బ్రెస్ట్ క్యాన్సర్కు కొత్త చికిత్స!
న్యూయార్క్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఓ కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కేవలం 11 రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ను ఈ కొత్త ఔషధం ప్రభావవంతంగా తొలగిస్తుందని బ్రెస్ట్ క్యాన్సర్ యురోపియన్ అసోసియేషన్ సదస్సులో పరిశోధకులు వెల్లడించారు.
హెచ్ఈఆర్2 రకానికి చెందిన బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలపై హెర్సెప్టిన్, లాపాటినిబ్ ఫార్ములాతో ఉన్న కొత్త ఔషధం మంచి ఫలితాలను ఇచ్చిందని సదస్సు చీఫ్ ఎగ్జిక్యుటీవ్ సమియా అల్ ఖాదీ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో కూడిన చికిత్స విధానాలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధక బృందం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్ఈఆర్2 బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన సుమారు 250 మందిపై పరిశోధనలు జరిపి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిర్థారించారు.