పరిమితంగా సేవిస్తే మేలే
స్పెయిన్ పరిశోధనలో వెల్లడి
వైన్ చరిత్ర ఇప్పటిది కాదు. ప్రాచీన కాలంలోనే పులిసిన ద్రాక్ష రసాన్ని సేవించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. వైన్ మంచిదా, కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై రకరకాల అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని , నష్టమేనని మరికొన్ని చెబుతుంటాయి. అయితే మితంగా సేవిస్తే గుండె భద్రంగా ఉంటుందని స్పెయిన్‌లో జరిగిన తాజా పరిశోధన వెల్లడించింది. రోజూ చిన్న గ్లాస్ పరిమాణంలో వైన్ తీసుకుంటే హృదయం పదిలమని సైంటిస్టులు గుర్తించారు.
అంతేకాదు, వైన్ సేవించాక మాంసాహారం కాకుండా శాకాహారం తీసుకుంటే మరింత చక్కటి ఫలితాలుంటాయని వారు పేర్కొనడం విశేషం! 60 ఏళ్లు దాటాక గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుంది. ఇలాంటి వారిపైనే పరిశోధన చేశారు. 1,232 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీరంతా టైప్ 2 డయాబెటీస్ లేదా అధిక కొలె్రస్టాల్, రక్తపోటు, అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారే.
గుండె జబ్బుల బాధితుల కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. వారికి నిత్యం సగం, లేదా గ్లాసు వైన్ ఇచ్చారు. వైన్ సేవించని వారితో పోలిస్తే వీరిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ముప్పు 50 శాతం తగ్గినట్లు తేల్చారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
⇒ పరిమితంగా వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ రోజుకు గ్లాసు కంటే అధికంగా సేవిస్తే కొత్త రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన డాక్టర్ రమోన్ ఈస్ట్రచ్ చెప్పారు.
⇒ చక్కటి ఆహారానికి తోడు ఒక గ్లాసు వైన్‌తో మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని సూచించారు.
⇒ ఈ పరిశోధన ఫలితాలపై నిపుణులు అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. గుండెకు సంబంధించే పరిశోధన సాగింది తప్ప అల్కహాల్‌తో తలెత్తే ఇతర అనారోగ్యాలను పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు.
⇒ వైన్ కూడా మద్యమే. తక్కువ మోతాదులో సేవించే వైన్‌తో కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) రిస్క్ తగ్గుతుందని స్పెయిన్ పరిశోధన తేలి్చంది. కానీ ఇతర అవయవాల సంగతి ఏమిటన్నది గుర్తించలేదని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ ట్రాసీ పార్కర్ చెప్పారు. ‘‘వైన్‌తో సహా ఏ రకమైన మద్యమైనా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. గుండెతో పాటు లివర్ దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన కూడా
పడతారు’’ అన్నారు.
⇒ గుండె ఆరోగ్యానికి వైన్ మంచిదన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయమేనని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు
చెందిన ప్రొఫెసర్ పాల్ లీసన్ అన్నారు. ‘‘ఇతర అవయవాల పరిస్థితినీ దృష్టిలో పెట్టుకోవాలి. మోతాదు మించితే గుండెతోపాటు కీలకావయవాలు దెబ్బతింటాయి’’ అని చెప్పుకొచ్చారు.
⇒ వైన్‌తో గుండె భద్రంగా ఉంటుంది కదా అని అదే ఏకైక మార్గం అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ‘‘గుండెను కాపాడుకోవాలంటే మరెన్నో ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. సమతుల ఆహారం, క్రమంతప్పకుండా వ్యాయామం. బరువు పెరగకుండా జాగ్రత్తపడడం, పొగ మానేయడం వంటివి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి’’ అని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment