
వెనక నుంచి చేసే గుండె ఆపరేషన్!
సాధారణంగా గుండె ఆపరేషన్ ఛాతీ మీద చేస్తారు. ఇందులో బలమైన ఎముక అయిన రొమ్ము ఎముకను కోయాల్సి ఉంటుంది. దీని వెనక ‘పెరికార్డియమ్’ అనే పొరలో గుండె సురక్షితంగా ఉంటుంది. రొమ్ము ఎముక (బ్రెస్ట్ బోన్)ను, పెరికార్డియమ్ పొరను తొలగించాకే గుండెను సులభంగా చేరడం, సురక్షితంగా ఆపరేషన్ పూర్తిచేయడం సాధ్యమవుతుంది.
మరో ప్రత్యామ్నాయం...
⇒ అయితే గుండెను చేరడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలూ ఉన్నాయి. అవి... ఒక పక్క నుంచి చేసే ఆపరేషన్ (యాంటెరో లాటెరల్ థొరకాటమీ) వెనకవైపు అంటే వీపు నుంచి చేసే ఆపరేషన్ (పోస్టెరో టాటెరల్ థోరకాటమీ).
⇒ వీటిలో కీహోల్ ప్రక్రియ ద్వారా వెనక వైపు నుంచి అంటే వీపు వైపు నుంచి కూడా సర్జరీ చేయవచ్చు.
వెనక వైపు నుంచి చేసే ఆపరేషన్ ప్రత్యేకత...
⇒ ఈ ఆపరేషన్‌లో ఏ ఎముకనూ కోయాల్సిన అవసరం ఉండదు. కేవలం వీపువైపున ఉండే కండరాలపై మాత్రమే గాటు పెట్టడం జరుగుతుంది.
ఈ తరహా సర్జరీతో ప్రయోజనాలివి...
⇒ వీపు వైపు నుంచి గుండె ఆపరేషన్ చేయడం వల్ల రొమ్ముపై పెద్ద గాటుకు ఆస్కారమే ఉండదు.
⇒ ఇక రెండో పెద్ద ప్రయోజనం ఏమిటంటే... ఎముకను కోయాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఎముక అతుక్కునే వరకూ గాయం మానదనే భయమూ ఉండదు.
⇒ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం కూడా చాలా తక్కువ.
⇒ ఇక మహిళల విషయానికి వస్తే రొమ్ముపై గాటు ఉండేందుకు ఆస్కారమే ఉండదు కాబట్టి వారి అందం (కాస్మటిక్‌గా) విషయంలో బెంగ పడాల్సిన అవసరం ఉండదు.
అందరి గుండెజబ్బులకూ వెనకవైపు నుంచే ఆపరేషన్ సాధ్యమవుతుందా? ఇది సురక్షితమేనా?
ఈ తరహా ఆపరేషన్ వెనకవైపు నుంచి చేస్తారు కాబట్టి గుండెకు సంబంధించిన అన్ని భాగాలను చేరడానికి అవకాశం ఉండదు. కాబట్టి గుండెజబ్బుల్లో కొన్నింటి విషయంలో మాత్రమే ఇలా వెనక వైపు నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గుండెలోని రంధ్రాలను మూసేందుకు చేయాల్సిన సర్జరీలు, కవాటాలను (వాల్వ్స్)ను సరిదిద్దేందుకు చేసే ఆపరేషన్స్‌లోనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఆయా సర్జరీల విషయంలో ఇది పూర్తిగా సురక్షితం. కాకపోతే సాధారణ ఆపరేషన్స్‌తో పోలిస్తే ఈ తరహా ఆపరేషన్స్‌కు కాస్త ఎక్కువ నైపుణ్యం అవసరం.