పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..? | Pacemakers are configured .. Why? | Sakshi
Sakshi News home page

పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?

Published Sat, Mar 19 2016 3:30 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?

పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నేను ఏడాది నుంచి మెడనొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ నొప్పి వస్తోంది. హోమియోలో శాశ్వత చికిత్స ఉంటే తెలపండి. 
- నారాయణ స్వామి, నిజామాబాద్


స్పాండిలోసిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనీ, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు.

కారణాలు : కాళ్లు, చేతులలో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్‌లో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్ వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్ని స్పాండిలోసిస్ అంటారు. వెన్నుపూసల మధ్య నరాలు వెళ్లడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్నబడితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

లక్షణాలు : సర్వైకల్ స్పాండిలోసిస్ - మెడనొప్పి, తలనొప్పి, తల అటు ఇటు తిప్పడం కష్టం కావడం, మెడ బిగుసుకుపోయినట్లుగా ఉండటం, నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లంబార్ స్పాండిలోసిస్ : నడుము నొప్పితో పాటు కొన్నిసార్లు మెడనొప్పి కూడా ఉంటుంది. ఒకవైపు కాలు నుంచి పాదం వరకు నొప్పి వ్యాపిస్తుంటుంది. దీన్నే సయాటికా నొప్పి అని అంటారు. నరాలు ఒత్తిడికి గురై నడవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలూ కనిపిస్తాయి.

నిర్ధారణ : లక్షణాలను బట్టి వ్యాధిని తెలుసుకోవడంతో పాటు, ఎక్స్-రే, ఎమ్మారై, సీటీ స్కాన్‌లూ నిర్ధారణకు ఉపయోగపడతాయి.

నివారణ : స్పైన్‌కు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చోవడం, నిల్చోవడం చేయకూడదు. దూరప్రాంతాలకు నడవడం సరికాదు.హోమియోలో కాన్‌స్టిట్యూషనల్ చికిత్సతో క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా వ్యాధిని క్రమక్రమంగా తగ్గిస్తూ, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది.

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్

కార్డియాలజీ కౌన్సెలింగ్


నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్‌ను వేశారు. ఇప్పుడు శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు డాక్టర్ నన్ను పరీక్షించి,  గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.                
- కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట


గుండె జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు. కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్‌ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది.

అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...  డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి  బరువు పెరగకుండా చూసుకోవాలి  రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి  కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి  మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్
హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

మా పాపకు మూడు నెలలు. ఈమధ్య తరచూ ఏడుస్తోంది. డాక్టర్‌కి చూపిస్తే కడుపు నొప్పి వల్ల ఏడుస్తుండవచ్చు అని కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- అంజలి, కొత్తగూడెం


పిల్లలు ఆగకుండా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్న సమస్య మొదలుకొని ప్రమాదకరమైన జబ్బుల వరకూ పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తారు.ఆకలిగా ఉన్నా, చెవి నొప్పి ఉన్నా సరే ఏడ్వడం ద్వారానే వాటిని తెలియబరుస్తుంటారు.

పిల్లల ఏడుపుకు కొన్ని కారణాలు: ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, దాహం వేసినప్పుడు, డయపర్ తడిగా అయినప్పుడు, వాతావరణం వారికి చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద శబ్దాలు అవుతున్నప్పుడు, కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా, ఏవైనా నొప్పులు ఉన్నప్పుడు, పళ్ళు వస్తున్నప్పుడు, ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను కూడా పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తం చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి కారణాలు.

మీ పాప విషయంలో ఏడుపు బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫెన్‌టైల్ కోలిక్) కారణం అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు ఫలానా అంటూ నిర్దిష్టంగా  కారణం అని చెప్పలేకపోయినా... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెర ఎక్కువ కావడం వంటి కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్లను పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు.

చికిత్స : కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి.

డాక్టర్ రమేశ్‌బాబు దాసరి  సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్,

విజయనగర్ కాలనీ,
హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement