మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్ ఇష్టపడడు (దివ్య ఖుర్ ఆన్: 4:36)
బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి. పోరపొచ్చాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి.
అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి.
పొరుగున ఉన్న బంధువులు: పొరుగున నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.
అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.
– అబ్దుల్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment