యు. ఎస్.ఎ. అవ్వా... | Our NRI grandsons | Sakshi
Sakshi News home page

యు. ఎస్.ఎ. అవ్వా...

Published Sun, Jul 24 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

యు. ఎస్.ఎ. అవ్వా...

యు. ఎస్.ఎ. అవ్వా...

అవాక్కు కావాల్సిన విషయమే!
మన అమ్మమ్మలు, నానమ్మలు  మన ఎన్‌ఆర్‌ఐ మనవళ్లు, మనవరాళ్లను చూసుకోవడానికి
అమెరికా వెళ్లినప్పుడు అక్కడి పక్కింటి వాళ్లు, పక్క వీధివాళ్లు..
‘మా పిల్లలను కూడా చూసుకోండి.. ఫ్రీగా వద్దులేండి’ అని అంటే
మమకారంతో కొంచెం, డబ్బు కారణంగా కొంచెం ఈ అవ్వలు
అమెరికాలో డే  కేర్ సెంటర్లు రన్ చేస్తున్నారు
సంతోషం! వెరీ గుడ్!
వృద్ధులు వృద్ధిలోకి వస్తున్నారు.. శభాష్!

 
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ఉదయం అయిదున్నర... డిపార్చర్స్ గేట్స్అక్కడంతా యాభై అయిదేళ్లకు పైబడిన వారే ఉన్నారు. ఆలుమగల జంటలు కొన్ని..  ఒంటరిగా ప్రయాణం చేస్తున్న స్త్రీలు కొందరు! ‘‘ఎక్కడికి వెళ్తున్నారు?’’ యాభై అయిదేళ్ల స్త్రీ అడిగింది అరవై ఏళ్లు పైబడిన ఓ మహిళను. ‘‘డాలస్. మీరెక్కడికి?’’ సమాధానం చెప్పి తిరిగి అడిగింది అరవై ఏళ్ల ఆ స్త్రీ. ‘‘లండన్’’ చెప్పింది యాభై అయిదేళ్ల ఆవిడ. ‘‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’’‘‘కాదండీ.. మాది వైజాగ్, నేను అక్కడ నేవీలో పనిచేసేదాన్ని. ఈ మధ్యే వాలంటరీ రిటైర్మంట్ తీసుకున్నాను పిల్లల కోసం’’ అంది. ‘‘పిల్లల కోసమా?’’ పక్కనే ఉన్న ఇంకో మహిళ. ఆమె న్యూజెర్సీ వెళ్తోంది.

‘‘అవునండీ.. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ లండన్‌లోనే ఉంటున్నారు. అమ్మాయికి పెళ్లయి అయిదేళ్లవుతోంది. అబ్బాయికి మొన్నీమధ్యే అయింది. ఇప్పుడు అమ్మాయికి రెండో కాన్పు అయింది. డెలివరీకి వాళ్ల అత్తగారు వెళ్లారు. ఆవిడ ఆర్నెల్లు ఉండి వచ్చారు. ఇప్పుడు నా వంతు. అమ్మాయి తొలి చూలు అప్పటి నుంచే వాళ్ల అత్తగారు, నేను వంతులవారీగా వెళ్తున్నాం. పిల్లలను చూసుకోవ డానికి. ప్రతి ఆర్నెల్లకోసారి ఆరునెలలు సెలవు కావాలంటే దొరకదు కదా. అమ్మాయికేమో కష్టంగా ఉంటోంది. అందుకే ఈ వంతులు, వాలంటరీ రిటైర్మెంట్’’ తన బాధ్యత వివరించింది ఆమె.

‘‘మాదీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. నేనేమీ ఉద్యోగం చేయను కానీ మావారికి ఇంకా సర్వీస్ ఉంది. మా ఇద్దరు పిల్లలూ అమెరికాలోనే ఉంటున్నారు. ఇద్దరికీ పిల్లలు. కూతురు దగ్గరికి వెళితే కోడలికి కోపం, కోడలి దగ్గరకు వెళితే కూతురికి కోపం. ఇద్దరికీ ఉద్యోగాలు. వాళ్ల పిల్లల్ని చూసుకోవడానికి నేను అక్కడ ఉంటే ఇక్కడ మా వారికి కష్టం’’ న్యూజెర్సీ వెళ్తున్న లేడీ గోడు వెళ్లబోసుకుంది.
 ‘‘మరే.. మాదీ అదే బాధ. మా వారు ఇక్కడ ఈసిఐఎల్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. చక్కగా ఇద్దరం పుణ్యక్షేత్రాలు తిరుగూ రిటైర్మెంట్ లైఫ్ గడపాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ పిల్లలు అమెరికాలో స్థిరపడి మాకు స్థిరత్వం లేకుండా  చేస్తున్నారు. యేడాదిలో రెండుసార్లు తప్పకుండా వెళ్లిరావాల్సి వస్తోంది. ఇదిగో ఇప్పుడు పిల్లలకు ఎండాకాలం సెలవులట. మొగుడుపెళ్లాలు ఉద్యోగాలకు వెళ్లాలి కాబట్టి పిల్లలను చూసుకోడానికి రమ్మని టికెట్లు బుక్ చేసి మరీ చెప్పారు. తప్పుతుందా..’ అంటూ విసుక్కుంది అరవై ఏళ్లు పైబడిన అమ్మ. అక్కడ కూర్చున్న అందరిదీ ఇలాంటి విదేశీ ప్రయాణమే. గమ్యం కొందరికి అమెరికా అయితే ఇంకొందరికి యూరప్.ఇలా వెళ్లిన వాళ్లంతా అమెరికాలో ఏం చేస్తున్నారు? డే కేర్ సెంటర్స్‌కి ఓనర్స్ అవుతున్నారు..

న్యూజెర్సీ.. ఎడిసన్ టౌన్..
 సాయంకాలం నాలుగంటలు.. పార్క్‌లో ఓ అరవై అయిదేళ్ల అమ్మమ్మ చుట్టూ అయిదారుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు.
 రామాయణంలోని సుందరకాండ కథను కాస్త ఇంగ్లిష్‌లో ఎంతో తెలుగును మిక్స్ చేసి హావభావాలతో చెప్తోంది. పిల్లలంతా కుతూహలంగా వింటున్నారు.  కథ చెప్పాక కాసేపు వాళ్లతో ఆడుకొని అందరినీ తీసుకొని ఇంటికెళ్లింది అ అమ్మమ్మ.
 ఆరున్నర నుంచి ఏడు మధ్య కొంత మంది తండ్రులు, కొంత మంది తల్లులు వచ్చి ఆ పిల్లలను తీసుకెళ్లారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఏడు వరకు బ్యాచులు, బ్యాచులుగా ఆ పిల్లల్ని చూసుకుంటోంది ఆ అమ్మమ్మ పేరు సునంద.
 
డాలస్‌లో..
సాయంకాలం.. ఇంకో నానమ్మ దగ్గర కొంత మంది తల్లులు, తండ్రులు తమ పిల్లలను వదిలి వెళ్లిపోతున్నారు.  ఆ పిల్లలతో గడపడానికి అప్పటికే ఇంటి పని ముగించుకొని సిద్ధంగా ఉంది నానమ్మ. బొమ్మలతో ఆడిస్తూ.. కథలు చెప్తూ ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్లకు తినడానికి ఏదో ఇస్తూ.. పాలు తాగిస్తూ.. నిద్రపోయే వారిని నిద్ర పుచ్చుతూ ఉదయం మూడింటి వరకూ కాలక్షేపం చేసింది. మూడు నుంచి నాలుగు మధ్య ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి వాళ్లను తీసుకెళ్లారు. వాళ్లు వెళ్లిపోయాక బొమ్మలను సర్ది, హాలంతా శుభ్రం చేసి విశ్రాంతి తీసుకుంది. ఆమె పేరు రాజేశ్వరి.

ఈ అమ్మమ్మ, నానమ్మల రాక  కోసం సొంత పిల్లలే కాదు ఆ పిల్లల పక్కింటి వాళ్లూ ఎదురు చూస్తుంటారు. తమ పిల్లలనూ ఈ నానమ్మ, అమ్మమ్మలకు అప్పజెప్పి హాయిగా ఉద్యోగాలకు వెళ్తారు. ఆ పసివాళ్లూ ఈ అమ్మమ్మ, నానమ్మల ఆలనపాలనలో తమ అసలు అమ్మమ్మ, నానమ్మల లోటును తీర్చుకుంటుంటారు.

ఆ జర్నీ ఎలా  మొదలైందంటే...
‘ఆరేళ్ల కిందట మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వచ్చాను. మనవడు పుట్టి మూణ్ణెళ్లు అయ్యాక మా వియ్యపురాలూ వచ్చింది. అమ్మాయి, అల్లుడు ఆఫీస్‌కు వెళ్లిపోతే మనవడిని చూస్తూ ఇద్దరమే ఉండేవాళ్లం. వాడేమో రోజులో చాలాసేపు పడుకునే ఉండేవాడు. పగలంతా విసుగొచ్చేది మా ఇద్దరికి. చుట్టుపక్కల అంతా తెలుగువాళ్లే. సరదాకి ఇంట్లో పచ్చళ్లు పెడుతూ ఇరుగుపొరుగుకి పంపేవాళ్లం. మా పచ్చళ్ల రుచి బాగా నచ్చిన ఓ నార్త్ ఇండియన్ అమ్మాయి.. ‘ఆంటీ మాకు  కొంచెం ఎక్కువ మొత్తంలో పచ్చడి పెట్టిస్తారా అని అగింది. అదేం భాగ్యమని పెట్టించాం. పచ్చడి పెట్టించినందకు ఆ పిల్ల కొన్ని డాలర్లు మా చేతిలో పెట్టింది. చచ్చే సిగ్గయింది మాకు. అయినా వినకుండా డబ్బిచ్చి వెళ్లిపోయింది. మా అమ్మాయి వచ్చాక విషయం చెప్పాం. అప్పుడు నా కూతురు ‘ఎంచక్కా ఇలా పచ్చళ్లు పెట్టి డాలర్లు సంపాదించుకోవచ్చు కదా’ అంటూ జోక్ చేసింది. కానీ మా వియ్యపురాలు దాన్ని సీరియస్‌గా తీసుకుని‘అవునండీ.. మనమెందుకు ఊరికెనే కూర్చోవాలి.. పచ్చళ్లు పెట్టి అమ్ముదాం’ అంది.

మొదట్లో నేను సందేహించినా తర్వాత ఒప్పుకోక తప్పలేదు. పచ్చళ్లు పెట్టడం మొదలు పెట్టాం. ఈలోపే మా అమ్మాయి వాళ్లింటికి ఎదురుగా ఉండే ఒక తెలుగు అమ్మాయి ఇంకో పని అప్పజెప్పింది. ‘ఆంటీ.. నాకు, మావారికీ ఇద్దరికీ ఒకేసారి నైట్ షిఫ్ట్స్ పడ్డాయి. మా పిల్లాడిని కాస్త చూసుకుంటారా.. వారం రోజులు. ఊరికే కాదు వంద డాలర్లు ఇస్తాను’ అంది. ఆ పిల్లను చూసి ఇంకో అమ్మాయి తన పిల్లాడిని అప్పగించింది. అలా మొత్తానికి నలుగురు పిల్లలయ్యారు. డే కేర్ సెంటర్‌లా తయారైంది. కాలక్షేపానికి కాలక్షేపం.. డబ్బులకు డబ్బులు. బాగానే ఉందనిపించింది.. అప్పటి నుంచి దాన్నే కంటిన్యూ చేస్తున్నాం! చలికాలం మా వియ్యపురాలు, ఎండాకాలం నేను వచ్చి డే కేర్ సెంటర్ చూస్తాం. ట్రైనింగ్ తీసుకొమ్మని మా అల్లుడు సలహా ఇచ్చాడు. నేను మా వియ్యపురాలు ఇద్దరం ఇక్కడే (న్యూజెర్సీ)లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. ఇంగ్లిష్ మాట్లాడ్తాం. హిందీ నేర్చుకున్నాం. ఈ పిల్లలకు రకరకాల కథలు చెప్పడం కోసం పురాణాలు, భాగవత, భారత, రామాయణాలను ఔపోసన పట్టేశామనుకోండి (నవ్వుతూ). వంటలు కూడా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ నేర్చుకున్నాం. ఇక్కడున్న ఆర్నెల్లు మాకు ఇదే పని.. పచ్చళ్లు పెట్టడం, పిండివంటలు చేయడం, పిల్లలకు మన సంస్కృతికి సంబంధించిన కథలు చెప్పడం, మన ఆటలు, పాటలు నేర్పడం’’ అంటూ తమ డే కేర్  జర్నీ గురించి చెప్పుకొచ్చారు సుశీల.
 ఈ వయసులో విదేశాల్లో ఉన్న పిల్లల ఇంటిని చూసుకునే బాధ్యతనే కాక ఆ పిల్లల పిల్లలనూ పెంచుతూ.. ఇంకో ఇంటి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ నాలుగు రాళ్లూ సంపాదించుకుంటున్నారు. పిల్లలకు భారం కాకుండా బతికేస్తున్నారు. ఊహించని డాలర్ డ్రీమ్స్‌ను ప్రాక్టికల్‌గా చూస్తున్నారు.
 - సరస్వతి రమ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement