నాడు నిరుపేద... నేడు కోటీశ్వరుడు!
హంగేరీకి చెందిన లాస్లో ఆండ్రాషెక్ (55) ఒకప్పుడు బాగా బతికాడు. కానీ ముప్ఫయ్యేళ్లు వచ్చేసరికి మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పులు చేశాడు. చివరకు నిలువ నీడ లేకుండా పోయి నిరుపేదగా మిగిలాడు. తల్లికి కూడా వయసైపోయి, అతడిని పోషించలేని పరిస్థితుల్లో ఉండటంతో... బంధువులు జాలిపడి ఆ తల్లీకొడుకులకు తిండిపెట్టేవారు. కానీ కొన్నాళ్లకు వాళ్లు కూడా విసిగిపోయారు. లాస్లోని బయటకు గెంటేయమని చెప్పారు.
దాంతో తాను ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడో అర్థమైంది లాస్లోకి. కానీ ఎంత ప్రయత్నించినా మద్యానికి దూరం కాలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతలో అతడికి సామాజిక కార్యకర్త అనికోతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత పదేళ్ల పాటు శ్రమించి అతడిని మామూలు మనిషిని చేసింది అనికో.
చిన్నాచితకా పనులు చేసుకుంటూ, భార్యతో సంతోషంగా బతుకుతోన్న లాస్లో మొన్నామధ్య అనుకోకుండా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ కాస్తా తగలడంతో ఒక్కసారిగా దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మన కరెన్సీ లెక్కలో వచ్చిపడ్డాయి. ఉక్కిరి బిక్కిరైపోయాడు లాస్లో. ఏదో సరదాగా కొన్నాను తప్ప, తగులుతుందనుకోలేదు అంటూ సంబరపడుతున్నాడు. అలాగని అతడు ఆ డబ్బును విలాసంగా ఖర్చు చేయాలనుకోవడం లేదు.
‘ఓర్పుతో నన్ను మామూలు మనిషిని చేసిన అనికోని ఏ లోటూ లేకుండా చూసుకుంటాను, మిగిలినదంతా పేదల కోసం ఖర్చుపెడతాను’ అంటున్నాడు. అదేంటి, ఏమీ దాచుకోవా అని అడిగితే... ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇతరుల కోసం బతకడమే జీవితం అని నా భార్యని చూసి తెలుసుకున్నాను, నేనూ అలాగే బతుకుతాను’ అంటున్నాడు నవ్వుతూ. హ్యాట్సాఫ్ లాస్లో!