ఆగస్టులో సెరెనాకు అపురూపమైన ట్రోఫీ | outstanding trophy for Serena in August | Sakshi
Sakshi News home page

ఆగస్టులో సెరెనాకు అపురూపమైన ట్రోఫీ

Published Mon, Apr 24 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ఆగస్టులో సెరెనాకు అపురూపమైన ట్రోఫీ

ఆగస్టులో సెరెనాకు అపురూపమైన ట్రోఫీ

విరామం

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ ఇక తన ఆటల్ని కట్టి పెట్టేసినట్లే! మే లో ఫ్రెంచి ఓపెన్‌ ఉంది. సెరెనా ఆడరు. జూలైలో వింబుల్డన్‌ ఉంది. సెరెనా ఆడరు. ఆగస్టులో యు.ఎస్‌. ఓపెన్‌ ఉంది. సెరెనా ఆడరు. అయితే ఇదేమీ ఆమె అభిమానుల్ని మరీ అంతగా బాధించే విషయం కాదు. ఎందుకంటే.. ఈ ఏడాది ఆగస్టులో లేదా సెప్టెంబర్‌లో ఆమె చేతుల్లో కనిపించబోయే ఓ కొత్త ‘ట్రోఫీ’ కోసం క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూడడం మొన్న ఏప్రిల్‌ 19నే మొదలైంది. సెరెనా తను 20 వారాల గర్భిణిని అని ప్రపంచానికి వెల్లడించిన రోజది! ఇంకో పదిహేను వారాల్లో సెరెనా తల్లి అవుతారు. ఆ ‘ట్రోఫీ’ చేతికొచ్చాక (బిడ్డ పుట్టాక) మళ్లీ ఆమె టెన్నిస్‌లోకి వస్తారా అన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేని జోస్యం.

సెరెనా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గెలిచి తన 23వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ని గుప్పెట పట్టుకున్నాక, ఆమె కోచ్‌ ప్యాట్రిక్‌ మోరాటోగ్లూ ను మెల్‌బోర్న్‌ పార్క్‌ వరండాలో మీడియా రిపోర్టర్లు చుట్టుముట్టారు. ‘సెరెనా తప్పకుండా ఇంకొక టైటిల్‌ను కొట్టేస్తారు’ అని వారితో అన్నారు ప్యాట్రిక్‌. ఆ ‘ఇంకొక’ టైటిల్‌కు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. దాన్నీ కొట్టేస్తే.. ఇప్పటి వరకు ఉన్న 24 అనే రికార్డును సెరెనా సమం చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆ రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌ (74) పేరు మీద ఉంది. సెరెనా 17 ఏళ్ల వయసులో 1999 యు.ఎస్‌. ఓపెన్‌లో తొలి టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ పద్దెనిమిదేళ్లలో మార్గరెట్‌కు దాదాపుగా దగ్గరికి వచ్చేశారు.
ప్యాట్రిక్‌ మోరాటోగ్లూ 2012 నుంచి సెరెనాకు కోచ్‌. ఆయన కోచింగ్‌లో సెరెనా ఇప్పటి వరకు 10 టైటిళ్లు, ఒక ఒలింపిక్‌ గోల్డ్‌ సాధించారు. సెరెనాను ఆ 24 మైలురాయిని కూడా దాటించాలని ప్యాట్రిక్‌ అనుకుంటుండగానే ఆమె గర్భిణి అన్న వార్త ఆయనకు తెలిసింది. నిజానికి ఆయనకు ప్రపంచానికి తెలియడానికి రెండువారాల ముందు మాత్రమే తెలిసింది. సెరెనా స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. అయితే ఆయన పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇలాంటి సంతోషకరమైన ఒక విషయం తన చెవికి సోకే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ఆయన ఊహిస్తూనే ఉన్నారు.

గత డిసెంబరు చివరి వారంలో సెరెనా బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సిస్‌ ఓహానియన్‌.. సెరెనాతో ఎంగేజ్‌మెంట్‌ గురించి తన సొంత ‘రెడిట్‌’ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశారు. జనవరి ఒకటిన సెరెనా, అలెక్సిస్‌ న్యూజిలాండ్‌లోని ఆక్లండ్‌లో ఏకాంతంగా గడిపారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెరెనా మ్యాచ్‌లను చూడ్డం కోసం అలెక్సిస్‌ ఆ నెలంతా ఆమె వెంటే ఉన్నారు. వీళ్లిద్దరి తొలి పరిచయం రోమ్‌లో. అక్కడినుంచి ఇద్దరూ న్యూయార్క్‌ వచ్చేశాక అలెక్సిక్‌ అకస్మాత్తుగా ఓ రోజు సెరెనా ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యాడు. మళ్లీ రోమ్‌కి వెళదాం అన్నాడు. అతడి చేతిలో రెండు రోమ్‌ టికెట్‌లు ఉన్నాయి. ‘రోమ్‌ ఎందుకు?’ అని అడిగారు సెరెనా. ‘వెళ్లాక చెప్తాను’ అన్నాడు అలెక్సిస్‌. వెళ్లాక చెప్పలేదు, అడిగాడు. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. సెరెనా నవ్వారు. ‘ఎస్‌’ చెప్పారు.
ఇదంతా కోచ్‌ ప్యాట్రిక్‌ చూస్తూనే ఉన్నాడు. అందుకే సెరెనా ప్రెగ్నెంట్‌ అని తెలియగానే, ‘హానెస్ట్‌లీ ఐ వజ్‌ ఓన్లీ హాఫ్‌ సర్‌ప్రైజ్‌డ్‌’ అని నవ్వుతూ అన్నాడు. ‘‘సెరెనా ఆడడం తాత్కాలికంగా ఆగిపోయినా, బిడ్డ తల్లిగా కూడా ఆమె గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడం బాగుంటుంది.

తను అందుకు సిద్ధం అవుతారనే ఆశిస్తున్నాను’’ అని కూడా ప్యాట్రిక్‌ అంటున్నారు. సెరెనాకు తప్ప ప్లేయర్‌లు ఎవరికీ ఆయన స్వయంగా తనే కోచింగ్‌ ఇవ్వడం లేదు. ఆ విధంగా ఆయన మరో నాలుగు నెలల పాటు నిరుద్యోగి. సెరెనా కూడా ఈ నాలుగు నెలలూ టెన్సిస్‌ కోర్టులలో కనిపించరు కాబట్టి.. ఇప్పటి వరకు ఆటకు దూరంగా ఉన్న  విక్టోరియా అజారెంకా, షెరపోవా వంటి వాళ్లు టైటిల్స్‌ కొట్టే అవకాశం ఉంది. 27 ఏళ్ల రష్యన్‌ సంతతి క్రీడాకారిణి అజారెంకాకు బ్రేక్‌ వచ్చింది కూడా కాన్పు కారణంగానే. పండంటి పిల్లాడిని ప్రసవించి ఈ జూలైలో మళ్లీ ఆటలోకి వస్తున్నారు ఆజారెంకా. జర్మనీ టెన్నిస్‌ ప్లేయర్‌ షెరపోవా నిషేధం ముగిసింది కాబట్టి రాకెట్‌తో రెడీ అవుతున్నారు.

సెరెనా బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సిస్‌

కోచ్‌ ప్యాట్రిక్‌ మోరాటోగ్లూతో సెరెనా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement