
వంకాయ కూరలో రుచి ఉందా?
లారెన్సు ఒకచోట రాస్తున్నాడు ఒకరికి... ‘నన్ను నువ్వు నలుగురిలో తిడుతున్నావని నాకు తెలుసు. ఆ తిట్టే అవసరం నేను అర్థం చేసుకోగలను. నీ గొప్పదనం కోసం నన్ను తిట్టాల్సి వొస్తుంది నువ్వు. నన్ను తిడుతున్నావని నాకు తెలిసి, నేను కోపగించుకుంటున్నానని నాతో స్నేహం మానెయ్యకు. నాకు కోపం లేదు. ఎందుకంటే ఆ తిట్ల వెనుక అసలు నీకు నా మీద వుండే ఇష్టాన్ని నేనెరుగుదును’
గొప్పవాడు కదూ!
అతన్ని ఇంగ్లండు బాధించి వెళ్ళగొట్టింది. ఇంగ్లీష్‌వాడనే పేరు ఎత్తవద్దంటాడు చివరికి. అది పోనీండి. ఒక ప్రకృతి దృశ్యం ఉంది. దాన్ని గొప్ప ఫొటోగ్రాఫర్ తీస్తాడు. అసలు ఆ దృశ్యాన్ని చూస్తే ఆ ఫొటోలో వున్న అందం కనబడదు మసుషులకి.
మరి ఆ అందం ఎక్కడ వుంది? అసలు దృశ్యంలో ఉందా? ఫొటోలో ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు నాలో వస్తే నేను రచయితగా చెడిపోయానన్నారు.
వంకాయకూరలో రుచి అసలు వుందా? లేదా?
‘‘చాలా రుచి’’ అన్నవాడు మోసపోతున్నాడా?
లేదన్నవాడు నాలిక రుచి లేని అంధుడా? అది తేలిందా- ఈ ప్రపంచ రహస్యమే తేలిపోతుంది.
- చలం, 16-11-1950, అరుణాచలం.
(‘మహాస్తాన్’ నుంచి)