గాయం ... సైనికుడికి తీపి గుర్తు! | Captain Lingala Panduranga Reddy Experiences ... in army | Sakshi
Sakshi News home page

గాయం ... సైనికుడికి తీపి గుర్తు!

Published Sun, Jan 11 2015 1:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

గాయం ... సైనికుడికి తీపి గుర్తు! - Sakshi

గాయం ... సైనికుడికి తీపి గుర్తు!

యుద్ధక్షేత్రం
కార్గిల్‌ను ఆక్రమించుకుంటే భారత్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చనేది పాకిస్తాన్ యోచన! వాస్తవాధీన రేఖకు సమీపంలో ఎత్తులో ఉంటుంది కార్గిల్. దాని మీద గనక క్యాంపు ఏర్పాటు చేసుకుంటే 180 డిగ్రీల కోణంలో భారత్‌లో భాగంగా ఉన్న కశ్మీర్ మీద ఎప్పుడంటే అప్పుడే దాడి చేయొచ్చు. పాకిస్తాన్ కార్గిల్ కోసం తపించేది అందుకే. అలాంటి కీలకమైన ‘కార్గిల్ ఆపరేషన్ 1971’లో పోరాడిన కెప్టెన్ లింగాల పాండు రంగారెడ్డి అనుభవాలు...

మాది వరంగల్ జిల్లా జనగామ్. 1962లో సైన్యంలో చేరాను. మొదటి ఏడాది డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాను. తర్వాత 11 గూర్ఖా రైఫిల్స్ విభాగంలో నాగాలాండ్, మిజోహిల్స్, కశ్మీర్‌లలో పనిచేశాను. 1965లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్-పాక్ యుద్ధం జరిగింది. కార్గిల్‌ను పాకిస్తాన్ ఆక్రమించుకోవడం, భారత్ తిరిగి విడిపించుకోవడం జరిగాయి. ఐదారేళ్లకు మళ్లీ కార్గిల్‌ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మా లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.బి.గురూంగ్ నుంచి మా బెటాలియన్‌కు ఆదేశాలు అందాయి. అప్పుడు నేను కెప్టెన్‌ని. ఆ ఆదేశాలతో మా బృందం యుద్ధానికి బయలుదేరింది.
 
60 కిలోల బరువుతో...
అది 1971 డిసెంబర్ నెల. ఏడవ తేది. తెల్లవారు జామున నాలుగున్నర. కశ్మీర్ లోయలో షింగో నది దాటితే కార్గిల్! అది ఎత్తై మంచుపర్వతం. మా బృందంలోని 90 మందిమి మూడు జట్లుగా విడిపోయాం. ప్రధాన జట్టులో 60 మంది, కుడి జట్టులో 15, ఎడమ జట్టులో 15 మందిమి ఉన్నాం. ప్రత్యర్థుల దృష్టి ప్రధాన బృందం మీద నిలిచేటట్లు చేసి, పక్క జట్ల వాళ్లు క్యాంపును స్వాధీనం చేసుకోవాలనేది మా వ్యూహం. భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్‌ఫోర్స్ సపోర్టు కానీ, ట్యాంకర్స్ సపోర్టు కానీ లేదు.
 
ఆపరేషన్‌లో పాల్గొనే సైనికుడికి డ్రైఫ్రూట్స్ ప్రధాన ఆహారం. స్టెన్‌గన్, తూటాలు, కక్రూ, ఇతర ఆయుధ సామగ్రి, ఆహారం అంతా కలిసి సుమారు 60 కిలోల బరువుంటుంది. లక్ష్యానికి మూడు వేల గజాల ముందు ఆహారం వంటి అదనపు బరువు వదిలించుకుని ఆయుధాలను మాత్రమే దగ్గర ఉంచుకుంటాం. మా ఆపరేషన్‌లో మొదటి రెండు రోజుల ప్రయాణం ఫరవాలేదు. మూడో రోజు చివరి 1500 గజాల దూరం ప్రయాణించడానికి నాలుగు గంటలు పట్టింది. మంచు పర్వతాన్ని పాక్కుంటూ ఎక్కాలి. శబ్దం రాకూడదు. దగ్గు వచ్చినా తమాయించుకోవాలి.

ఆ ఆపరేషన్‌లో నా కాలికి అయిన గాయం ఆనవాలు అలాగే ఉండిపోయింది. సాధారణంగా దేహానికి గాయమైతే ఆ మచ్చను చూసుకున్నప్పుడు ఎవరైనా బాధ పడతారు. కానీ సైనికుడు యుద్ధంలో తగిలిన దెబ్బను తీపి గుర్తుగా భావిస్తాడు.
 
మూడు రోజుల్లో విజయ పతాకం

ప్రధాన బృందంలోని గూర్ఖాలు ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొంటూ ఉంటే, పక్క బృందాల్లో ఉన్న మేము హ్యాండ్ గ్రేనేడ్‌లు వేస్తూ క్యాంపును స్వాధీనం చేసుకున్నాం. ఎదురొచ్చిన వారిని కక్రూ (వంపు తిరిగిన కత్తి)లతో దాడి చేస్తూ మొత్తం 45 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశాం. ఖేమ్ కరణ్ సెక్టార్ నుంచి కార్గిల్ వరకు సాగిన మా మూడు రోజుల యుద్ధ ప్రస్థానం విజయవంతంగా ముగిసింది. మన పతాకాన్ని ఎగురవేయడానికి అప్పుడు మా దగ్గర జెండా ఉండదు. తాత్కాలికంగా మా యూనిట్ జెండానే పాతాం.

కార్గిల్ మిలటరీ క్యాంపు నుంచి ఆకాశంలోకి ఎరుపు, ఆకుపచ్చ రంగు బుల్లెట్లను పేల్చాం. ఆ సంకేతాన్నందుకుని మన బృందాలు వచ్చేశాయి. తెల్లవారి ఏడుగంటలకంతా వచ్చిన తొలి బృందం క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చడం వంటి పనుల్లో నిమగ్నమైంది. తొమ్మిది- పది గంటల సమయంలో మరో బృందం ఆహారంతో వచ్చింది.  యుద్ధంలో ప్రాణం పోతుందేమోనన్న స్పృహ కూడా ఉండదు. అయితే తోటి సైనికుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు అతడి ఆయుధాల్ని మాత్రం తీసుకుని, దేహాన్ని అలాగే వదిలి ముందుకెళ్లాల్సి రావడం గుండెను పిండేస్తుంది. అయినా, సైనికుడిని కర్తవ్యమే లాక్కెళ్తుంది కాబట్టి ముందుకు పోగలుగుతాడు.
 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement