defect
-
HYD: మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్‌లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ ఫీడర్లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ -
ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. -
వెబ్‌ల్యాండ్.. లోపాలపుట్ట
– వెబ్‌ల్యాండ్‌పై విరుచుకపడిన రైతులు, రైతు సంఘాల నేతలు – పట్టాదారుపాసు పుస్తకాలను రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజం – 271 జీఓను రద్దు చేయాలని డిమాండ్ – సాక్షి అవగాహన సదస్సులో వక్తల వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ‘రెండు, మూడు తరాలుగా ఆస్తిగా వస్తున్న భూమిని కూడా మాదే అని నిరూపించుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. మా భూమిపై మాకే హక్కు లేకుండా చేస్తున్నారు. రైతులకు కష్టాలు తెచ్చి పెట్టే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. వెబ్‌ల్యాండ్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతుల పాలిట శాపంగా మారిన 271 జీవోను రద్దు చేయాల్సిందే’ అని ఉద్యోగులు, పలు సంఘాల నేతలు, రైతులు డిమాండ్ చేశారు. కర్నూలు రాజ్‌విహార్‌లోని అంబేడ్కర్ భవన్లో శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కర్నూలు, కల్లూరు, పగిడ్యాల, మిడుతూరు, దేవనకొండ, గూడూరు తదితర మండలాల రైతులు పాల్గొని వారు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్ సమస్యలపై గళమెత్తారు. తహసీల్దార్ల చేతుల్లో డిజిటల్ కీ ఉండటంతో వెబ్‌ల్యాండ్ అక్రమాలకు పాల్పడుతున్నారని, డిజిటల్ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచితే అక్రమాలను తగ్గే అవకాశముందని వక్తలు సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వెబ్‌ల్యాండ్ సమస్యలను ఎలా పరిష్కరించాలి తదితర వాటికి కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు సూచనలు ఇచ్చారు. 271 జీవోతో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం కూడా గుర్తించిందని త్వరలోనే జీఓను సవరించే అవకాశం ఉందని తెలిపారు. వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చొరవ తీసుకోవడంతో రైతులు, రైతు సంఘాల నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. అవగాహన సదస్సులో వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. పాసుపుస్తకాల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి: వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెబ్‌ల్యాండ్ రైతుల పాలిట శాపంగా మారింది. రాత్రికి రాత్రే ఒకరి పేరుమీద ఉన్న భూములు మరొకరిపేరుపై మారిపోతున్నాయి. వెబ్‌ల్యాండ్‌లోని 1–బీ, అడంగల్ ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడంతో భూములు తారుమారుతున్నాయి. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా చూడాలి. 1915 నుంచి రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపడం దారుణం. వెబ్‌ల్యాండ్ సమస్యలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. రీ సర్వేతో సమస్యకు పరిష్కారం: రమేష్‌బాబు తహసీల్దారు కర్నూలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కావాలంటే రీ సర్వే అవసరం. 1909లో బ్రిటీష్ వారు రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌పై ఇప్పటికి ఆధారపడుతున్నాం. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూముల రీ సర్వే జరుగుతోంది. కర్నూలు మండలంలోని దేవమాడ గ్రామంలో కూడా రీ సర్వే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేకు అవకాశం ఉంది. వెబ్‌ల్యాండ్‌లో ఎలాంటి సమస్య ఉన్నా మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 271 జీఓతో సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కూడా గుర్తించింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పారదర్శకత అంటే దోపిడీనే: రోషన్‌అలీ, రిటైర్డ్ తహశీల్దారు ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటే దోపిడీనే. రైతులకు అన్యాయం చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వెబ్‌ల్యాండ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి. రైతులు కూడావెబ్ల్యాండ్ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. సాక్షి పత్రిక రైతుల పక్షాన నిలిచి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. సవరణకు చర్యలు తీసుకోవాలి: తిరుపతిరెడ్డి అపార్డ్ సంస్థ అధినేత సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వెబ్‌ల్యాండ్ లోపాల పుట్టగా ఉంది. తప్పులు ఎవరు చేసినా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెబ్ ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ బాధ్యత తీసుకోవడం అభినందనీయం. వెబ్‌ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే గ్రామాల్లో జరిగే భూవివాదాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు కష్టాలు తెచ్చి పెట్టారు: సిద్ధారెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ నేత వెబ్‌ల్యాండ్ పేరుతో రైతులకు కష్టాలు తెచ్చే ప్రభుత్వాలు ఉండటం దురదష్టకరం. రెవెన్యూ రికార్డులను ఆన్లైన్లో పెట్టిన ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోంది. అన్నిటికీ వెబ్ల్యాండ్నే ప్రామాణికం చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వెబ్‌ల్యాండ్‌లో రెవెన్యూలోని అన్ని స్థాయిల వారు ఎవరికి వారు అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాకు చెందినవారే అయినా వెబ్‌ల్యాండ్ సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు. పూర్వికుల డాక్యుమెంట్ ఎలా తేవాలి: కృష్ణ, కరివేముల, దేవనకొండ మండలం మాకు కరివేముల సర్వే నెంబర్ 68/3లో మూడు ఎకరాల భూమి ఉంది. మా నాయనకు జేజినాయన నుంచి సంక్రమించింది. ఈ భూమిని ఆన్లైన్లో ఎక్కించడం లేదు. మీ సేవ కేంద్రం ద్వారా వందలసార్లు దరఖాస్తు చేశాను. డాక్యుమెంటు తీసుకురమ్మంటున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి డాక్యుమెంటు ఎలా తేవాలి. వెబ్‌ల్యాండ్ పేరుతో ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. సొంత భూమిపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది: పిట్టం ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రతినిధి వెబ్‌ల్యాండ్ కారణంగా మన భూములపై మనం హక్కులను కోల్పోయాం. వీఆర్వో రాసిందే రైతుల తలరాతగా మారిపోయింది. భూముల వివరాలను ఆన్లైన్లో పెట్టడంతో అరచేతిలో భూముల వివరాలను చూసుకోవచ్చు. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా ఆన్లైన్లో మార్పులు చేస్తున్నారు. మన భూమి మనది అని నిరూపించుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. 271 జీవోను రద్దు చేయాలి: కొమ్ముపాలెం శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య అధ్యక్షుడు ప్రభుత్వం తీసుకువచ్చిన 271 జీవో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోను తక్షణం రద్దు చేయాలి. తహసీల్దార్ల వద్ద ఉన్న డిజిటల్ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచాలి. హార్డ్ కాపీని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. సర్వే రీసెటిల్మెంట్ చేయాలి. ఉమ్మడి భూమిని, ప్రతి సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ వేయాలి. 271 జీవోను రద్దు చేయకపోతే రైతుల భూములను ఎవరూ కాపాడలేరు. ప్రదక్షిణలు చేస్తున్నా: పి.మస్తాన్, పి.కోటకొండ, దేవనకొండ మండలం మా గ్రామంలోని 329 సర్వే నెంబర్లోని భూమి 88 సెంట్లను 1974లో కొన్నాము. దీనికి అడంగల్ 1బీ, పట్టాదారు పాసు పుస్తకం ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఎక్కించడం లేదు. అడిగిన అన్ని వివరాలు ఇస్తున్నా ఏదో కారణంతో సమస్యను సాగదీస్తున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన సదస్సులో నా ఆందోళనను అందరి దష్టికి తెస్తున్నాను. అధికారులకు దయ కలిగేదెప్పుడో: నరసింహారెడ్డి, కె.నాగలాపురం, గూడూరు మండలం మాకు కె.నాగలాపురంలోని సర్వే నెంబర్ 52/3లో 88 సెంట్ల భూమి ఉంది. దీనిని ఆన్లైన్లో ఎక్కించడంలో అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నాలాగే వెబ్‌ల్యాండ్ సమస్యలు ఎదుర్కొనేవారు వందల మంది ఉన్నారు. ‘సాక్షి’ నిర్వహించిన అవగాహన సదస్సుతో సమస్యలను చెప్పుకునే అవకాశం లభించింది. ఇప్పటికైనా అధికారులకు దయ కలిగితే సంతోషం. చుక్కలు చూపిస్తున్నారు: టి.సోమన్న, ఎ.గోకులపాడు, కల్లూరు మండలం ఎ.గోకులపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 60/5లో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఆన్లైన్లో ఎక్కించడం లేదు. వెబ్‌ల్యాండ్‌తో ప్రభుత్వం సామాన్యులతో చెలగాటమాడుతోంది. -
పోషకాహార లోపాన్ని నివారించండి
♦ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత విజయనగరంఫోర్ట్: పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీలతో శనివారం ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–పాస్ విధానంద్వారానే అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పిల్లల్లో రక్తహీనతను 50శాతం వరకు తగ్గించాలన్నారు. పిల్లలకు తల్లి పాలు 6 నెలల వకుకు తాగించేలా బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్న 596 అంగన్వాడీ భవనాలను త్వరితగతిన నిర్మిం చాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పూర్థిస్థాయిలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తదితరులు పాల్గొన్నారు. -
మావాడు మగాడోచ్చ్...
కొడుకు పుట్టాడు... సంతోషం! అరె ఫాస్ట్‌గా నడుస్తున్నాడు... సంతోషం! చెల్లిని కొట్టాడు... సంతోషం! అమ్మని లెక్కచెయ్యడంలేదు... సంతోషం! అయ్యో సిగరెట్టు కాల్చాడు... సంతోషం! అమ్మాయిని వేధించాడు.. సంతోషం! కొడుకు పుట్టాడని బర్త్‌డే పార్టీ చేసుకోవడం కాదు. వాడు మందు పార్టీ చేసుకోకుండా చూసుకోండి. పోలీస్ స్టేషన్లో అడిగితే ‘ఆఁ మానాన్న తాగుతున్నాడు... తప్పేంటి!’ అని చెప్తున్నారట. ఎందుకు వేధించావు రా అని అడిగితే ‘ఆఁ మానాన్న మా అమ్మని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు’ అని ఇంకొకడు చెప్పాడట. ఇలాంటి మగాళ్లను మనం ఇంట్లోనే మాన్యుఫ్యాక్చర్ చేస్తున్నాం. డిఫెక్ట్ ఉంటే తప్పు మీదే... అందుకే మగపిల్లలు చేసే తప్పుడు పనులన్నీ కరెక్టని సంతోషపడటం మానండి. అవునూ.... పై వరుసలో ఆఖరి పంక్తి రాయటం మరిచిపోయాం... జరభద్రం. అమ్మానాన్నలను గెంటేశాడు... సంతోషం! ‘‘నా కొడుక్కేంటేమహారాజు. వాడికేం చెప్పనవసరం లేదు’’ ‘‘వాడు మగాడు.. వాడేం చేసినా చెల్లుతుంది’’ ‘‘పిల్లవాడికి హద్దులు గీయడం మంచిది కాదు. వాడన్నీ తెలుసుకోవాలి.’’ ‘‘మగపిల్లవాడు.. వాడి ఎంగిలి పళ్లెం వాడే తీయడమేంటి? ఆడపిల్లలేం చేస్తున్నారు?’’ ‘‘ఆడపిల్లకు అన్నింటినీ ఓర్చుకునే సహనం ఉండాలి. మగపిల్లవాడికి ఆవేశం ఉండాలి’’ ‘‘మగపిల్లవాడికి నోరు ఉండాలి. నలుగురినీ గదమాయించి పనులు చేయించుకోవాలి.’’ ‘‘ఆడపిల్లకు అంత నోరు ఉండటం మంచిది కాదు. అణకువగా ఉండటం నేర్చుకో..’’ ‘‘ఆడపెత్తనం ఇంటికి ఎప్పటికీ చేటే! ఇంటికి యజమాని మగవాడే. వాడు చెప్పిందే వేదం.’’ మన ఇళ్లలో రోజూ ఇలాంటి మాటలతోనే సుప్రభాతం మొదలవుతుంది. మగాడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, మగాడి గొప్పదనం ఎలాంటిదో.. ఇలాంటి మాటలు అన్ని రకాలుగా పిల్లల మెదళ్లను ‘మేల్’కొలుపుతూనే ఉంటాయి. ఇలాంటి మాటల తూటాలు ఆడపిల్లల మనసులను గాయపరుస్తుంటాయి. అబ్బాయి ‘అలా’ ఉండాలి. అమ్మాయి ‘ఇలా’ ఉండాలి అని మన ఇళ్లలోని పెద్దలే ఒక కనిపించని ‘గీత’ గీసేస్తారు. ఇలాంటి ‘గీత’బోధలతోనే అబ్బాయిల మనసుల్లో వివక్ష బీజాలను నాటుతుంటారు. మహిళలను చులకనగా చూసేలా మగపిల్లలను తయారు చేస్తున్నది మన ఇంటి మనుషులే. ఇలాంటి పెంపకంలో పెరిగిన మగపిల్లలే కాలేజీల్లో ర్యాగింగ్‌లాంటి దుశ్చర్యలకు దిగుతారు. అమ్మాయిలను వేధించి ఆనందించే పైశాచిక ప్రవృత్తిని పెంచుకుంటారు. చిల్లర నేరాల నుంచి పెద్దపెద్ద ఘోరాల వరకు దేనికైనా తెగిస్తారు. రక్షణ లేకుండా ఆడపిల్లలను బయటకు పంపలేకపోతున్నాం అని బాధపడే కంటే, ముందు మగపిల్లలను సక్రమంగా పెంచకపోతే ప్రమాదం అని గ్రహించడం మంచిది. తండ్రే రోల్ మోడల్.. రాహుల్ టెన్త్‌క్లాస్‌లో చేరాడు. తండ్రి మూర్తి అంటే అతనికి అమితమైన భయం. అతన్ని అబ్బురంగా చూస్తుంటాడు. మూర్తి రోజూ పిల్లల బాగు కోసం చెప్పే మంచి మాటలు, జాగ్రత్తలు అన్నీ ఒక పుస్తకంలో రాయమని రాహుల్‌కి చెప్పేవాడు. రాహుల్ అలాగే చేస్తూ తండ్రి ప్రవర్తన అంతా అతనికి తెలియకుండా మరో బుక్‌లో రాసుకునేవాడు. ‘మా నాన్న ఇంట్లోనే స్మోక్ చేస్తాడు, తాగుతాడు. బయటే ఎక్కువగా ఉంటాడు. అమ్మ ఏం చేసినా తిడతాడు. ఒక్కోసారి కొడతాడు. అయినా అమ్మ నాన్నకు ఎదురు చెప్పదు.. ఇవన్నీ డెయిరీలో రాసి చివరలో ‘మా నాన్న చాలా గొప్పవాడు. చాలా మంచివాడు. నేనూ పెద్దయ్యాక ఇలాగే ఉండాలి’ అని రాసుకున్నాడు. మంచి చెడులకున్న వ్యత్యాసం రాహుల్‌కు తెలియదు. నిజానికి ఆ ఈడు పిల్లలెవరికీ తెలియదు. తండ్రిలాగే తానూ ఉండాలి అనుకున్నాడు. తండ్రిలాగే స్మోక్చేస్తూ బయట కనబడ్డాడు. అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. టీచర్లు, పెద్దలు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇప్పుడతడి తలకెక్కడం లేదు. తండ్రి ప్రవర్తనను చూస్తూ పెరిగిన పిల్లలు తామూ అలాగే తయారవుతారు. ఇంట్లో ఇలాగే ఉంటే.. విశాల్ వయసు 18 దాటింది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇటీవలే కాలేజీ నుంచి సస్పెండయ్యాడు. కొడుకును బాగు చేయమని నిపుణులను సంప్రదిస్తే విశాల్ వారితో...‘ఆడపిల్లలు సఫర్ అవుతూనే ఉండాలి కదా! మేం సుఖాల మధ్య పెరగాలి. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. మా అక్కలిద్దరినీ ఇప్పటికీ మా నాన్న తిడతాడు. కొడతాడు. అమ్మను కూడా! నన్ను మాత్రం ఏమీ అనడు. మరి నేను చేసింది తప్పెలా అవుతుంది?’ అని ఎదురు ప్రశ్నించాడు. నిర్లక్ష్యం చూపే ప్రభావం.. ఫరూఖ్ వయసు 15. బుద్ధిమంతుడని ఇంటా బయట పేరున్న అబ్బాయి. ఈ మధ్య కుంటిసాకులతో స్కూల్ మానేస్తున్నాడు. టీవీ చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నాడు. ఇంట్లో స్కూల్‌కి వెళుతున్నానని చెప్పి నెట్ సెంటర్‌కో, హుక్కా సెంటర్‌కో చేరుకుంటున్నాడు. చదవకుండా పరీక్షల్లో కాపీయింగ్ చేయడం, వేరే పిల్లలు రాసినట్టుగా అమ్మాయిలకు లవ్‌లెటర్స్ రాసి విసిగించడం... చేస్తున్నాడు. ఫరూఖ్‌ని టెస్ట్ చేసిన నిపుణులు ఏం చెప్పారంటే -‘నేనొక్కడినే కాదుగా, మన భారతీయులందరూ నిర్లక్ష్యంగానే ఉంటారు. ఇలా ఉండటమే కరెక్ట్’ అని సమాధానమిచ్చాడట. ఎంతో మెచ్యూర్డ్‌గా ఉండే ఫరూఖ్ తన చుట్టూ ఉన్నవారిలోని నిర్లక్ష్యాన్ని రోల్‌మోడల్‌గా తీసుకున్నాడు. అదే కరెక్ట్ అనే భావనలో ఉన్నాడు.‘నేను తప్పు చేశాను’ అని ఏ అబ్బాయీ ఒప్పుకోడు. ఎందుకంటే అది ‘తప్పు’ అని అతనికే తెలియదు. ఏడిపించకూడదని నేర్పిస్తున్నామా..? ‘మగపిల్లలు ఏడవకూడదు’.. ‘మగపిల్లలు ఏడుస్తారా..?’ ‘ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటి..? మగపిల్లాడివి కావూ..?’ పసితనం నుంచే మనం మగపిల్లలకు నూరిపోసే మాటలివి. ఈ ధోరణిని ఎత్తిచూపుతూ ‘వోగ్’ రూపొందించిన ప్రకటనలో ఏడుస్తున్న మగపిల్లలతో వాళ్ల తల్లిదండ్రులు ఇవే మాటలు అంటారు. ఈ ప్రకటనలో వేర్వేరు దృశ్యాలు కనిపిస్తాయి. పొత్తిళ్లలో పసిపిల్లాడి నుంచి క్రీడామైదానంలో విజయం సాధించి ఆనందబాష్పాలు రాలుస్తున్న యువకుడి వరకు.. తల్లిదండ్రులు వాళ్లకు నూరిపోసేది ఒక్కటే.. ‘మగపిల్లలు ఏడవకూడదు..’ ముగింపు ముందు మరో దృశ్యం.. ఒక యువకుడు తన భార్యను కొడతాడు. కమిలిన ముఖంతో ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. వెంటనే తెరపై మాధురీ దీక్షిత్ ప్రత్యక్షమవుతుంది.. ‘మగపిల్లలకు ఏడవకూడదని చెబుతున్నాం.. ఏడిపించొద్దని వాళ్లకు నేర్పిస్తున్నామా..?’ అని ప్రశ్నిస్తుంది. ఏడవకూడదనే కాదు, ఏడిపించకూడదని కూడా మగపిల్లలకు మనం నేర్పించాలి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవే మన లోపాలు.. ఒకవేళ తల్లి కూడా సంపాదనాపరురాలే అయినా, తండ్రి మాటకు కట్టుబడి ఉంటుంది. తండ్రి ప్రవర్తన ఎలా ఉన్నా, అతడి ఇగోను తృప్తిపరుస్తూ ఉంటుంది. అంటే, తండ్రిలాగ తానూ ప్రవర్తించినా, ఆడవాళ్లు ఏమీ అనరనే భావన మగపిల్లాడిలో ఏర్పడుతుంది. భోజనాల దగ్గరా ముందు వరుస అబ్బాయిలదే. వారు తినగానో, నిన్నటివి మిగిలినవో ఇంట్లోని ఆడవాళ్లు తింటుంటారు. అదే అలవాటును ఆడపిల్లలకూ వచ్చేలా చేస్తారు. ఆడపిల్లలు ఎంత కళగా తయారైతే అంత అందంగా ఉంటారు. తల దువ్వుకున్నా, మంచి దుస్తులు ధరించినా అవి మగవాడి కోసమే... అన్నట్టు కొందరు పెద్దలు చెబుతుంటారు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక్కోసారి మగాళ్లు బలప్రదర్శనకు దిగుతుంటారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా మగాళ్లు బలవంతులు, ఆడవాళ్లు బలహీనులు అనే భావన మగపిల్లల్లో మొదలవుతుంది. కొందరి ఇళ్లలో పిల్లల ఎదుటే తండ్రి మద్యం సేవిస్తుంటాడు. తాగినప్పుడు తల్లితో సరిగా ఉండడు. అలాంటి సమయంలో గొడవలు తలెత్తితే, పిల్లలపై మరింత చెడు ప్రభావం పడుతుంది. ఇలా ఉంటే మంచిది.. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలకు ఒక ఉదాహరణగా నిలిచిపోతారు. పెద్దల సత్ప్రవర్తనే పిల్లలను బాగుపరుస్తుంది.సాధారణంగా ఇంటి పనులను ఆడవాళ్ల కోటాలోనే చేర్చుతారు. అయితే, ఒకరోజు అబ్బాయిలకు, ఒకరోజు అమ్మాయిలకు పనులు విభజించి, అన్ని పనులూ అందరూ కలసి చేసుకునేలా చూడాలి.కనీసం నెలకు ఒకరోజైనా పూర్తిగా గర్ల్స్ డేగా పాటించాలి. సమాజంలో అమ్మాయిలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి ఆ రోజు చర్చించాలి.{పభుత్వాలు మహిళా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. సమాజంలో మహిళల పాత్ర ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళలు ఎందుకంత ప్రత్యేకమో పిల్లలకు వివరించాలి.పెద్దలను గౌరవించాలని పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటాయి. అంతకంటే ముందు ఇంట్లోని తల్లిని, తోబుట్టువులను గౌరవించాలని కూడా వాళ్లకు చెప్పాలి. అక్కా తమ్ముళ్ల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు సహజంగానే వస్తుంటాయి. అక్కను తమ్ముడు లేదా చెల్లిని అన్న కొట్టినా, తిట్టినా ఆ పని ఎంత తప్పో వాళ్లకు తెలియజెప్పాలి. {పేమకు, స్నేహానికి తేడాను పిల్లలకు వివరించాలి. సినిమాల్లోలాగ అమ్మాయి అంటే లవ్సింబల్గా చూడటం సరికాదని వివరించాలి.సాధారణంగా ఆడపిల్లలు తల్లికి సాయపడుతుంటారు. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా తల్లికి సాయపడటంలో పోటీ పడేలా చే యాలి.చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పాలి. తల్లి గొప్పతనానికి సంబంధించిన ఒక్క చిన్న కథ అయినా తండ్రి పిల్లవాడికి చెప్పాలి. ప్రవర్తన రీత్యా మగపిల్లలు మూడు కేటగిరీలు టీనేజ్ దశ దాటేంత వరకు 30 శాతం పిల్లలు తండ్రినే రోల్‌మోడల్‌గా ఎంచుకుంటారు. బయట ఎంత చెడు ప్రభావం ఉన్నా, ఇంటికి వచ్చాక తండ్రి ప్రవర్తనలోని మంచితనాన్ని చూసి తనను తాను మంచిగా మార్చుకుంటాడు.కొంతమంది అబ్బాయిలు సొంతజ్ఞానంతో మంచితనాన్ని పెంచుకుంటారు. ఇంట్లో అయినా, సమాజంలో అయినా చెడును వదిలేస్తూ మంచినే తీసుకుని ఎదిగేవారుంటారు. వీరిని అత్యుత్తములుగా చెప్పవచ్చు.3-4 శాతం మంది అబ్బాయిలు తల్లిదండ్రులను, సమాజాన్ని... దేన్నీ లెక్కచేయరు. తామనుకున్నదే చేయాలనుకుంటారు. పిల్లల ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ... నిపుణుల సలహాలతో తమ పెంపకాన్ని తల్లిదండ్రులు కరెక్ట్ చేసుకోవచ్చు. - డా.కల్యాణ్, చైల్డ్ సైకియాట్రిస్ట్ -
నాలో లోపమేంటో చెప్పండి
నాలో లోపమేంటో చెప్పండి ప్లీజ్ అంటున్నారు నటి తాప్సీ. ఆ మాటల్ని చూస్తుంటే ఈ ఉత్తరాది బ్యూటీ చాలా ఆవేదన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాప్సీ నిజంగా అందగత్తే. అభినయంలోనూ తక్కువేమీకాదు. అయినా సరైన మార్కెట్ ఆమె అందుకోలేక పోయారు. తాప్సీ బహుబాషా నటి కూడా. ముఖ్యంగా దక్షిణాదిలో ముఖ్యంగా తమిళం, తెలుగుభాషల్లో యువనటులందరి సరసనా నటించారు. అయినా అంతగా పాపులర్ కాలేకపోయారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ తాను పాత్రకు తగిన న్యాయం చెయ్యలేననే ప్రచారం జరుగుతోందన్నారు. ఇది తనను వేదనకు గురి చేసే అంశం అన్నారు. ఇలాంటి వదంతుల కారణంగానే కాంచన-2 చిత్రంలో దెయ్యం పాత్రను అంగీకరించి నటిగా తానేమిటో నిరూపించుకున్నానన్నారు. ప్రస్తుతం మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయని పేర్కొన్నారు. హిందీలో రెండు, తమిళంలో రెండు చిత్రాలంటూ బిజీగానే ఉన్నానన్నారు. కానీ తెలుగులో ఒక్క అవకాశం కూడా లేక పోవడం బాధగా ఉందన్నారు. తనలో కొరతేమిటో ఇప్పటికీ తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నాలో లోపమేంటో చెప్పండి ప్లీజ్. అలాంటిదేమయినా ఉందని తెలిస్తే సరిదిద్దుకుంటానని ఈ ఉత్తరాది భామ అంటున్నారు.