ఓ మై యాప్! | Oh My App | Sakshi
Sakshi News home page

ఓ మై యాప్!

Published Sun, Jul 5 2015 10:46 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఓ మై యాప్! - Sakshi

ఓ మై యాప్!

మూడు యాప్‌లు... ఆరు సాఫ్ట్‌వేర్‌లు. ఇవి ఈ కాలం స్మార్ట్‌ఫోన్ రంగం తీరుతెన్నులు.. రోజూ పదుల అప్లికేషన్లు... వాటితో కొత్త, విచిత్రమైన టూమచ్ సౌకర్యాలు! ఏది ఎంచుకోవాలో... దేన్ని వదిలించుకోవాలో.. తెలియడం లేదా? అయితే ఈ కథనం మీ కోసమే...
 
ఒక్కసారి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళితే... స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు వందలు, వేలుగా పెరిగిపోతూ కనిపిస్తాయి.   వాటిల్లో కొన్ని అరకొరగా పనిచేస్తాయి. కొన్ని అసలు పనిచేయవు. డౌన్‌లోడ్ చేసుకోవడం, వాడి.. పనికిరాదని తెలుసుకోవడం.. పక్కన పడేయడం. ఇదీ మనలో చాలామంది చేసే పని. అలా కాకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ కచ్చితంగా ఉండాల్సిన కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
 
అవాస్ట్ యాంటీవైరస్..
 ఆండ్రాయిడ్ ఫోన్లలో యాంటీవైరస్ ఇన్‌బిల్ట్‌గా ఉన్నప్పటికీ రకరకాల మార్గాల నుంచి మీ ప్రైవసీకి, డేటాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అదనపు సాఫ్ట్‌వేర్ తప్పనిసరి. అవాస్ట్ యాంటీవైరస్, సెక్యురిటీ అప్లికేషన్ ఈ కోవలోనిదే. పర్సనల్ కంప్యూటర్లకూ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందజేసే అవాస్ట్ ఉచితంగా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లనూ అందిస్తోంది. జియో ఫెన్సింగ్ మొదలుకొని రిమోట్ డేటా రికవరీ వరకూ అనేక ఫీచర్లున్న ఈ సాఫ్ట్‌వేర్ మీ డేటాను సురక్షితంగా ఉంచుతుందని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.
 
బ్యాటరీ రక్షణకు గ్రీనిఫై..
 స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే బ్యాటరీ ఎప్పుడు ఖర్చయిపోతుందో అన్న బెంగ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. తాజా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాలీపాప్‌లో బ్యాటరీని మరింత ఎక్కువ సమయం పనిచేయించేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారుగానీ.. మిగిలిన వాటికి మాత్రం సొంతంగా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్లలో గ్రీనిఫై ఒకటి. ఫోన్‌లోని అప్లికేషన్ల ఏవి ఎంత మెమరీ వాడుతున్నాయో బ్యాక్‌గ్రౌండ్‌లోనే పరిశీలిస్తూ అవసరం లేని వాటిని అపేస్తూంటుంది. కావాల్సినప్పుడు వెంటనే వాటిని ఆన్ చేసి అందుబాటులోకి తెస్తుంది. నిన్న మొన్నటివరకూ ఆ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు రూట్ యాక్సెస్ అవసరముండేది. ఇప్పుడా ఇబ్బందిలేదు. నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
 
కాంటాక్ట్‌ల కోసం కాంటాక్ట్
 తరచూ ఫోన్లు మారుస్తూంటాం. ఈ క్రమంలో ముఖ్యమైన కొన్ని కాంటాక్ట్‌లు మిస్ ఐపోతూంటాయి. ఈ ఇబ్బందిని తప్పించుకోవాలంటే కాంటాక్ట్ + అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అన్ని కాంటాక్ట్‌లను ఒకదగ్గరకు చేర్చడంతోపాటు మీకు అవసరమైనట్టుగా వీటిని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎంతో సులువుగా జరిగిపోతుంది. మీ కాంటాక్ట్స్ బ్యాకప్ చేసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
 
జంక్ ఫైళ్ల పనిపట్టే క్లీన్ మాస్టర్..
 అప్లికేషన్ల డౌన్‌లోడింగ్, అన్ ఇన్‌స్టాలింగ్, వాడకాలతో నిత్యం మన స్మార్ట్‌ఫోన్లలో జంక్ ఫైల్స్ పేరుకుపోతూంటాయి. ఎప్పటికప్పుడు వీటిని తొలగించుకుంటే మీ ఫోన్ స్పీడ్‌గా పనిచేయడంతోపాటు ఎక్కువ కాలం మన్నేందుకు అవకాశముంటుంది. ఈ పనిని ఆటోమెటిక్‌గా చేసేందుకు ఎన్నో అప్లికేషన్లున్నా క్లీన్‌మాస్టర్ కొంచెం మెరుగ్గా పనిచేస్తుందని నిపుణుల అంచనా. క్యాషే మెమరీతోపాటు, రెసిడ్యూల్ ఫైళ్లను కూడా కడిగేసి మెమరీని సమర్థంగా వాడుకునేలా చేస్తుందీ అప్లికేషన్.
 
డేటాప్లాన్‌తో పొదుపు కోసం...
 ఇంటర్నెట్ డేటాప్లాన్‌ను మరింత పొదుపుగా వాడాలనుకుంటున్నారా? అయితే ఒపేరా మ్యాక్స్ మీ కోసమే. మామూలుగా డేటాను తినేసే ఫొటోలు, వీడియోల సైజును ఈ అప్లికేషన్ తక్కువ చేస్తుంది. తద్వారా వెబ్‌సైట్ తొందరగా లోడయ్యేలా చేస్తుంది. అదే సమయంలో డేటా తక్కువగా ఖర్చయ్యేలా చేస్తుంది. ఈ పొదుపు మిగిలిన బ్రౌజర్లతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. కొన్ని అప్లికేషన్లను వైఫై అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేలా చేయవచ్చు.
 
ఆఫ్‌లైన్ రీడింగ్ కోసం...
 ఆసక్తికరమైన వార్త/కథనం కనిపించిందా? చదివేందుకు సమయం లేదా? అయితే పాకెట్ అప్లికేషన్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఈ యాప్‌తో మీకు నచ్చిన ఆర్టికల్స్‌ను సేవ్ చేసుకుంటే చాలు.. నెట్ కనెక్షన్ లేకున్నా వాటిని తీరిగ్గా చదువుకోవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌తో మాత్రమే కాకుండా... ట్యాబ్లెట్ ఈ బుక్ రీడర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోనూ పనిచేస్తుంది. రైళ్లు, విమానాల్లో వెళ్లేటప్పుడు, లేదంటే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మెదడుకు పనిచెప్పే కథనాలైనా, కాలక్షేపం కోసం చదివే కథలైనా పాకెట్ మీ వెంటే ఉండేలా చేస్తుందన్నమాట.
 - గిళియార్
 
 మేఘాల్లో మీ ఫైళ్లు...
 స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఫొటోలు, వీడియోలు రకరకాల మార్గాల్లో వచ్చి చేరుతూంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పీసీలోకో మరో ఎలక్ట్రానిక్ పరికరంలో మార్చుకోవడం మనమందరం చేసే పనే. టైం బాగోలేక మీరు బ్యాకప్ చేసుకున్న పరికరం పనిచేయకుండా పోయిందనుకోండి. అంతే సంగతులు. డేటా, ఫోటోలు, వీడియోలకు మంగళం పాడాల్సిందే. ఇలా కాకుండా ఉండాలంటే మీ జ్ఞాపకాలన్నింటినీ మేఘాల్లో అదేనండే క్లౌడ్ స్టోరేజ్‌లో ఉంచుకోవడం మంచిది. డ్రాప్‌బాక్స్, బాక్స్ ఫర్ ఆండ్రాయిడ్, వన్‌డ్రైవ్ వంటి కంపెనీలు కొంత పరిమితితో ఉచితంగా క్లౌడ్ స్టోరేజీని అందిస్తున్నాయి. వన్‌డ్రైవ్ ఏకంగా వంద జిబీల స్పేస్ ఇస్తోంది. మీ  మ్యూజిక్, ఫొటోలు, వీడియోలన్నింటినీ క్లౌడ్‌లోకి ఎక్కిస్తే స్మార్ట్‌ఫోన్ మెమరీ మిగులుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement