్యుపరమైన కారణాలు లేదా వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వాలు తీవ్ర భారంగా పరిగణిస్తుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఒక్కోసారి ప్రభుత్వాస్పత్రుల్లో ఇంజక్షన్లు లేకపోవడంతో బయట మెడికల్ స్టోర్లలో కొనుగోలు చేసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాయల్ డిసీజ్‌గా గుర్తింపు... ఈ జబ్బు రాయల్ డిసీజ్‌గా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇంగ్లండ్, జర్మనీ, రష్యా, స్పెయిన్ వంటి దేశాల్లో రాచరిక వ్యవస్థ ఉండేది. రాచరిక వంశస్థులనే ఎక్కువగా పెళ్లాడేవారు. దీంతో వారసత్వంగా ఈ జబ్బు వచ్చేది. 1837–1901 మధ్య కాలంలో ఉన్న ఇంగ్లండ్ రాణి క్వీన్ విక్టోరియాకు ఈ జబ్బు వచ్చింది. రాచరిక వ్యవస్థలో ఎక్కువమందికి వచ్చేది. అందుకే దీన్ని ‘రాయల్ డిసీజ్’గా వైద్యులు చెప్పుకుంటారు. -
బ్రెస్ట్ క్యాన్సర్‌కు కొత్త చికిత్స!
న్యూయార్క్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఓ కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కేవలం 11 రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఈ కొత్త ఔషధం ప్రభావవంతంగా తొలగిస్తుందని బ్రెస్ట్ క్యాన్సర్ యురోపియన్ అసోసియేషన్ సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. హెచ్ఈఆర్2 రకానికి చెందిన బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలపై హెర్సెప్టిన్, లాపాటినిబ్ ఫార్ములాతో ఉన్న కొత్త ఔషధం మంచి ఫలితాలను ఇచ్చిందని సదస్సు చీఫ్ ఎగ్జిక్యుటీవ్ సమియా అల్ ఖాదీ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడిన చికిత్స విధానాలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధక బృందం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్ఈఆర్2 బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన సుమారు 250 మందిపై పరిశోధనలు జరిపి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిర్థారించారు.