శక్తి! ఏ ఇంట్లో కనపడుతుంది? ఏ వీధిలో నడుస్తుంది? ఏ ఆఫీసును నడిపిస్తుంది? ఏ వ్యవహారాలు చక్కబెట్టగలుగుతుంది? ఏ కొరివికుండ మోస్తుంది? ఏ ఆస్తి కాగితం మీద సంతకం పెడుతుంది? ఎప్పడు మంచంలో వద్దనగలుగుతుంది? ఎక్కడ తన కంచంలో ఓ ముద్ద వేసుకోగలుగుతుంది? అబ్బ... అంతెందుకు? అసలు ఎన్ని పిండాలలో ఊపిరిపోసుకుంటుంది? సంప్రదాయపు కట్టుబాట్లలో ఇంకెన్నాళ్లు కట్టుబడి ఉంటుంది? దేవత అనీ, పూజనీయురాలనీ, త్యాగమూర్తనీ... ఇంకెన్నాళ్లు మనిషిగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది? ఇంట్లో కొరికినా, వీధిలో కాటేసినా ఇంకెన్నాళ్లు మూగబోయిన విగ్రహంలా ఉండిపోతుంది?
భూమి అంత చైతన్యం రావాలి. ఆకాశమంత అవగాహన కావాలి. నీకు జన్మనిచ్చినదానిని... నువ్వు నాకేమిస్తావు? ఆకాశంలో సగమిస్తావా? భూమ్మీద పూర్తిగా దగా చేస్తావా? వద్దు... నువ్వు నాకు ఇవ్వద్దు. శక్తి ఒకరు ఇస్తే రాదనీ... ఒకరు దోచుకుంటే పోదనీ... వెక్కిరిస్తే దాక్కోదనీ... శక్తి నేనని... తెలుసుకుంటా. తెలియజేస్తా. నేను శక్తి అందమైన రేపటికి నేను శక్తి... దానికి మీరే సాక్షి.
నేను నా గళమెత్తుతాను. అరవగలనని చెప్పడానికి కాదు. గొంతులేని వారి తరఫున వినిపించడం కోసం. – మలాలా యుసాఫ్జాయ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment