మావాడు మగాడోచ్చ్...
కొడుకు పుట్టాడు... సంతోషం!
అరె ఫాస్ట్‌గా నడుస్తున్నాడు... సంతోషం!
చెల్లిని కొట్టాడు... సంతోషం!
అమ్మని లెక్కచెయ్యడంలేదు... సంతోషం!
అయ్యో సిగరెట్టు కాల్చాడు... సంతోషం!
అమ్మాయిని వేధించాడు.. సంతోషం!
కొడుకు పుట్టాడని బర్త్‌డే పార్టీ చేసుకోవడం కాదు. వాడు మందు పార్టీ చేసుకోకుండా చూసుకోండి.
పోలీస్ స్టేషన్‌లో అడిగితే ‘ఆఁ మానాన్న తాగుతున్నాడు... తప్పేంటి!’ అని చెప్తున్నారట.
ఎందుకు వేధించావు రా అని అడిగితే
‘ఆఁ మానాన్న మా అమ్మని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు’ అని ఇంకొకడు చెప్పాడట.
ఇలాంటి మగాళ్లను మనం ఇంట్లోనే మాన్యుఫ్యాక్చర్ చేస్తున్నాం. డిఫెక్ట్ ఉంటే తప్పు మీదే... అందుకే మగపిల్లలు చేసే తప్పుడు పనులన్నీ కరెక్టని సంతోషపడటం మానండి.
అవునూ.... పై వరుసలో ఆఖరి పంక్తి రాయటం మరిచిపోయాం... జరభద్రం.
అమ్మానాన్నలను గెంటేశాడు... సంతోషం!
‘‘నా కొడుక్కేంటేమహారాజు. వాడికేం చెప్పనవసరం లేదు’’
‘‘వాడు మగాడు.. వాడేం చేసినా చెల్లుతుంది’’
‘‘పిల్లవాడికి హద్దులు గీయడం మంచిది కాదు. వాడన్నీ తెలుసుకోవాలి.’’
‘‘మగపిల్లవాడు.. వాడి ఎంగిలి పళ్లెం వాడే తీయడమేంటి? ఆడపిల్లలేం చేస్తున్నారు?’’
‘‘ఆడపిల్లకు అన్నింటినీ ఓర్చుకునే సహనం ఉండాలి.
మగపిల్లవాడికి ఆవేశం ఉండాలి’’
‘‘మగపిల్లవాడికి నోరు ఉండాలి. నలుగురినీ గదమాయించి పనులు చేయించుకోవాలి.’’
‘‘ఆడపిల్లకు అంత నోరు ఉండటం మంచిది కాదు.
అణకువగా ఉండటం నేర్చుకో..’’
‘‘ఆడపెత్తనం ఇంటికి ఎప్పటికీ చేటే! ఇంటికి యజమాని మగవాడే. వాడు చెప్పిందే వేదం.’’
మన ఇళ్లలో రోజూ ఇలాంటి మాటలతోనే సుప్రభాతం మొదలవుతుంది. మగాడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, మగాడి గొప్పదనం ఎలాంటిదో.. ఇలాంటి మాటలు అన్ని రకాలుగా పిల్లల మెదళ్లను ‘మేల్’కొలుపుతూనే ఉంటాయి. ఇలాంటి మాటల తూటాలు ఆడపిల్లల మనసులను గాయపరుస్తుంటాయి. అబ్బాయి ‘అలా’ ఉండాలి. అమ్మాయి ‘ఇలా’ ఉండాలి అని మన ఇళ్లలోని పెద్దలే ఒక కనిపించని ‘గీత’ గీసేస్తారు. ఇలాంటి ‘గీత’బోధలతోనే అబ్బాయిల మనసుల్లో వివక్ష బీజాలను నాటుతుంటారు. మహిళలను చులకనగా చూసేలా మగపిల్లలను తయారు చేస్తున్నది మన ఇంటి మనుషులే. ఇలాంటి పెంపకంలో పెరిగిన మగపిల్లలే కాలేజీల్లో ర్యాగింగ్‌లాంటి దుశ్చర్యలకు దిగుతారు. అమ్మాయిలను వేధించి ఆనందించే పైశాచిక ప్రవృత్తిని పెంచుకుంటారు. చిల్లర నేరాల నుంచి పెద్దపెద్ద ఘోరాల వరకు దేనికైనా తెగిస్తారు. రక్షణ లేకుండా ఆడపిల్లలను బయటకు పంపలేకపోతున్నాం అని బాధపడే కంటే, ముందు మగపిల్లలను సక్రమంగా పెంచకపోతే ప్రమాదం అని గ్రహించడం మంచిది.
తండ్రే రోల్ మోడల్..
రాహుల్ టెన్త్‌క్లాస్‌లో చేరాడు. తండ్రి మూర్తి అంటే అతనికి అమితమైన భయం. అతన్ని అబ్బురంగా చూస్తుంటాడు. మూర్తి రోజూ పిల్లల బాగు కోసం చెప్పే మంచి మాటలు, జాగ్రత్తలు అన్నీ ఒక పుస్తకంలో రాయమని రాహుల్‌కి చెప్పేవాడు. రాహుల్ అలాగే చేస్తూ తండ్రి ప్రవర్తన అంతా అతనికి తెలియకుండా మరో బుక్‌లో రాసుకునేవాడు. ‘మా నాన్న ఇంట్లోనే స్మోక్ చేస్తాడు, తాగుతాడు. బయటే ఎక్కువగా ఉంటాడు. అమ్మ ఏం చేసినా తిడతాడు. ఒక్కోసారి కొడతాడు. అయినా అమ్మ నాన్నకు ఎదురు చెప్పదు.. ఇవన్నీ డెయిరీలో రాసి చివరలో ‘మా నాన్న చాలా గొప్పవాడు. చాలా మంచివాడు. నేనూ పెద్దయ్యాక ఇలాగే ఉండాలి’ అని రాసుకున్నాడు.
మంచి చెడులకున్న వ్యత్యాసం రాహుల్‌కు తెలియదు. నిజానికి ఆ ఈడు పిల్లలెవరికీ తెలియదు. తండ్రిలాగే తానూ ఉండాలి అనుకున్నాడు. తండ్రిలాగే స్మోక్‌చేస్తూ బయట కనబడ్డాడు. అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. టీచర్లు, పెద్దలు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇప్పుడతడి తలకెక్కడం లేదు. తండ్రి ప్రవర్తనను చూస్తూ పెరిగిన పిల్లలు తామూ అలాగే తయారవుతారు.
ఇంట్లో ఇలాగే ఉంటే..
విశాల్ వయసు 18 దాటింది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇటీవలే కాలేజీ నుంచి సస్పెండయ్యాడు. కొడుకును బాగు చేయమని నిపుణులను సంప్రదిస్తే విశాల్ వారితో...‘ఆడపిల్లలు సఫర్ అవుతూనే ఉండాలి కదా! మేం సుఖాల మధ్య పెరగాలి. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. మా అక్కలిద్దరినీ ఇప్పటికీ మా నాన్న తిడతాడు. కొడతాడు. అమ్మను కూడా! నన్ను మాత్రం ఏమీ అనడు. మరి నేను చేసింది తప్పెలా అవుతుంది?’ అని ఎదురు ప్రశ్నించాడు.
నిర్లక్ష్యం చూపే ప్రభావం..
ఫరూఖ్ వయసు 15. బుద్ధిమంతుడని ఇంటా బయట పేరున్న అబ్బాయి. ఈ మధ్య కుంటిసాకులతో స్కూల్ మానేస్తున్నాడు. టీవీ చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నాడు. ఇంట్లో స్కూల్‌కి వెళుతున్నానని చెప్పి నెట్ సెంటర్‌కో, హుక్కా సెంటర్‌కో చేరుకుంటున్నాడు. చదవకుండా పరీక్షల్లో కాపీయింగ్ చేయడం, వేరే పిల్లలు రాసినట్టుగా అమ్మాయిలకు లవ్‌లెటర్స్ రాసి విసిగించడం... చేస్తున్నాడు. ఫరూఖ్‌ని టెస్ట్ చేసిన నిపుణులు ఏం చెప్పారంటే -‘నేనొక్కడినే కాదుగా, మన భారతీయులందరూ నిర్లక్ష్యంగానే ఉంటారు. ఇలా ఉండటమే కరెక్ట్’ అని సమాధానమిచ్చాడట. ఎంతో మెచ్యూర్డ్‌గా ఉండే ఫరూఖ్ తన చుట్టూ ఉన్నవారిలోని నిర్లక్ష్యాన్ని రోల్‌మోడల్‌గా తీసుకున్నాడు. అదే కరెక్ట్ అనే భావనలో ఉన్నాడు.‘నేను తప్పు చేశాను’ అని ఏ అబ్బాయీ ఒప్పుకోడు. ఎందుకంటే అది ‘తప్పు’ అని అతనికే తెలియదు.
ఏడిపించకూడదని నేర్పిస్తున్నామా..?
‘మగపిల్లలు ఏడవకూడదు’.. ‘మగపిల్లలు ఏడుస్తారా..?’ ‘ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటి..? మగపిల్లాడివి కావూ..?’ పసితనం నుంచే మనం మగపిల్లలకు నూరిపోసే మాటలివి. ఈ ధోరణిని ఎత్తిచూపుతూ ‘వోగ్’ రూపొందించిన ప్రకటనలో ఏడుస్తున్న మగపిల్లలతో వాళ్ల తల్లిదండ్రులు ఇవే మాటలు అంటారు. ఈ ప్రకటనలో వేర్వేరు దృశ్యాలు కనిపిస్తాయి. పొత్తిళ్లలో పసిపిల్లాడి నుంచి క్రీడామైదానంలో విజయం సాధించి ఆనందబాష్పాలు రాలుస్తున్న యువకుడి వరకు.. తల్లిదండ్రులు వాళ్లకు నూరిపోసేది ఒక్కటే.. ‘మగపిల్లలు ఏడవకూడదు..’ ముగింపు ముందు మరో దృశ్యం.. ఒక యువకుడు తన భార్యను కొడతాడు. కమిలిన ముఖంతో ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. వెంటనే తెరపై మాధురీ దీక్షిత్ ప్రత్యక్షమవుతుంది.. ‘మగపిల్లలకు ఏడవకూడదని చెబుతున్నాం.. ఏడిపించొద్దని వాళ్లకు నేర్పిస్తున్నామా..?’ అని ప్రశ్నిస్తుంది. ఏడవకూడదనే కాదు, ఏడిపించకూడదని కూడా మగపిల్లలకు మనం నేర్పించాలి.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇవే మన లోపాలు..
ఒకవేళ తల్లి కూడా సంపాదనాపరురాలే అయినా, తండ్రి మాటకు కట్టుబడి ఉంటుంది. తండ్రి ప్రవర్తన ఎలా ఉన్నా, అతడి ఇగోను తృప్తిపరుస్తూ ఉంటుంది. అంటే, తండ్రిలాగ తానూ ప్రవర్తించినా, ఆడవాళ్లు ఏమీ అనరనే భావన మగపిల్లాడిలో ఏర్పడుతుంది.
భోజనాల దగ్గరా ముందు వరుస అబ్బాయిలదే. వారు తినగానో, నిన్నటివి మిగిలినవో ఇంట్లోని ఆడవాళ్లు తింటుంటారు. అదే అలవాటును ఆడపిల్లలకూ వచ్చేలా చేస్తారు. ఆడపిల్లలు ఎంత కళగా తయారైతే అంత అందంగా ఉంటారు. తల దువ్వుకున్నా, మంచి దుస్తులు ధరించినా అవి మగవాడి కోసమే... అన్నట్టు కొందరు పెద్దలు చెబుతుంటారు.
భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక్కోసారి మగాళ్లు బలప్రదర్శనకు దిగుతుంటారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా మగాళ్లు బలవంతులు, ఆడవాళ్లు బలహీనులు అనే భావన మగపిల్లల్లో మొదలవుతుంది. కొందరి ఇళ్లలో పిల్లల ఎదుటే తండ్రి మద్యం సేవిస్తుంటాడు. తాగినప్పుడు తల్లితో సరిగా ఉండడు. అలాంటి సమయంలో గొడవలు తలెత్తితే, పిల్లలపై మరింత చెడు ప్రభావం పడుతుంది.
ఇలా ఉంటే మంచిది..
తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలకు ఒక ఉదాహరణగా నిలిచిపోతారు. పెద్దల సత్ప్రవర్తనే పిల్లలను బాగుపరుస్తుంది.సాధారణంగా ఇంటి పనులను ఆడవాళ్ల కోటాలోనే చేర్చుతారు. అయితే, ఒకరోజు అబ్బాయిలకు, ఒకరోజు అమ్మాయిలకు పనులు విభజించి, అన్ని పనులూ అందరూ కలసి చేసుకునేలా చూడాలి.కనీసం నెలకు ఒకరోజైనా పూర్తిగా గర్ల్స్ డేగా పాటించాలి. సమాజంలో అమ్మాయిలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి ఆ రోజు చర్చించాలి.{పభుత్వాలు మహిళా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. సమాజంలో మహిళల పాత్ర ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళలు ఎందుకంత ప్రత్యేకమో పిల్లలకు వివరించాలి.పెద్దలను గౌరవించాలని పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటాయి. అంతకంటే ముందు ఇంట్లోని తల్లిని, తోబుట్టువులను గౌరవించాలని కూడా వాళ్లకు చెప్పాలి.
అక్కా తమ్ముళ్ల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు సహజంగానే వస్తుంటాయి. అక్కను తమ్ముడు లేదా చెల్లిని అన్న కొట్టినా, తిట్టినా ఆ పని ఎంత తప్పో వాళ్లకు తెలియజెప్పాలి. {పేమకు, స్నేహానికి తేడాను పిల్లలకు వివరించాలి. సినిమాల్లోలాగ అమ్మాయి అంటే లవ్‌సింబల్‌గా చూడటం సరికాదని వివరించాలి.సాధారణంగా ఆడపిల్లలు తల్లికి సాయపడుతుంటారు. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా తల్లికి సాయపడటంలో పోటీ పడేలా చే యాలి.చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పాలి. తల్లి గొప్పతనానికి సంబంధించిన ఒక్క చిన్న కథ అయినా తండ్రి పిల్లవాడికి చెప్పాలి.
ప్రవర్తన రీత్యా మగపిల్లలు మూడు కేటగిరీలు
టీనేజ్ దశ దాటేంత వరకు 30 శాతం పిల్లలు తండ్రినే రోల్‌మోడల్‌గా ఎంచుకుంటారు. బయట ఎంత చెడు ప్రభావం ఉన్నా, ఇంటికి వచ్చాక తండ్రి ప్రవర్తనలోని మంచితనాన్ని చూసి తనను తాను మంచిగా మార్చుకుంటాడు.కొంతమంది అబ్బాయిలు సొంతజ్ఞానంతో మంచితనాన్ని పెంచుకుంటారు. ఇంట్లో అయినా, సమాజంలో అయినా చెడును వదిలేస్తూ మంచినే తీసుకుని ఎదిగేవారుంటారు. వీరిని అత్యుత్తములుగా చెప్పవచ్చు.3-4 శాతం మంది అబ్బాయిలు తల్లిదండ్రులను, సమాజాన్ని... దేన్నీ లెక్కచేయరు. తామనుకున్నదే చేయాలనుకుంటారు. పిల్లల ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ... నిపుణుల సలహాలతో తమ పెంపకాన్ని తల్లిదండ్రులు కరెక్ట్ చేసుకోవచ్చు.
- డా.కల్యాణ్, చైల్డ్ సైకియాట్రిస్ట్