మీరు నివసిస్తున్న కాలనీలో మిగిలిన అందరి కంటే మీరే అన్ని విషయాల్లో ఎక్కువగా ఉండాలనే కోరిక మీలో బలంగా ఉంటోందా? మీ సహోద్యోగి మీ కంటే బాగా కనిపిస్తే మీకు తెలియ కుండానే మీలో ఆందోళన మొదలవు తోందా? మీ దగ్గరి బంధువు కుటుంబం మీ కుటుంబం కంటే మెరుగ్గా ఉంటే ఆ సంగతి మీకు తరచూ గుర్తుకు వస్తోందా? అయితే మీలో నరకం మొదలైందనే! ఒక వ్యక్తికి జీవితం ఎప్పుడు నరకప్రాయం అవుతుందంటే.. తనను మరొక వ్యక్తితో పోల్చుకోవడంతోనే!
నిజమే.. పోలిక ఆత్మన్యూనతకు దారి తీయవచ్చు. ఈర్ష్య, అసూయలను కలిగించనూ వచ్చు. ఈర్ష్య, అసూయలు మనిషిని తనతో తాను రగిలిపోయేలా చేస్తాయి. మనిషిని... తన జీవితాన్ని తాను జీవించలేని దుస్థితిలోకి తోసేస్తాయి. మనుషులు తనకు తెలియకుండానే ఈ కంపేరిజన్ ఊబిలోకి చిక్కుకుపోతుంటారు. ఇంట్లో నలుగురు పిల్లలుంటే ఒకరితో ఒకరిని పోల్చి ఒకరిని ప్రశంసించడం, మరొకరికి విమర్శించడం వల్ల పిల్లల్లో ఒకరి మీద మరొకరికి ఈర్ష్య, అసూయలకు బీజం పడుతుంటుంది. పెద్దయిన తర్వాత కూడా తమను మరొకరితో పోల్చుకోకుండా ఉండలేని బలహీనత ఆవరిస్తుంది. మనిషి జీవితాన్ని దుర్భరం చేసేది ఈ బలహీనతే. ఈ దుర్బలత్వాన్ని జయించడానికి సైకాలజిస్టులు ప్రధానంగా ఏడు విషయాలను మర్చిపోకూడదని అంటున్నారు. అవి :
ఏ ఒక్కరూ పరిపూర్ణులు కాదు
ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే విధమైన లక్షణాలతో పుట్టరు. అలాగే మనుషుల్లో ఎవరూ పరిపూర్ణులు కాదు, కాలేరు కూడా. ఒక్కొక్కరిలో ఒక్కో అవలక్షణం లేదా అవకరం ఉంటుంది. తమలో ఒక అసహజత్వం ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే దానిని అధిగమించడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో తనను అందరూ పరిపూర్ణమైన, సమగ్రమైన వ్యక్తిగా గుర్తించాలనే కోరిక ఉండడం కూడా సరి కాదు.
ఎవరి ఇబ్బందులు వాళ్లకుంటాయి
ఈ మాట కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. కష్టాలు, సమస్యలు, సవాళ్లు లేకుండా ఎవరి జీవితమూ ఉండదు. ఎవరి సవాళ్లను వాళ్లు తమకు చేతనైనట్లు ఎదుర్కొంటూ.. తమ జీవితాన్ని తమకు తగినట్లు, తమకు తోచినట్లు రూపొందించుకోవాలి. అంతే తప్ప తమకు బాగా నచ్చిన మరెవరిలాగానో మారడానికి ప్రయత్నించడం కూడా మంచిది కాదు. మనకు నచ్చిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ అనుకరణగా తీసుకోకూడదు. ఏ ఒక్కరి జీవితలమూ మరొకరి జీవితంలా ఉండదు. జీవితం విషయంలో ఒక సమీకరణ ఏ ఇద్దరికీ వర్తించదు, ఎవరిది వారికే. అందుకే ఎవరి జీవితాన్ని వాళ్లు యథాతథంగా స్వీకరించాలి.
ఎవరిని వారు ఇష్టపడాలి
‘నాకు ఎలాంటి గుర్తింపూ లేదు. నేను ఎందుకూ పనికిరాని వ్యక్తిని’ అనే భావన ఒకసారి మనసులో ప్రవేశించిందీ అంటే.. ఆ ఆలోచనను వీలయినంత త్వరగా వదిలించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న మంచి లక్షణాలను ఒకసారి పరిశీలించుకుని వాటిని గౌరవించుకోవాలి, ఇష్టపడాలి, ఆ మంచి లక్షణాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప ఏదో ఒక విషయంలో ప్రత్యేకంగా గౌరవాలందుకుంటున్న మరెవరినో చూసి వారిలాగా మారాలనుకోకూడదు. అలాంటి ప్రయత్నం మొదలైందీ అంటే.. అవతలి వ్యక్తిలా మారడం సాధ్యం కాదు కానీ.. తమలో ఉన్న మంచి లక్షణాలను గాలికొదిలేసినట్లే. ఆ తర్వాత జీవితంలో ఏ ప్రత్యేకతా లేని వ్యక్తుల్లా అనామకంగా మిగిలిపోవాల్సి వస్తుంది.
పక్కదారి పట్టించే పోలిక
మరొకరితో పోల్చుకోవడం మొదలైన క్షణం నుంచి తమ లక్ష్యాన్ని మర్చిపోవడం, లక్ష్యం తమ ప్రాధాన్యత క్రమంలో కిందకు జారిపోవడం జరిగిపోతాయి. ఒక క్లాసులో బాగా చదివే విద్యార్థి.. తనను అదే క్లాసులో ఉన్న తెల్లటి విద్యార్థితో పోల్చుకుంటూ, ఆ విద్యార్థిలాగా తెల్లగా రావడానికి ప్రయత్నించడం మొదలు పెడితే.. అప్పటి వరకు చదువు మీదనే కేంద్రీకృతమైన దృష్టి పక్కదారి పడుతుంది. దాంతో చదువులో వెనుకపడిపోతారు.
పోలిక.. పోరుకు వేదిక
ఎంత మంచి స్నేహితుల మధ్య అయినా సరే, ఏదైనా విషయంలో పోలిక వచ్చిందీ అంటే.. వారి మధ్య స్నేహం బీటలు వారిందనే చెప్పాలి. ఇద్దరి మధ్యా ఇదీ అని కచ్చితంగా చెప్పలేని గ్యాప్ ఏదో మొదలవుతుంది. క్రమంగా ఈర్ష్య కూడా కలుగుతుంది. అంతకు ముందులాగ అరమరికలు లేకుండా ఉండలేకపోతారు. ఫ్రెండ్ పట్ల ఈర్ష్య పెంచుకుని బంధాన్ని బలహీన పరుచుకున్న వ్యక్తిగా ముద్ర పడుతుంది. అంటే ఇది ఒక వ్యక్తి తన వ్యక్తిత్వ హననానికి తానే బీజం వేసుకున్నట్లు అన్నమాట.
ఆత్మగౌరవానికి సమాధి
మరొకరితో పోల్చుకోవడం అంటే... ఆ వ్యక్తి ఆత్మగౌరవాన్ని తనకు తానుగా పరిహసించినట్లే. ఇది ఇక్కడితో ఆగదు. చెదపురుగులా మారి ఆ వ్యక్తిలోని ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది. మనిషిలో దిగులు, ఆత్మన్యూనతలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. ఇది క్రమంగా ఇతరులతో కలడానికి కూడా ధైర్యం లేకుండా మనిషిని కుదేలు చేస్తుంది.
ప్రవర్తనతోనే గౌరవం
పోలిక అనేది ఏ సందర్భంలోనూ మంచి చేయదు. పైగా పోల్చుకోవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. క్రమంగా పోల్చుకోకుండా ఉండలేనంత వ్యసనంగానూ పరిణమిస్తుంది. మనిషికి గౌరవం దక్కేది ప్రవర్తనతోనే తప్ప రూపలావణ్యాలతో కాదని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరులతో వ్యవహారించే ధోరణిని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అది ఆ వ్యక్తితో కలకాలం నిలిచి ఉంటుంది. సృష్టికర్త ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసాదిస్తాడు.
మన ఎదురుగా ఉన్న వారికి సొంతమైన మంచి లక్షణం మనలో ఉండకపోవచ్చు. అలాగని మనలో ఏ మంచి లక్షణమూ లేదని కాదు. ఎవరికి వాళ్లు తమ జీవితాన్ని ప్రశాంతంగా, పరిపూర్ణంగా జీవించడానికి ప్రయత్నించాలి తప్ప పోల్చుకుని జీవితాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు. అయితే ఎవరికి వాళ్లు తమ జీవితాన్ని పరిపూర్ణంగా మలుచుకోవడం సాధ్యమే.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment