స్వాధీనం చేసుకున్న నూనె డబ్బాలు
పోలీసుల అదుపులో నిందితులు
పెద్దఅంబర్‌పేట: జంతువుల కొవ్వును కరిగించి నూనె తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ మండలం బాటసింగారంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.... సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజీద్ కబేళా నుంచి జంతువుల కొవ్వును తీసుకువచ్చి బాటసింగారం గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు ఇచ్చి వాటిని కరిగించి నూనెను తయారు చేయిస్తున్నాడు.
ఆదివారం స్థానికులు కొందరు గ్రామ పంచాయితీ వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూడగా జంతువుల కొవ్వును వంట పాత్రల్లో కరిగిస్తున్న దృశ్యం కనిపించింది.
గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పగా వారు వెళ్లి ప్రశ్నించగా... సంతోష్‌నగర్‌కు చెందిన అజిద్ జంతువుల కోవ్వు పదార్థాలను తీసుకువచ్చి తమకు ఇస్తే వాటిని కరిగించి నూనెను తయారు చేస్తున్నామని, అందుకు రూ.200 చొప్పున కూలీ ఇస్తున్నాడని తెలిపారు. సమాచారం అందుకున హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇస్మాయిల్, ఫాతిమాలను అదుపులోకి తీసుకొని నూనె తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని, డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారు చేసిన నూనెను నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.