ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ,
శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల
పశువుల వ్యర్థాలతో..
పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే..
ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు
విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి.
ఇటీవల కొన్ని ఘటనల్లో..
ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్‌పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్‌పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న కేన్సర్ కేసులు
గ్రేటర్‌లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే..
ఫిర్యాదులు అందితేనే..
ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.
శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది.
– డాక్టర్ ఆర్‌వీ రాఘవేందర్‌రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment