ఐజాక్ బషేవిస్ సింగర్
పోలండ్‌లో జన్మించిన యూదు ఐజాక్ సింగర్ (1902–1991). మాతృభాష ఈడిష్. ఇది హీబ్రూ, జర్మన్ మాండలికాల్లాంటి మరికొన్నింటి సంగమంగా పుట్టిన భాష. తల్లిదండ్రుల వల్ల ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాడు. కొన్ని రోజులు హీబ్రూ బోధకుడిగా పనిచేశాడు. కొన్నాళ్లు సోదరుడు నడిపిన పత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా ఉన్నాడు. మూడు పదుల వయసులో జర్మనీ దురాక్రమణ నేపథ్యంలో అమెరికాకు తరలివెళ్లాడు. పాత్రికేయుడిగా, కాలమిస్టుగా కుదిరాడు. సుమారు 15 లక్షల మంది మాత్రమే మాట్లాడే ఈడిష్ భాషలోనే తన సాహిత్య సృజన చేయడం విశేషం. ఈడిష్ సాహిత్యోద్యమంలో కీలక రచయిత కూడా.
తను పెరిగిన నేలమీది మొదటి ప్రపంచ యుద్ధ పూర్వపు వాతావరణం ఆయన రచనల్లో ఎక్కవ కనబడుతుంది. ఎన్నో నవలలు, కథా సంకలనాలు, పిల్లల కథలు, ఆత్మకథాత్మక రచనలు వెలువరించాడు. తిరిగి అవే రచనల్లో కొన్నింటిని అమెరికా పత్రికల కోసం ఇంగ్లిష్ చేసేవాడు. ‘నిజమైన సింగర్’ ఈడిష్ భాషలో దొరుకుతాడా? ఇంగ్లిషులోనా అన్నది విమర్శకులు ఎదుర్కునే సవాల్. 1978లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్నాడు. చెహోవ్, మపాసా కథల్ని ఇష్టపడేవాడు. సంప్రదాయవాది. తన జీవితం చివరి మూడున్నర దశాబ్దాలు శాకాహారిగా బతికాడు.
Comments
Please login to add a commentAdd a comment