
స్త్రీ పురుషుల శారీరక, భౌతిక ప్రత్యేకతల రీత్యా స్త్రీలు ఇంటిపనికీ, పురుషులు బయటిపనికీ పరిమితమయ్యారు. కాలక్రమేణా స్త్రీలు చేసే ఇంటిశ్రమకు గుర్తింపే లేని పరిస్థితి ఏర్పడింది. శ్రమ విభజన.. పనిలో సైతం స్త్రీ పురుష అంతరాలు కొనసాగిస్తోంది. దీంతో గృహసంబంధిత పనులు స్త్రీలే చేయాలనే భావం, ఉద్యోగం పురుష లక్షణంగా పాతుకుపోయింది. పురుషులు బయటకెళ్లి సంపాదించేవారు కనుక వారికి సమాజం అధిక ప్రాధాన్యమిస్తోంది. స్త్రీలు పిల్లల పెంపకం, వంట, ఇంటిపనులకే పరిమితం. ఆమె చేస్తున్నది అనుత్పాదక పని కనుక ఆమెను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా సమాజం నెట్టివేసింది. ఉత్పాదక రంగంలో ఉన్న పురుషుల శ్రమని లెక్కించొచ్చు. కానీ స్త్రీలు చేసే పనికి కొలమానం లేకుండా నిర్లక్ష్యానికి గురయ్యింది. ఈ ఆర్థికపరమైన విభజన భావనే స్త్రీ పురుష అసమానతలకు పునాది అని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
పెట్టుబడిదారీ సమాజం రెండు రకాలైన శ్రామికులను తయారు చేసింది. తక్కువ వేతనంతో ఎక్కువగా (పనిగంటలు) శ్రమించే వారు ఒకరకం అయితే అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితిలో ఉండి ఎక్కువ వేతనాలు పొందుతూ తక్కువ పనిగంటలు శ్రమించేవారు రెండవ రకం. (ఉదాహరణకు కన్‌స్ట్రక్షన్ పనిలోఉండేవారు) మొదటి రకం శ్రామికులు స్త్రీలైతే, రెండవ రకం వారు పురుషులు. ఈ విభజన పనిలో లింగ వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ. స్త్రీలపై సమాజంలో కొనసాగుతోన్న వివక్షలన్నిటికీ ఇదే మూలం.
గర్భంలో వివక్ష
ఆరోగ్యం, ఆహారం విషయంలో, స్త్రీల పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల అనారోగ్యం కారణంగా ఎందరో స్త్రీలు (మిస్సింగ్ వుమన్) కనపడకుండా పోతున్నారు. ఉండాల్సిన సెక్స్ నిష్పత్తికీ, మనుగడలో ఉన్న సెక్స్ నిష్పత్తికీ మధ్యనున్న తేడానే మిస్సింగ్ వుమన్‌గానూ, స్త్రీలపట్ల కొనసా గుతున్న వివక్షకి కొలమానంగానూ భావిస్తున్నారు.
♦ 2001లో - 3.91కోట్లు భారత దేశంలో మిస్సింగ్ వుమన్ సంఖ్య
♦భారతదేశంలో బాలబాలికల శాతం (0–6 యేళ్లు) ప్రతి 1000 మంది బాలురకి
1991లో - 945 ,2001లో - 927 , 2011లో - 914
♦ 7000మంది మన దేశంలో పుట్టకముందే ప్రతి రోజూ చనిపోతున్న ఆడపిల్లలు
(యునెటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) రిపోర్టు ప్రకారం)
ఆహారంలో వివక్ష
అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో స్త్రీల ఆహారం విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ దేశాల్లో ‘సన్ ప్రిఫరెన్స్’ అత్యధికంగా ఉంది. పురుషులకు ఈ రెండు విషయాల్లోనూ ప్రథమ ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి ఉంది. పురుషులకన్నా స్త్రీలు తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టు అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. పురుషులకన్నా స్త్రీలు 29 శాతం తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు. సాధారణంగా మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం 1,400 కిలో క్యాలరీలు మాత్రమే. నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీకి తక్కువలో తక్కువ అవసరమైనది 1,600 కిలో క్యాలరీలు. కానీ ప్రతి స్త్రీ అవసరమైన దానికన్నా 200 కిలో క్యాలరీలు తక్కువగా తీసుకుంటోంది.
1600 - నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీ కి తక్కువలో తక్కువ అవసరమైన కిలో క్యాలరీలు.
1400 - మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం కిలో క్యాలరీలు
శ్రమలో వివక్ష
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఆహార ఉత్పత్తిని స్త్రీలే సృష్టిస్తున్నారు. భారతీయ స్త్రీ సగటున ప్రతిరోజూ నాలుగు గంటలపాటు లేదా తన జీవితకాలంలో 16 శాతం వంటింటిలోనే గడుపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామికుల్లో 40 శాతం మంది స్త్రీలే. ప్రత్యేకించి వ్యవసాయరంగంలో పనిచేస్తోన్న శ్రామికుల్లో 43 శాతం మంది మహిళలే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి రంగంలో స్త్రీల సంఖ్య పెరగడానికి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు.1980–2008 సంవత్సరాల మధ్య ఉత్పాదక శ్రమ భాగస్వామ్యంలో స్త్రీ పురుష వివక్ష 32 శాతం నుంచి 26 శాతానికి తగ్గినట్టు వరల్డ్ డెవలప్‌మెంట్ 2012 రిపోర్టు తేల్చి చెప్పింది.
ప్రతిఫలంలో వివక్ష
బయటకెళ్ళి పనిచేసేవారిలో స్త్రీలకంటే పురుషులే అధికం. అయితే ప్రధానంగా పేద కుటుంబాల్లో స్త్రీలు ఉత్పాదక శ్రమలోనూ, ఇటు గృహ సంబంధమైన అనుత్పాదక శ్రమలోనూ భాగం అవుతారు. ఇలాంటి శ్రామిక కుటుంబాల్లో గృహశ్రమభారం స్త్రీలపై అదనంగా ఉంటుంది. పురుషులు ఎక్కడా ఈ శ్రమలో భాగం కారు. దీనివల్ల పురుషులకంటే స్త్రీలు అధిక గంటలు శ్రమిస్తారు. ఇటువంటి అసమాన శ్రమవిభజన ద్వారా స్త్రీలపై పడే అదనపు శ్రమ భారాన్ని ‘అక్యుములేషన్ ఆఫ్ లేబర్’ అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, అంతర్జాతీయ మానవహక్కుల నాయకులు ఆమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.
ఆదాయంలో వివక్ష
కేవలం అసంఘటిత రంగంలోనే కాకుండా సంఘటిత రంగంలో సైతం వేతనాల్లో స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. అది అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కింది విధంగా ఉంది.
స్త్రీపురుషుల సంపాదనలో వ్యత్యాసం
అభివృద్ధి చెందిన 19 దేశాల్లో మహిళలు - 0.77% , పురుషులు - 0.23%
అభివృద్ధిచెందుతోన్న 42 దేశాల్లో మహిళలు - 0.73% , పురుషులు - 0.27%
స్త్రీపురుష వేతన వ్యత్యాసం అభివృద్ధి చెందిన దేశాల్లో 23 శాతం, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 27 శాతం గా ఉన్న విషయాన్ని పై వివరణ తెలియజేస్తోంది.
అక్షరాస్యతలో వివక్ష
భారత దేశంలో బాలబాలికల అక్షరాస్యతా శాతం 2001లో 75.26, 53.67 శాతం నుంచి 2011కి వచ్చేసరికి 82.14, 65.46కి పెరిగింది. అయితే మహిళల అక్షరాస్యతాశాతం దాదాపు 54 శాతంగా ఉంది. దీన్ని బట్టి కేవలం జనాభాలో సగం మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. విద్యకి తక్కువ ప్రాధాన్యతనిస్తున్న కారణంగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో భారత దేశం 126 వ స్థానం నుంచి దిగజారి 134 స్థానానికి చేరింది.
ప్రాథమిక స్థాయిలో 2009లో బాలబాలికల ఎన్‌రోల్‌మెంట్ రేటు బాలురలో 115 గానూ, బాలికల్లో 111 గానూ ఉంది. ఇదే చైనాలో అయితే బాలురలో 111 గానూ, బాలికల్లో 115గానూ ఉంది. చైనా తరువాత బాలికల్లో డ్రాపౌట్ రేట్ భారతదేశంలోనే అధికంగా ఉంది. డ్రాపౌట్ రేటు అధికంగా ఉండడానికి అనేక కారణాలున్నా ప్రధానమైనది తల్లిదండ్రుల నిరక్షరాస్యతే.
వివాహాల్లో వివక్ష
భారతదేశ సగటు వివాహ వయస్సు 13 నుంచి 14 మాత్రమే. చట్టప్రకారం ఇది 18 ఏళ్ళైనా, దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరిది బాల్య వివాహమే. నేపాల్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరిది బాల్య వివాహమే.మనకన్నా నేపాల్ కొంత మెరుగు. అక్కడ కనీస వివాహ వయస్సు 15 ఏళ్ళు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో యాభై శాతం మంది పదహారేళ్ళలోపే బాల్యవివాహాల బారిన పడుతున్నారు.బాల్య వివాహాలు ఆడుకునే వయస్సులోనే తల్లిగా మారుస్తున్న పరిస్థితి ఎదురవుతోంది. బాల్య వివాహాల్లో అధికమంది బాలికలు 15 ఏళ్ళలోపే బిడ్డకి తల్లులవుతున్నారు. పుట్టిన పిల్లల సంరక్షణ బాధ్యత కూడా అమ్మాయిలపై పడుతోంది. అది వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. ఈ బాల్య వివాహాలే మాతా శిశు మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.
వివక్షే స్త్రీలపై హింసకు కారణం
స్త్రీల పట్ల వివక్ష అంతిమంగా స్త్రీలపై హింసకు దారితీస్తుంది. ఈ హింస ఆడపిల్ల పుట్టుకతోనే ఆరంభం అవుతుంది. ఇదే హింస స్త్రీల జీవితమంతా వెంటాడుతుంది. సంపాదనలోనూ, ఆస్తిలోనూ, కుటుంబంలో ఆహారం, ఆరోగ్యం విషయంలోనూ తారతమ్యాలకు ఇదే వివక్ష కారణమౌతుంది. అది అంతిమంగా హింసకు దారితీస్తుంది.
ఇలాంటి అన్ని రకాలైన వివక్షకు పేద, ధనిక దేశాల్లో తేడా ఏంలేదు. దేశాల, సమాజాల, వ్యక్తుల ఆర్థిక స్థితిపై ఈ వివక్ష ఆధారపడి లేదు. అలా వరకట్నం హింసకు ఒక పనిముట్టుగా తయారయ్యింది. గృహహింసలో వరకట్న మరణాలు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి. లైంగిక హింస తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. అమ్మాయిల అక్రమ రవాణాకూ, స్త్రీలైంగిక దోపిడీకి పేదరికం ఒక కారణంగా మారుతోంది.
♦ స్త్రీలపై హింసకు అంతర్జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా పురుషాధిపత్య భావజాలం, పురుషస్వామ్యం, అసమాన ఆధిపత్యం దీనికి కారణంగా భావించాలి. అయితే స్త్రీల అవిద్య, అరకొరా చదువులు దీనికి మరి కొంత కారణం అవుతున్నాయి.
♦ ఆర్థిక స్వాతంత్య్రం, కుటుంబేతర ఆర్జిత ఉపాధి అవకాశాలూ, ఆర్థిక అసమానతలూ, ఆస్తిహక్కు, విద్యావకాశాలూ స్త్రీలు స్వతంత్రతకు ఒక మార్గం వేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ స్త్రీల సాధికారతను సుసాధ్యం చేస్తాయి. పురుషస్వామ్యాన్నీ, పురుషాధిపత్యాన్నీ, స్త్రీలపై హింసనీ దూరంచే యడంలో ఇవే కీలక భూమిక పోషిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment