పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం..
సాక్షి, ఖమ్మం: పట్టణాల్లో కంపునంతా ఎత్తిపారేస్తున్నా పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. అత్తెసరు వేతనం..అందులోనూ కోత. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు ఎప్పుడోకాని ఇవ్వరు. కనీసం చీపుర్లు కూడా సరిగా ఉండవు. చలికి వణుకుతూ విధులు నిర్వహించక తప్పని పరిస్థితి. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులను దండుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ ప్రాంతాల్లో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన కార్మికుల దుర్భర స్థితిగతులు...
జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ పారిశుధ్య కార్మికులను మినహాయిస్తే కాంట్రాక్టు కార్మికులు 1,152 మంది పని చేస్తున్నారు. మున్సిపాలిటీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కార్మికులను పారిశుధ్య పనుల కు పంపిస్తారు. మున్సిపల్‌శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లే వేతనాలు చెల్లించాలి. కానీ కాంట్రాక్టు నిబంధనలు వీరు బేఖాతర్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటలకు, మరికొన్నిచోట్ల రాత్రి వేళ్లల్లో కార్మికులు పట్టణ వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు.
ట్రాక్టర్లలోకి ఎత్తి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా కార్మికులకు యూనిఫాం, గ్లౌజులు, నూనె, సబ్బులు, ఇవ్వడం లేదు. కనీసం చీపుర్లు కూడా సక్రమంగా ఉండటం లేదు. చలితో వణుకుతున్నా కాంట్రాక్టర్లు కార్మికుల గోడు పట్టించుకోవడం లేదు. చెత్తను తీయకుంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని.. తమ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయి లభించినా కార్మికులకు మాత్రం ఆస్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదు.
కార్పొరేషన్‌లో మొత్తం 569 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరికి ఈ ఏడాది యూనిఫాం అందజేయలేదు. చలికి వణుకుతూనే తెల్లవారుజామున నగరాన్ని శుభ్రపరుస్తున్నారు. కార్పొరేషన్ స్థాయిలో ఇంకా ఖమ్మం నగరాన్ని శుభ్రం చేయాలంటే సుమారు 300 మంది కార్మికుల అవసరం. కానీ భారం అంతా ఉన్న కార్మికుల పైనే పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులూ సమస్యలతోనే సావాసం చేస్తున్నారు. వీరికి యూనిఫాం అందలేదు. కొంతమంది అధికారుల ఇళ్లలోనూ వీరితో పనిచేయించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కాంట్రాక్టర్ల హవా
మున్సిపాలిటీల్లో పారిశుధ్య టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల చేయి తడుపుతూ కార్మికులకు శ్రమ, సౌకర్యాలను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెల వేతనాలు ఎప్పుడో ఒకసారి ఇస్తుండడం.. అందులోనూ ప్రతి నెల వేతనంలో ఎంతోకొంత కోత పెడుతున్నారు. ఇదేమని కార్మికులు ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ కాంట్రాక్టర్లు బెదిరిస్తూ మరీ పొట్ట కొడుతున్నారు. పెద్ద డ్రైనేజీల్లో మురుగు నీరు నిల్వకుండా చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారింది.
దీన్ని తొలగించడానికి కావాల్సిన పరికరాలను మున్సిపాలిటీలు కూడా సమకూర్చకపోవడంతో చేతులతోనే తీసివేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నా అధికారులు నోరు మెదపడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వీటిని మింగేస్తున్నట్లు సమాచారం. పీఎఫ్‌ను కార్మికులకు నెల మొత్తం చెల్లించాల్సి ఉన్న కేవలం 15 రోజులు మాత్రమే చెల్లిస్తూ మిగిలింది స్వాహా చేస్తున్నారని తెలిసింది.
స్థాయితో పాటు సమస్యలూ పెరిగాయి...
ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి చేరిన కాంట్రాక్టు కార్మికుల వేతలు మాత్రం తొలగటం లేదు. కాంట్రాక్టు కార్మికులకు సౌకర్యాల కల్పన అటుంచితే కార్పొరేషన్ అధికారులు కనీసం వారికి చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. అరిగిపోయిన చీపుర్లతో చెత్త ఉడుస్తుండటంతో నడుం నొప్పిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది విలీన గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్‌గా మారి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కార్మికుల సంఖ్యలో ఎలాంటి మార్పులేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఈ మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కార్మికులకు యూనిఫాం ఇవ్వడం లేదు. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల హోదా పెరిగినా ఇక్కడ కూడా గతంలో ఉన్న కార్మికులే పారిశుధ్య పనులు చేస్తున్నారు. మధిరలో రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో సంక్రాంతి వరకైనా చెల్లిస్తారో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ మూడు నెలలుగా కార్మికులు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు పడగానే ఇచ్చే విధంగా ముందుగానే ఏటీఎం కార్డులను కిరాణాషాపుల్లో తాకట్టు పెట్టి మరీ సరుకులు తెచ్చుకుంటున్నామని కార్మికులు వాపోతున్నారు.