బ్రిటన్‌లో నాన్‌వెజ్‌ కరెన్సీ! | nonveg currency in britan | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో నాన్‌వెజ్‌ కరెన్సీ!

Published Sat, Dec 10 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

బ్రిటన్‌లో నాన్‌వెజ్‌ కరెన్సీ!

బ్రిటన్‌లో నాన్‌వెజ్‌ కరెన్సీ!

కరెన్సీ అంటే ప్రపంచమంతటికీ క్రేజ్‌. కొత్త నోట్లు చేతికి వస్తే వాటిని మురిపెంగా చూసుకుని నలగనివ్వకుండా భద్రంగా పర్సులో పెట్టుకుంటారు. కానీ బ్రిటన్‌లో అలా జరగలేదు. ఈ కొత్త నోట్లు మాకొద్దంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ నోట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ తెర మీదకొచ్చింది. ఇంతకీ సంగతేమిటంటే...

పేపర్‌ కరెన్సీ స్థానంలో ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు పాలిమర్‌ నోట్లను ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలో బ్రిటన్‌ కూడా కొత్త ఐదు పౌండ్ల పాలిమర్‌ నోటును విడుదల చేసింది. అయితే ఆ నోటును తాకడానికి, పర్సులో పెట్టుకోవడానికి విముఖంగా ఉన్నారు ఇంగ్లండ్‌లోని ‘హిందూ ఫోరమ్‌ ఆఫ్‌ బ్రిటన్‌’ (హెచ్‌ఎఫ్‌బి) సభ్యులు. హిందూ ఫోరమ్‌ ఆఫ్‌ బ్రిటన్‌ సభ్యుడు, అక్కడి ఇస్కాన్‌ ఆలయం డైరెక్టర్‌ అయిన గౌరీదాస్‌ ఈ నోట్లను ఉపసంహరించాల్సిందిగా బ్రిటన్‌ ప్రభుత్వానికి, బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు.

ఆ డబ్బు ఎందుకు వద్దు?
కొత్త ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వు వాడినందున శాకాహారులు, వేగాన్‌ (కాయలు, పప్పు దినుసులు తప్ప పాల ఉత్పత్తులను కూడా తీసుకోరు)లు ఆ నోట్లను తాకడానికి ఇష్టపడడం లేదని హెచ్‌ఎఫ్‌బి ప్రతినిధులు చెప్తున్నారు. కరెన్సీ నోటు ‘సంపద దేవత’ అనీ, ఆ నోటుకు జంతువుల కొవ్వు రాయడం అపరాధం అని అంటున్నారు. నోట్ల తయారీ కోసం జంతువులకు హాని కలిగించడం దేవుడు మెచ్చని పని అని భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి ‘రిమూవ్‌ టాలో (కొవ్వు) ఫ్రమ్‌ బ్యాంక్‌ నోట్స్‌’ పేరుతో ఒక పిటిషన్‌ తయారు చేశారు. ఇందుకు సానుకూలంగా ట్విటర్‌లో లక్షా ఇరవై ఆరు వేల మంది స్పందించారు. ఈ పిటిషన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు చేరే నాటికి ఆ సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. కేంబ్రిడ్జిలోని రెయిన్‌బో వెజిటేరియన్‌ కేఫ్‌ నిర్వాహకుడు షరోన్‌ మీజ్‌ల్యాండ్‌ ఈ క్యాంపెయిన్‌కు స్పందించి ఆ నోట్లను స్వీకరించబోమని బోర్డు కూడా పెట్టేశాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బ్యాంకు అధికారులు కూడా అనుకూలంగా స్పందించారు. ‘‘మేము వారి (హెచ్‌ఎఫ్‌బి) మనోభావాలను గౌరవిస్తాం, దీనిని అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా పరిగణించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాం’’ అని బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపారు.

అయితే ఆస్ట్రేలియాలో పాలిమర్‌ నోట్లు ప్రవేశపెట్టడానికి కారణమైన ప్రొఫెసర్‌ డేవిడ్‌ శాలమన్‌ ఇది సరైన ఆలోచన కాదని అంటున్నారు. ‘‘ఐదు పౌండ్ల నోటు తయారీలో ఉపయోగించే జంతువుల కొవ్వు అత్యంత స్వల్పం. అది ఒక సబ్బు తయారీలో వాడే యానిమల్‌ ఫ్యాట్‌ కంటే తక్కువే. పేపర్‌ నోట్ల తయారీకైతే చెట్లను నరకాలి. అది పర్యావరణ పరిరక్షణకు విఘాతం. పాలిమర్‌ నోట్‌తో ఆ ఇబ్బంది ఉండదు. పైగా ఇది పేపర్‌ నోటు కంటే చాలా శుభ్రంగా ఉంటుంది. దీర్ఘకాలం కూడా మన్నుతుంది’’ అని ఆయన వాదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement