మన చరిత్రకు రాజముద్ర
ఒక సైనికుడు... ఒక చరిత్ర అధ్యయనకారుడు... పాలనా రంగ విద్యార్థులకు బోధకుడు
ఈ మూడు కోణాల కలబోత...
కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి.
కాశ్మీర్ రక్షణ కోసం దేశ సరిహద్దులో యుద్ధం చేశారు.
హైదరాబాద్ చరిత్ర ఇదీ అంటూ ఆధారాలు చూపించారు...
శాతవాహనుల నాణేలు ఇలా ఉంటాయని...
మధ్య యుగంలో దక్కను ప్రజల సామాజిక జీవనం ఇలా ఉండేదని కళ్లకు కట్టారు.
మనకు తెలిసిన అనేక మంది ఐఏఎస్,
ఐపిఎస్‌లకు చరిత్ర పాఠాలు చెప్పారు.
ఇప్పుడు లండన్‌లోని రాయల్ హిస్టారికల్
సొసైటీ పురస్కారాన్ని అందుకుని తన
అధ్యయనానికి రాజముద్ర వేసుకున్నారు.
అది 1965వ సంవత్సరం, ఆగస్టు ఐదవ తేదీ. భారత - పాకిస్థాన్ దేశాల సరిహద్దు. పంజాబ్ రాష్ట్రంలో ఖేమ్ కరణ్ సెక్టార్. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్)కి ఇరువైపులా సైన్యాలు మోహరించాయి. కాశ్మీర్ కోసం భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం షురూ అయింది. ఆ యుద్ధంలో మనదేశం తరఫున పాల్గొన్న ముప్ఫైవేల మందికి పైగా సైన్యాన్ని ముందుకు నడిపించిన అధికారుల్లో ఒక తెలుగు వీరుడు కూడా ఉన్నాడు.
ఆయనే లింగాల పాండురంగారెడ్డి. సెకండ్ లెఫ్టినెంట్‌గా సైన్యాన్ని నడిపించిన ఈ కెప్టెన్ 1970లో దేశ రక్షణ బాధ్యత నుంచి విశ్రమించారు. కానీ ఆయనలో పోరాట పటిమ నేటికీ విశ్రమించలేదు. అప్పటి పోరాటం ఆయుధాలతో చేస్తే ఇప్పటి పోరాటం అక్షరాలతో చేస్తున్నారు. చారిత్రక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన స్ఫూర్తితో ఆయన చరిత్ర పాఠాలను ఆపోశన పడుతున్నారు. ఆ శ్రమను గుర్తించిన లండన్‌లోని రాయల్ హిస్టారికల్ సొసైటీ... ఫెలోషిప్‌తో గౌరవించింది. ఈ గౌరవం అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఆయన.
‘‘మాది వరంగల్ జిల్లా జనగాం. డిగ్రీ పూర్తయిన తర్వాత రక్షణ వ్యవస్థలో చేరాను. ఆ సమయంలోనే ఇండో-పాక్ యుద్ధం జరిగింది. నాకు స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువ. రక్షణ రంగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఎం.ఎలో చేరాను. ఎం.ఎలో గోల్డ్‌మెడల్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఎం.ఫిల్, పిహెచ్‌డి చేశాను. శాతవాహనుల నాణేలు, మధ్యయుగ చరిత్ర కాలంలో దక్కను, భద్రతా సమితిలో హైదరాబాద్ వివాదం... వంటి అనేక అంశాల మీద అధ్యయనం చేశాను. వాటన్నింటిలో నేను ఉదహరించిన సహేతుకమైన ఆధారాలను నిర్ధారించుకున్న తర్వాత రాయల్ హిస్టారికల్ సొసైటీ నా పరిశోధనలను గుర్తించింది’’ అన్నారాయన.
హైదరాబాద్ వ్యవహారం మీద అధ్యయనం చేయడానికి బలమైన కారణమే ఉందంటారు పాండురంగారెడ్డి. ‘‘ఒకసారి న్యూయార్క్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలిస్తుండగా భద్రతాసమితిలో వివాదం నడుస్తున్న హైదరాబాద్ అంశం నా కంట పడింది. అది ఏంటంటే... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం భారత సమాఖ్యలో దేశంలోని సంస్థానాలన్నింటినీ విలీనం చేయడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా హైదరాబాద్ రాష్ట్రం అంశం వివాదాస్పదంగా ఉండిపోయింది. చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన అంశాలెన్నో తెలిశాయి. ఆ అంశం మీద అధ్యయనం చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. అయితే నేను ఆధారాలతో సహా బయటపెట్టదలుచుకున్న అనేక అంశాలను స్వీకరించడానికి స్థానిక యూనివర్శిటీలు ముందుకు వస్తాయో రావోననే సందేహంతో అన్నామలై నుంచి ఎం.ఫిల్ చేశాను. ఆ తర్వాత ఇక్కడే పిహెచ్‌డి చేయవచ్చని ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఆహ్వానం వచ్చింది’’.
శ్రీకాకుళంతో మొదలు పెట్టి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శాతవాహనుల గురించి, తెలుగు భాషలో విడుదల చేసిన వారి నాణేల గురించి ప్రత్యేకంగా పరిశోధన చేశారు పాండురంగారెడ్డి. మధ్యయుగం నాటి దక్కను చరిత్రనూ అనేక కోణాల్లో పరిశోధించి చరిత్రకు కొత్త అధ్యాయాలను కూర్చారు. వీటన్నింటినీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో అడుగుపెట్టాలనుకున్న విద్యార్థులకు పాఠాలుగా చెప్పి వారిని ఉత్తీర్ణులను చేశారు. ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ, ఐపిఎస్ అధికారి అరుణా బహుగుణ వంటి చాలామంది ఆయన దగ్గర చరిత్రపాఠాలు చదువుకున్నారు.
హెదరాబాద్, తెలంగాణ చరిత్రకు సంబంధించిన సాధికారిక సమాచారం కోసం రాజకీయ నేతలు ఆయనను సంప్రతిస్తున్నారంటే... చరిత్రపై పాండురంగారెడ్డి పట్టు అర్థం చేసుకోవచ్చు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక చారిత్రక సంఘటనలను గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు, డిసెంబర్ తొమ్మిదవ తేదీకి ఏదో అంతర్లీన సంబంధం ఉందని చమత్కరించారు పాండురంగారెడ్డి. ‘‘మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి నెహ్రూ రాజ్యసభలో ప్రకటించింది - 1952 డిసెంబర్ తొమ్మిదవ తేదీన! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం ప్రకటించింది - 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన! అలా తెలుగు వారికి డిసెంబర్ తొమ్మిది చారిత్రకంగా గుర్తుండే రోజు’’ అన్నారాయన.
అదే సమయంలో ‘‘రాష్ట్రం ఏదనేది ప్రధానం కాదు, ప్రజలు, వారి మధ్య సంబంధాలు ప్రధానం’’ అని విజ్ఞతను వ్యక్తం చేశారు.పాండురంగారెడ్డి మాటల్లో అక్షరం, ఆయుధం... ఈ రెండింటినీ సమర్థంగా ఉపయోగించగలిగిన నైపుణ్యం కనిపిస్తుంది. అలాగే అక్షరాన్ని ఆయుధంగా మార్చి... సమకాలీన రాజకీయాంశాల పట్ల ప్రతిస్పందిస్తూ వాటికి చారిత్రక ఆధారాలను జోడిస్తూ జాతీయ నాయకులకు ఉత్తరాలతో ఊపిరి సలపకుండా చేసిన చొరవ కూడా కనిపిస్తుంది. అలాంటి సునిశితమైన అధ్యయనాలే... ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీ పురస్కారాన్ని తెచ్చి పెట్టాయి. ఆయన చెప్పిన చరిత్రకు రాజముద్ర వంటి గౌరవాన్ని తెచ్చాయి.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి