![Dussehra 2024: This Shakti Peeth In Gujarat Has No Idol Inside The Sanctum](/styles/webp/s3/article_images/2024/09/27/durga.jpg.webp?itok=a9pvm2I9)
దసరా సందడి కోలహాలం మొదలు కానుంది. ప్రతి చోట సంబరాల హడావిడి మొదలయ్యింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మని భక్తి కొద్ది కొలుచుకుని ఆమె అనుగ్రహంతో సంతోషం ఉండాలని కోరుకుంటారు. అలాంటి పర్వదినాన ఈ పుణ్యభూమిలో అలరారే విశేష శక్తి పీఠాలు స్మరించుకోవడం, సందర్శించడం వంటివి చేస్తుంటాం. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్‌లోని అంబాజీ ఆలయం. అయితే ఈ ఆలయంలో విగ్రహమే భక్తులకు కనిపించదు. కానీ పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారట. ఏంటా ఆలయ విశిష్టత? ఎలా చేరుకోవాలి? తదితర విశేషాలు తెలుసుకుందామా..!
గుజరాత్-రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది ఈ అంబాజీ ఆలయం. మౌంట్ అబు నుంచి రెండు గంటల ప్రయాణం. ఈ ఆలయం అరసుర్ కొండలలో నెలకొంది. ఈ ప్రదేశం అంతా ఆ జగదంబికకే సొంతం. ఇక్కడ వెలిసిన అమ్మవారిని 'అరసురి అంబ' అని, అంబాజీ అని పిలుచుకుంటారు భక్తులు. శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశయే ఈ అంబాదేవి అని భక్తుల నమ్మకం. శివుని విశ్వతాండవం లేదా విధ్వంస నృత్యం సమయంలో సతీదేవి శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. పురాణ ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. దీన్ని సతిదేవి హృదయం పడిన ప్రదేశమని పురాణ వచనం. మరొక కథనం ప్రకారం..ఈ ప్రాంతంలోనే రెండు దేవాలయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంటో గబ్బర్ కొండపై మరొక ఆలయం ఉందట. దీన్ని దేవత నిజ ఆలయంగా చెబుతుంటారు ప్రజలు.
అయితే కొండ ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టంగా ఉండటంతో దంతా రాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అంగీకరించిన దేవతా రాజుకి ఒక షరతు పెడుతుంది. "రాజా నిన్ను అనుసరిస్తూ వస్తుంటాను కానీ వెనదిరగ కూడదు. మాటతప్పితే అక్కడ భూస్థాపితం లేదా అక్కడ వెలవడం జరుగుతుంది." అని రాజుతో చెబుతుంది దేవతా. అందుకు ఒప్పుకున్న రాజు సంతోషంతో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లుతుంటాడు. అయితే కొంత దూరం వెళ్లాక ఆమె పాదాల శబ్దం వినిపంచడం లేదనిపించి గిర్రున వెనుదిరుగుతాడు. అంతే అమ్మ అక్కడే భూమిలోకి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే నేడు భక్తులచే పూజలందుకుంటున్న మహిమాన్వితమైన అంబాజీ దేవాలయం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు బదులుగా దేవత చిహ్నమైన 'శ్రీ వీసా యంత్రం' ఉంటుంది. అది కూడా ముసుగుతో కప్పబడి ఉంటుంది.
ఈ యంత్రాన్ని చూసేందుకు కూడా భక్తులకు అనుమతి లేదు. కానీ ఆలయ పూజారులు విగ్రహాన్ని పోలి ఉండే విధంగా గర్భాలయాన్ని అలంకరిస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతుంది. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించే హారతి(అంటే యంత్రాన్ని పూజించే ముందు వారి కళ్లకు తెల్లటి గుడ్డ కట్టుకోవాలి) అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. ఆ కార్యక్రమంలోనే "గర్భా" అనే జానపద నృత్యాన్ని భక్తిపూర్వకంగా చేస్తారు.
ఏడాదిపొడువునా ఈ ఆలయం భక్తుల కోలాహాలంతో సందడిగా ఉంటుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే "భదర్వి పూనం" ఉత్సవమే ఈ శక్తిపీఠంలో జరిగే అతిపెద్ద వేడుక. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇక్కడే ఐదు జైన దేవాలయాల సముహమైన కుంభారియా అనే జైన దేవాలయాన్ని కూడా చూడవచ్చు. అద్భుతంగా చెక్కబడిన పాలరాతి స్తంభాలకు ఇది ప్రసిద్ధి చెందింది.
ఎలా చేరుకోవాలంటే..
అహ్మదాబాద్ విమానాశ్రయానికి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అబురోడ్ రైల్వే స్టేషన్‌కి 21 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
(చదవండి: దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..! ..!)
Comments
Please login to add a commentAdd a comment