విపక్షాలపై మరోమారు మోదీ విమర్శలు
సేలం(తమిళనాడు)/పాలక్కడ్(కేరళ): పక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శల జడి కొనసాగుతోంది. ‘శక్తి’ని అంతం చేయాలని బయల్దేరిన వాళ్లే నాశనమవుతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా దక్షిణభారత రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మోదీ మంగళవారం సైతం తమిళనాడు, కేరళలో పర్యటించి ప్రచారసభల్లో పాల్గొన్నారు. సేలంలో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణానికి రెండు పార్శా్వలు. అవినీతి, వారసత్వ రాజకీయాలతో అంటకాగాయి. ఇతర మతాలపై పల్లెత్తు మాట అయినా మాట్లాడటానికి జంకే కూటమి పార్టీలు హిందూ మతాన్ని దూషించటానికి ఒక్క క్షణం కూడా ముందూ వెనకా ఆలోచించవు.
ఎన్నికల ప్రచారం ముంబైలో మొదలెట్టిన మొదటిరోజే వారి వైఖరి బట్టబయలైంది. ‘శక్తి’ని నాశనం చేస్తామని ముంబైలో శివాజీపార్క్ సభావేదికగా ప్రకటించారు. హిందూత్వంలో శక్తికి ఉన్న ప్రాధాన్యత, విశిష్టత తమిళనాడులో ప్రతి ఒక్కరికీ తెలుసు. కంచి కామాక్షి అమ్మవారు, ‘శక్తిపీఠం’ మదుర మీనాక్షి అమ్మవారు, సమయపురం మారియమ్మన్... ఇలా అంతా శక్తి స్వరూపిణిలే. శక్తి అంటే మాతృ శక్తి, నారీ శక్తి’ అంటూ సభకు వచ్చిన మహిళలనుద్దేశిస్తూ మోదీ అన్నారు. ‘ఈ శక్తినే విపక్షాలు అంతం చేస్తాయట. కూటమి నేతలు పదేపదే హిందువుల విశ్వాసాలను కించపరుస్తున్నారు.
శక్తిని అంతం చేయాలని చూసిన వాళ్లు నాశనమైన వృత్తాంతాలు మన ఇతిహాసాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనను ఏప్రిల్ 19న తమిళనాడు ప్రజలు పునరావృతం చేస్తారు’ అని అన్నారు. తమిళనాడులో అదే తేదీన 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉన్న సంగతి తెల్సిందే. ‘‘ జాతీయ కవి సుబ్రమణ్య భారతి చెప్పినట్లుగానే నేనూ భరతమాతను శక్తి స్వరూపిణిగానే ఆరాధిస్తా. దేశ నారీశక్తిని ఆరాధిస్తా. నేను శక్తి ఉపాసకుడిని. శక్తిని అంతం చేస్తామన్న వాళ్లను తమిళనాడు ఓటర్లు శిక్షిస్తారు. కోట్లాది తమిళులు ఇస్తున్న గ్యారెంటీ ఇది’’ అని మోదీ అన్నారు.
పాలక్కడ్‌లో భారీ రోడ్‌షో
కేరళలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ మంగళవారం కేరళలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చిన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పాలక్కడ్‌లో రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment