మనుషులను వేటాడే మనిషి | Olga Tokarczuk Book Drive Your Plow Over The Bones Of The Dead | Sakshi
Sakshi News home page

మనుషులను వేటాడే మనిషి

Published Mon, Oct 21 2019 12:33 AM | Last Updated on Mon, Oct 21 2019 12:33 AM

Olga Tokarczuk Book Drive Your Plow Over The Bones Of The Dead - Sakshi

2018 సంవత్సరపు నోబెల్‌ పురస్కారం వరించిన పోలండ్‌ రచయిత్రి ఓల్గా తొకార్చుక్‌

‘రాత్రివేళ అంబులెన్స్‌ వచ్చి నన్ను పట్టుకుపోయే సందర్భం కోసమని సిద్ధంగా ఉండేందుకు– పడుకోబోయే ముందు నా పాదాలను శుభ్రంగా కడుక్కునే వయస్సులోనూ, స్థితిలోనూ ఉన్నాను’ అనే 61 ఏళ్ళ జెనీనా మాటలతో, ఓల్గా తొకార్చుక్‌ పోలిష్‌ నవల ‘డ్రైవ్‌ యువర్‌ ప్లవ్‌ ఓవర్‌ ద బోన్స్‌ ఆఫ్‌ ద డెడ్‌’ మొదలవుతుంది. జెనీనా ఒకానొకప్పుడు వంతెన నిర్మాణ ఇంజనీరూ, క్రీడాకారిణీ.
‘జాతీయ సరిహద్దులతో నిమిత్తంలేకుండా, ఫోన్‌ సిగ్నళ్ళు ఇటూ అటూ కూడా అందే’ ఆధునిక పోలండ్‌ – చెక్‌ రిపబ్లిక్‌ సరిహద్దుల్లో ఉన్న పేరుండని గ్రామంలో శీతాకాలం అది. లోకం నుంచి దూరం పాటిస్తూ, జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, విలియమ్‌ బ్లేక్‌ కవిత్వాన్ని అనువదిస్తూ కాలం గడుపుతుంది కథకురాలైన జెనీనా. ఆ వేటాడే సమాజంలో నివసించే శాకాహారైన ఆమెను, ‘అడివిలో ఉండే మతిస్థిమితం లేని ముసలామె’ అనుకుంటారు స్థానికులు. 

జెనీనాకు, ‘మనుషుల పేర్లు ఉపయోగించడం ఇష్టముండదు. మొదటిసారి, ఒక వ్యక్తిని చూసినప్పుడు తట్టే విశేషణమే నచ్చుతుంది.’ అందుకనే ఊరివారిని తనకు తోచిన పేర్లతోనే పిలుస్తుంది. కీటక శాస్త్రవేత్త అయిన బౌరస్‌ ఆ పల్లెకు వచ్చి, జెనీనా ఇంట్లో ఉంటాడు.
ఒకరోజు– ఆమె పొరుగింట్లో ఉండే ‘ఆడ్‌బాల్‌’ వచ్చి, పక్కనే ఉంటుండే వేటగాడైన, ‘బిగ్‌ ఫుట్‌’ చనిపోయున్నాడని చెప్తాడు. మృతుడి గొంతుకు జింక ఎముక అడ్డం పడుంటుంది. పక్కనున్న ఫొటోలో, జెనీనా కుక్కలను వేటాడి చంపేసిన వ్యక్తుల మొహాలుంటాయి. ఆ తరువాత, మరికొందరు మధ్యవయస్కులైన వేటగాళ్ళు మరణిస్తారు. అందులో ఒకరి హత్య పురుగులను గొంతులోకి దింపడం ద్వారా జరుగుతుంది. ఆ మరణాలు ఊర్లో అలజడి సృష్టిస్తాయి. ‘సంభవిస్తున్న ఈ విషాద ఘటనలకి కారణం జంతువులే అని నమ్మాలని నేను పోలీసు విభాగానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను’ అని ఆమె రాసిన తరువాత, పల్లెవాసులందరికీ ఆమెకు పిచ్చి అన్న అభిప్రాయం బలపడుతుంది.

‘నా రోగాలెప్పుడు మోసం చేస్తూ నన్ను పట్టుకుంటాయో కూడా తెలియదు... ఒకోసారి రోజులకొద్దీ కొనసాగుతాయి... మందులు, ఇంజెక్షన్లు పని చేయవు’ అనే జెనీనాను, ‘జీవితంలో నీవు చేసినదేమిటి?’ అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఆమెకు నోటి మాట రాదు. ‘మేము ప్రేమించిన– మా బాల్యం, యవ్వనం గడిచిన జాగాలు ఇక లేవు. వాటి బాహ్యరూపం మాత్రమే భద్రపరచబడి, లోపలేమీ లేని ఈ పెంకులని చూడటం మరీ బాధాకరం. వెళ్ళేందుకు నాకే చోటూ లేదు. ఇది జైలుశిక్ష. నేను చూడగలిగే దిగంతం దీని గోడలే’ అనుకుంటుంది.
ఊరంతా జెనీనాయే హంతకురాలన్న నిర్ణయానికి వచ్చి, ఆమెను నిలదీస్తారు. తను జబ్బుపడే వేళయినప్పుడు, తన కుక్కలను వేటాడినవారిని తానే చంపేసేదాన్నని ఒప్పుకుంటుంది. జెనీనా, బౌరస్‌ కలిసి చెక్‌ రిపబ్లిక్‌లో కొత్త జీవితం ప్రారంభిస్తారు. 

నవల్లో ఉన్న 17 అధ్యాయాలూ, బ్లేక్‌ కవితల్లో నుంచి తీసుకున్న ఉల్లేఖనాలతోనే మొదలవుతాయి. 2009లో పోలిష్‌ భాషలో వచ్చిన పుస్తకం–ప్రకృతి, దానిపైన మానవుల ప్రభావం, వేట, దాని క్రూరత్వం వంటి సమకాలీన సాహిత్య సమస్యలకు సరితూగి, పాతదనిపించదు. అధికారం, డబ్బు, పితృస్వామ్యం గురించి మాట్లాడే నవల వచనం– సున్నితమైన హాస్యం నుండి విచారానికీ, దుర్బలత్వానికీ పాదరసంలా మారుతుంటుంది. ఏంటోనియా లాయిడ్‌ జోన్స్‌ ఇంగ్లిష్‌ అనువాదాన్ని రివర్‌ హెడ్‌ బుక్స్‌– ఆగస్టు 2019లో ప్రచురించింది. ఈ మర్మంతో కూడిన నవల కట్టుకథ శీర్షిక, బ్లేక్‌ ‘ప్రావర్బ్స్‌ ఆఫ్‌ హెల్‌’లో ఒకటి. ఆగెనెస్కియా హాలెండ్‌ దర్శకత్వంలో ఈ నవల ఆధారంగా 2017లో సినిమా కూడా వచ్చింది. 

1962లో జన్మించిన ఓల్గా తొకార్చుక్‌ తన ఫ్లైట్స్‌ నవలకుగానూ 2018లో మ్యాన్‌ బుక్‌ ఇంటర్నేషనల్‌ బహుమతి పొందారు. ఇది పొందిన మొట్టమొదటి పోలిష్‌ రచయిత్రి ఈమె. కార్యకర్త కూడా అయిన తొకార్చుక్‌ పుస్తకాలన్నీ పోలండ్, చెక్‌ రిపబ్లిక్, జర్మనీల చరిత్రకు సంబంధించినవై, పౌరాణిక స్వరంతో వినిపిస్తాయి. 29 భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి పుస్తకాలు ఆమె ఎంతోకాలం గడిపిన కోయెడ్జో్క లోయ నేపథ్యంగా రాసినవి. 2018 నోబెల్‌ పురస్కారాన్ని కూడా ఓల్గాకు ప్రకటించడంతో ఒకే ఏడాది రెండు ప్రధాన అవార్డులు ఆమెను వరించినట్టయింది. అయితే బుకర్‌ బహుమతి ఒక పుస్తకానికి ఇచ్చేది కాగా నోబెల్‌ జీవితకాల కృషికి దక్కే గుర్తింపు.2019 నోబెల్‌ పురస్కారాన్ని ఆస్ట్రియన్‌ రచయిత పీటర్‌ హ్యాంకీకి ప్రకటించినప్పుడే, 2018కి గానూ ఓల్గాకు ఇస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది నోబెల్‌ కమిటీ మీద వచ్చిన వివాదాల నేపథ్యంలో అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. ఆ వాయిదా పడిన అవార్డును ఇప్పుడు ప్రకటించారు.
కృష్ణ వేణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement