joints
-
ఆస్టియో ఆర్థరైటిస్
ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం లేదా బలహీనపడటం వల్ల కనిపించే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మన దేశంలో కనీసం 15 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు... అందునా మరీ ముఖ్యంగా మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంతమందిని బాధించే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుధీర్‌రెడ్డి చెబుతున్న విషయాలివి... ప్రశ్న : ఆర్థరైటిస్ సమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వేరా? జ: ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్‌లలో దాదాపు 200 రకాలు ఉంటాయి. అందులో సాధారణంగా వయసు పెరగడం వల్ల అరుగుదల వల్లగానీ లేదా చిన్నవయసులోనే అయితే యాక్సిడెంట్ల కారణంగా ఆస్టియో ఆర్ధరైటిస్ రావచ్చు. ఇదెలా వస్తుందంటే... రెండు ఎముకల మధ్య అంటే కీళ్ల (జాయింట్) దగ్గర ఘర్షణ తగ్గించడానికి ఎముకల చివరన కార్టిలేజ్ అనే మృదువైన పదార్థం ఉంటుంది. దీన్నే చిగురు ఎముక అని కూడా అంటుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ అది అరగడం లేదా ఆటల్లాంటి/ప్రమాదాల్లాంటి ఏవైనా కారణాల వల్ల కార్టిలేజ్ దెబ్బతినడంతో కీళ్లమధ్యలో ఉండే గ్యాప్ తగ్గుతుంది. దాంతో ఎముకలు ఒకదారితో మరొకటి ఒరుసుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు అవి బిగుసుకుపోవడం (స్టిఫ్నెస్)తో పేషెంట్ ఎంతగానో బాధకు గురవుతారు. ప్రశ్న : ఆస్టియో ఆర్థరైటిస్‌ను తెచ్చిపెట్టే ముప్పుల్లాంటివి ఏవైనా ఉన్నాయా? జ: నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పెరుగుతున్న వయసే ఆర్థరైటిస్‌కు ప్రధాన రిస్క్‌ఫ్యాక్టర్. పైగా ఇది నివారించలేనిది కూడా. కొందరిలో వంశపారంపర్యంగానూ కనిపిస్తుంది. అంటే కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశాలూ ఎక్కువే. అలాగే బరువు మోసే వృత్తుల్లో ఉన్నవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రశ్న : ఇందుకు కారణాలు ఏమిటి? జ: ∙ఎక్కువ బరువు ఉండటం/స్థూలకాయం ♦కీళ్లకు బలమైన దెబ్బ తగలడం (ట్రామా) ♦వృత్తిపరంగా కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో ♦కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) ♦రుమటాయిడ్ ఆర్థరైటిస్ ∙డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం ♦కొన్ని రకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదాహరణకు కార్టికోస్టెరాయిడ్స్). ప్రశ్న : ఏయే లక్షణాలతో ఆర్థరైటిస్ బయటపడుతుంది? జ: ∙నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువ. కదలికల వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది. ♦స్టిఫ్నెస్: కీళ్లు బిగుసుకుపోవడం... దాంతో కీళ్లలో కదలికలు తగ్గడం. ♦కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి కలుక్కుమనే శబ్దాలు వినిపిస్తాయి. ♦వాపు: కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు. ♦వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రశ్న : దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? జ: కీళ్ల భాగాల ‘ఎక్స్–రే’తో ఈ వ్యాధిని తేలిగ్గానే గుర్తించవచ్చు. ప్రశ్న : నివారణ కోసం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? జ: ∙ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. ∙పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. ♦కంటినిండా తగినంత నిద్రపోవడం, నాణ్యమైన నిద్రవల్ల జీవననాణ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు... దీనివల్ల ఎన్నో కీళ్లవాతాలకు కారణమైన ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు. ♦సమతులాహారం ఎంతో ముఖ్యం. క్యాల్షియం, విటమిన్– డి పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలతో పాటు ఆకుకూరలు, గుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ♦క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోగికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులు వ్యాయామాలను సూచిస్తారు. సాధారణంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా వంటివి చేసుకోవచ్చు. అయితే మొదట్లో ఈ వ్యాయామాల కారణంగా బాధ ఎక్కువైనట్లు అనిపించే అవకాశాలున్నప్పటికీ క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా శారీరకంగా చురుకుదనం పెరగడం, పరిస్థితి మెరుగుపడుతుంది. ♦వైద్యుల సలహా మేరకు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ తరహా సమస్యలకు సాధారణంగా వాడే స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ఎవరూ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాటివల్ల కిడ్నీల వంటి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం) ♦విటమిన్–డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం. ప్రశ్న : దీనికి చికిత్స అందుబాటులో ఉందా? జ: నొప్పి కనిపించినప్పుడు తప్పనిసరిగా మెడికల్ స్పెషలిస్టులు / ఆర్థోపెడిక్ నిపుణులకు చూపించాలి. వారు నొప్పిని తగ్గించడానికి ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి సూచిస్తారు. ఇటీవల న్యూట్రాస్యూటికల్స్ అనే కొత్త రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటివల్ల ఆర్థరైటిస్ మరింతగా పెరగడం తగ్గుతుంది లేదా ఆగుతుంది. కొన్ని రకాల ఇంజెక్షన్స్ అంటే హైలురానిక్ యాసిడ్ వంటివి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ) వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... అరుగుదల వేగం తగ్గేవిధంగా కొన్ని వ్యాయామాలను సైతం సూచిస్తారు. ఆ సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పరిస్థితి బాగా విషమించి... మోకాలి కీళ్ల వంటివి మరీ ఎక్కువగా అరిగిపోయినప్పుడు పేషెంట్స్‌కు కీళ్ల మార్పిడి (నీ జాయింట్ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్స వంటివి అవసరం పడవచ్చు. ఇంటర్వ్యూ డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్ -
అమ్మోకాళ్లు!
దేహం కూడా యంత్రం లాంటిదే. యంత్రం విడిభాగాలు అరిగినట్లే... మన దేహయంత్రంలోని కీళ్లూ అరిగి పోతుంటాయి. ఈ పరిణామం అరుగుదల కారణంగా... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే డీజనరేషన్ కారణంగా జరుగుతుంది కాబట్టి ఇది అనివార్యంగా జరిగిపోతుంది. పాతకాలంలో అరుగుదలతో వచ్చే ఈ నొప్పులను పాతనొప్పులు అనేవాళ్లు. పాతనొప్పులకు మందులేదని ఆ తరంవాళ్లు అనుకునేవాళ్లు. అయితే ఇటీవల వైద్య విజ్ఞానశాస్త్రంలో అభివృద్ధి వల్ల కొత్త మందులు, కొత్త రకం శస్త్రచికిత్సలతో అరిగిన కీళ్లకు వైద్యం చేయడం సాధ్యం కావడంతో పాతనొప్పులనే మాట పాతబడి పాతతరం వారికి మాత్రమే తెలుస్తోంది. అయితే కీళ్ల అరుగుదలతో వచ్చే ఈ నొప్పుల గురించి ఎన్నో అపోహలున్నాయి. ఆ అపోహల గురించి, అసలు వాస్తవాల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కీళ్ల అరుగుదలా వన్–వే ట్రాఫిక్ లాంటిదే... కాలం ముందుకు జరుగుతున్నట్లు... వయసు రోజురోజుకూ పెరుగుతున్నట్లు... అరుగుదల కూడా ముందుకే కొనసాగుతుంది. అలా అరిగే ప్రక్రియను ఏవిధంగానూ వెనక్కు మళ్లించలేం. ఇదీ వన్–వే ట్రాఫిక్‌లో ప్రయాణించడం లాంటిది. ఆ దారిలో వెనక్కు తిరగడం సాధ్యం కాదు. కాకపోతే ప్రయాణాన్ని నెమ్మదిగా సాగేలా చేసుకోగలం. కీళ్ల అరుగుదల విషయంలోనూ అంతే. అందమైన మన మునుపటి ఫిట్నెస్ను కొనసాగించేందుకు వ్యాయామాల వంటి మంచి జీవనశైలి అలవాట్లతో, మరికొన్ని జాగ్రత్తలతో వాటి అరుగుదల ఆలస్యంగా జరిగేలా మాత్రం చూసుకోగలం. కీలూ – కండర సంబంధం... కృష్ణార్జున బంధం కీళ్ల అరుగుదల తక్కువగా ఉండాలంటే దానికి సంబంధించిన కండరం బలంగా ఉండాలి. అందుకే కీలుకీ–కండరానికీ ఉన్న సంబంధాన్ని ఒకరకంగా కృష్ణార్జున బంధంగా చెప్పవచ్చు. అర్జునుడికి కృష్ణుడి సపోర్ట్ ఉన్నట్లే... మన మోకాలి కీలుకి క్వాడ్రిసెప్స్ అనే తొడ కండరాల సపోర్ట్ ఉంటుంది. యుద్ధంలో అర్జునుడిపై పడబోయిన అనేక దెబ్బలను శ్రీకృష్ణుడే కాచుకుని రక్షించినట్టే, మోకాలి కీళ్లపై పడే భారంలో చాలాభాగాన్ని క్వాడ్రిసెప్స్ కండరాలు తీసుకుంటాయి. అలాగే తుంటి భాగానికి వస్తే... తుంటి కీలు దగ్గర కాలు ఫ్రీగా కదిలేందుకు, కాలు మన శరీరభాగాన్ని అంటి ఉండేందుకు ‘అబ్డక్టార్ మజిల్స్ ఆఫ్ హిప్’ అనే కండరాలు ఉపయోగపడతాయి. ఇదే తరహాలో మెడ కండరాలు, మెడ భాగంలోని వెన్నుపూసలపై పడే భారాన్ని తీసుకుంటాయి. అందుకే సర్వైకల్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు మొదట మెడ కండరాలను బలంగా మార్చే వ్యాయామాలను చేయాల్సిందిగా సూచిస్తుంటారు. ఇలా నడిచేందుకు ఉపయోగపడేది కీలు అయితే... దాన్ని నడిపించేందుకు సహాయపడేది సంబంధిత కండరం అన్నమాట. వ్యాయామంతో కండరాలు ఎంత బలంగా ఉంటే... కీలుపై పడే భారం అంతగా తగ్గుతుంది. ఆ తరంలో ఆ బాధలు లేవెందుకు... అప్పటి తరంలో చాలామందికి వృద్ధాప్యం వచ్చిన చాలా ఏళ్లకు గానీ కీళ్లనొప్పులు వచ్చేవి కావు. అయితే ఇటీవల చాలామందికి నలభై ఏళ్లు దాటకుండానే కీళ్లనొప్పులు వస్తున్నాయెందుకు అని కొందరు అడుగుతుంటారు. ఇందుకు నాలుగు అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవి 1. కండరాల బలహీనత; 2. ఊబకాయం; 3. శారీరక శ్రమ; 4. సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల కార్టిలేజ్ బలోపేతం అయ్యే ప్రక్రియలో అవరోధం ఏర్పడటం. ఈ నాలుగు అంశాల్లోనూ ప్రధానమైనది శారీరక శ్రమ. మిగతా అన్ని అంశాలతో దీనికి సంబంధం ఉంది. ఆ రోజుల్లో నడక, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. దాంతో కండరాలు త్వరగా బలహీనపడేవి కావు. అలాగే ఆ శ్రమ కారణంగానే ఊబకాయం వచ్చేది కాదు. ఇక మన కీళ్లలో కందెన (ల్యూబ్రికెంట్)లా పనిచేసే సైనోవియల్ ఫ్లుయిడ్ అనే గ్రీజులాంటి పదార్థం మన్నికతో ఎక్కువ రోజులు ఉండటానికీ దోహదపడేది శారీరక శ్రమే. ఇటీవల ప్రజల్లో శారీరక శ్రమ తగ్గడంతో మిగతా మూడు అంశాలూ బలహీనం కావడం వల్లనే ఇటీవలి తరాల్లో కీళ్లనొప్పులు త్వరగా వస్తున్నాయి. ఎంతగా నడిస్తే కీళ్లు అంతగా అరుగుతాయా? నడక వల్ల కీళ్లపై భారం పడి త్వరగా అరిగిపోతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఎముకకు నేరుగా పోషకాలు అందవు. మన వ్యాయామం, నడక వల్లనే ఎముకకు పోషకాలు అందుతాయి. అలాగే సైనోవియల్ ఫ్లుయిడ్ ఆరోగ్యానికీ నడక అవసరం. అందువల్ల ఎంత నడిస్తే కీళ్లకు అంత ప్రయోజనం. కానీ ఈ నడక ఎలా పడితే అలా ఉండకూడదు. ఏవి పడితే ఆ చెప్పులు తొడుక్కొని, ఇష్టం వచ్చిన ఉపరితలం మీద నడిస్తే ఆ నడక ప్రయోజనం ఇవ్వదు. మెత్తటి అడుగుభాగం (సోల్) ఉన్న షూతో మట్టినేల లేదా గడ్డితో మెత్తగా ఉన్న నేలమీద గానీ ఆ నడక వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఇక మోకాలిపైన బరువు పడేందుకు దోహదపడే మరో అంశం ఇండియన్ స్టైల్ టాయిలెట్ సీట్. ఎత్తుపల్లాలున్న దారుల్లో నడిచినప్పుడు, ఇండియన్ స్టైల్ టాయిలెట్లలో కూర్చున్నప్పుడు కీళ్లమీద మామూలు సమయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ భారం పడుతుంది. అలాగే మోకాళ్లు ముడుచుక్కూర్చోవడం(స్క్వాటింగ్) కూడా మోకాలి నొప్పులకు కారణమవుతుంది. కీళ్లనొప్పులు మొదలైనప్పుడు మినహాయించి, మామూలు ఆరోగ్యంతో ఉన్నవారు ఎంత నడిస్తే అంత మేలు. అలాగే ఇండియన్ టాయెలెట్లలో గొంతుక్కూర్చోకుండా ఉండటమూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మున్ముందు వచ్చే కీళ్లనొప్పులను నివారిస్తుంది. కాల్షియమ్ తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయా? మన ఆహారంలో కాల్షియమ్ తగ్గడం అన్నది కీళ్లనొప్పులకు దారితీస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజానికి కాల్షియమ్కూ, కీళ్లకూ ఎలాంటి సంబంధం లేదు. కాల్షియమ్ లోపం వల్ల ఎముక బలహీనం కావచ్చుగానీ... కీళ్లతో కాల్షియమ్కు నేరుగా సంబంధం ఉండదు. కీళ్లపై కాల్షియమ్ ప్రత్యక్ష ప్రభావమూ ఉండదు. ఆహారానికి... కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? కొంతమంది ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉందేమోనని కూడా సందేహం వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యక్షంగా ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉండదు. అయితే అతిగా ఆహారం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వచ్చి... ఒంటి బరువు కీళ్లపై పడి కీళ్ల అరుగుదల వేగవంతం అవుతుంది. ఇక కొన్ని రకాల ఆహారాలు కొంతమందికి సరిపడవు. ఒంటికి సరిపడని ఆహారం కారణంగా అలర్జీలు వచ్చి, ఆ అలర్జీ కీళ్లనొప్పులు, వాపు రూపంలో వ్యక్తం కావచ్చు. ఎవరెవరిలో ఏయే ఆహారాల పట్ల అలర్జీ ఉంటుందో, ఆ అలర్జీ ఏ రూపంలో వ్యక్తమవుతుందన్నది ఆయా వ్యక్తుల దేహ స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిజానికి కీళ్లనొప్పి అన్నది ఎముక బలహీనం కావడం కంటే, ఎముక చివరన ఉండే కార్టిలేజ్ అనే భాగం అరగడం వల్ల, అందులోని గ్లూకోజమైన్ అనే జీవరసాయనం తగ్గడం వల్ల వస్తుంది. ఈ కార్టిలేజ్నే వ్యావహారిక భాషలో కొందరు గుజ్జుగా వ్యవహరిస్తుంటారు. ఆ గుజ్జులోని నీటి పరిమాణం తగ్గడం వల్ల కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అంతేగానీ ఆహారానికీ, క్యాల్షియమ్కూ... కీళ్లనొప్పులకూ నేరుగా సంబంధం లేదు. ఇంత అకస్మాత్తుగా బయటపడ్డాయేమిటి? ‘నిన్నమొన్నటివరకూ బాగానే నడుస్తున్నాను. ఠక్కున కీళ్లనొప్పులు బయటపడ్డాయేమిటి?... నిన్న లేని నొప్పి ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చింది?’ అని కీళ్లనొప్పులతో బాధపడేవారిలో చాలామంది అడుగుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎవరికీ దీనినుంచి మినహాయింపు ఉండదు. అయితే కీళ్ల అరుగుదల వల్ల కార్టిలేజ్ పూర్తిగా అరిగి, ఎముకకూ, ఎముకకూ ఒరిపిడి జరిగి వచ్చే నొప్పి రెండు రకాలుగా బయటపడుతుంది. కొంతమందిలో అది క్రమంగా పెరుగుతూ పోవచ్చు. మరికొంతమందిలో అకస్మాత్తుగా బయటపడవచ్చు. కాబట్టి అరుగుదల అనేది అందరిలోనూ జరుగుతుంది. నొప్పి వ్యక్తమయ్యే తీరు మాత్రం రెండు రకాలుగా ఉంటుంది. పెద్దవయసు వారిలోఎమ్మార్ స్కాన్ అవసరం లేదుకాస్తంత వయసు పైబడ్డాక కీళ్లనొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి. పెద్ద వయసు వారిలో కీళ్లు అరిగి నొప్పులు వస్తున్నాయా అని నిర్ధారణగా తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దవయసు వారిలో అరుగుదల అనేది ఎలాగూ జరిగి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా యుక్త వయస్కుల్లోనూ, చాలా చిన్నవయసు వారిలోనూ కీళ్లనొప్పులు కనిపించాయనుకోండి. అలాంటివారిలో సమస్య తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాలి. దీనికి ఓ కారణం ఉంది. మన కీళ్ల భాగంలో నొప్పి రావడానికి మూడు ప్రధానమైన అంశాలు. మొదటిది కార్టిలేజ్, రెండోది మన కీళ్ల మధ్యన షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కస్ అనే భాగం. మూడోవి లిగమెంట్లు. ఈ మూడింటిలో ఏవైనా ఆటల్లో భాగంగా కార్టిలేజ్‌లోని కొంతభాగం దెబ్బతిన్నదా, లేక షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కై (మెనిస్కస్కు బహువచనం) అనే భాగాలు దెబ్బతిన్నాయా, లేక లిగమెంట్లు గాయపడటం, తెగడం జరిగిందా అనేది తెలుసుకోడానికి యువకులు, చిన్నవయసులో ఉన్నవారికే ఎమ్మార్ స్కాన్ తీయించాల్సి ఉంటుంది. అందుబాటులో మందులు కీళ్లనొప్పుల తీవ్రతను 4 దశల్లో చెప్పవచ్చు. ఇందులో మొదటి రెండు దశల్లో నొప్పులను మందులతోనే తగ్గించవచ్చు. మూడో దశలో చాలా వరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే నాలుగోదశలో ఉంటే మాత్రం అది శస్త్రచికిత్సతో మాత్రమే తగ్గుతుంది. ఇలా మొదటి రెండు దశల్లోని కీళ్లనొప్పులకు గతంలో వాడే నొప్పి నివారణ మందులతో పొట్టలో అల్సర్స్ రావడం, కడుపులో రక్తస్రావం కావడం వంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చేవి. కానీ ఇటీవల కాక్స్–2 ఇన్హిబిటర్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి లేజర్ గన్స్‌లా పనిచేసి, కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అంతేతప్ప ఆరోగ్యకరమైన కణాలను ఎంతమాత్రమూ ముట్టుకోవు. అలాగే గ్లూకోజమైన్ వంటి కాండ్రోప్రొటెక్టివ్ మందులు కూడా నొప్పిని తగ్గిస్తాయి. అయితే అవి కీలులో తగ్గిన గుజ్జును మళ్లీ పుట్టించవు. కాకపోతే గుజ్జు తరిగిపోయే ఒరవడిని మాత్రమే తగ్గిస్తాయి. ఆ ప్రకటనలూ, ప్రచారాలూ నమ్మకండి... ఇటీవల చాలామంది స్టెమ్సెల్స్తోనూ, ప్రోటీన్ రిచ్ ప్లాస్మా థెరపీతోనూ అరిగిపోయిన కార్టిలేజ్‌ను మళ్లీ పెంచగలమని ప్రకటనలు గుప్పిస్తూ, అమాయకులైన ప్రజలను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా ఆపరేషన్ అంటే భయపడేవారే ఇలాంటి ప్రకటనలకు తేలిగ్గా ఆకర్షితులవుతుంటారు. నిజానికి నాలుగో దశ దాకా అరిగిన కార్టిలేజ్‌ను (గుజ్జును) మళ్లీ పుట్టించడం, లేదా మళ్లీ పెరిగేలా చేయడం వైద్యప్రక్రియలో లేనేలేదు. వైద్యపరంగా అలాంటి చికిత్సలకు ఎలాంటి హేతుబద్ధతా లేదు. చాలామంది తమ విలువైన డబ్బును, సమయాన్ని వృథా చేసుకొని, మోకాలి కీలుకు శాశ్వతంగా నష్టం చేకూరాకే మళ్లీ అసలైన వైద్యుల దగ్గరికి వస్తుంటారు. అలాగే కొన్నిచోట్ల పల్లెల్లో, చాలా వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్లో కాల్చిన జీడి పెట్టడం, వాచిన చోట విపరీతంగా మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా మోకాలి లోపలి కీలకమైన భాగాలు దెబ్బతిని శాశ్వత వైకల్యం సంభవించవచ్చు. కాబట్టి అలా ఎవరైనా చెప్పినా నమ్మరాదు. శస్త్రచికిత్సే శరణ్యమా? మోకాలు మొదలుకొని అన్నిరకాల కీళ్లనొప్పులలోనూ 80% సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామంతోనే చాలావరకు తగ్గుతాయి. కేవలం 20% కేసుల్లోనే శస్త్రచికిత్స అవసరం. ముందే చెప్పినట్లుగా కీళ్లనొప్పుల్లో ఉండే తీవ్రత... మూడు నాలుగు దశలకు చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరమని గుర్తించాలి. కాబట్టి ముందే డాక్టర్‌ను సంప్రదించి శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా కాపాడుకునే జీవనశైలి జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామమే నైవేద్యం మన పక్షాన మన భారం వహించేవాడినే మనం దేవుడు అంటాం కదా. అలాగే మన మోకాలి గర్భగుడిలో ఉండే కీలుదైవం కూడా మన భారాన్ని వహిస్తాడనుకోవచ్చు. మరి ఆ దైవాన్ని ప్రార్థించి, సమర్పించదగిన నైవేద్యం ఏమిటి? వ్యాయామమే మనం మన మోకాలి గర్భగుడిలో వసిస్తూ, మన భారాన్ని తీసుకునే దేవుడికి సమర్పించే నైవేద్యం. ఒక ప్రార్థనలా మనం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు నడకారాధన నిర్వర్తించి సమర్పించే ఆ పూజా నైవేద్యంతో సంతృప్తి పడే కీలుదేవత మనను ఇతరులపై మన భారం పడకుండా చూస్తాడు. మన కాళ్లపై మనం నిలబడేలా చేస్తాడు. అయితే కొందరిలో అప్పటికే మోకాళ్ల నొప్పులు వచ్చి నడవడం సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారు ఒంటిపై ఎలాంటి బరువు పడని ఈత వంటి వ్యాయామాలు చేయవచ్చు. కొందరు మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామమే కదా అంటుంటారు. అది గుండెకూ, ఊపిరితిత్తులకూ మంచిదే కానీ... మోకాలికి కాదు. ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలిపైనా, అందులోని షాక్ అబ్జార్బర్స్పైనా చాలా భారం పడుతుంది. కాబట్టి మోకాలితోపాటు, గుండెకూ, ఊపిరితిత్తులకూ అన్నింటికీ ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామాలు చేయడమే మంచిది కదా! గర్భగుడి అంతటి పవిత్రమైనది మోకాలి కీలు మోకాలి కీలు గర్భగుడి అంతటి పవిత్రమైనది. గర్భగుడిలో దేవుడు మాత్రమే ఉంటాడు. ప్రధాన పూజారి మినహాయించి ఎవరికి పడితే వారికి గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. అలాగే మోకాలి కీలు (ఆ మాటకొస్తే అన్ని రకాల కీళ్లు కూడా) దగ్గరికి కూడా ఏ మందులు పడితే ఆ మందులు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించకూడదు. దురదృష్టవశాత్తూ చాలాచోట్ల తెలిసీ తెలియని గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీలు, క్వాక్స్) మోకాలిలో నొప్పి వంటివి వచ్చినప్పుడు నీరు తీయడం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వంటి అనుచితమైన పనులు చేస్తుంటారు. నిజానికి మోకాలు చెప్పుకోదగ్గంత పరిమాణంలో వాస్తే తప్ప... మోకాలిలోంచి నీరు తీయడం వంటి చర్యలకు పాల్పడకూడదు. అదీ ఒకటి రెండు సార్లు మాత్రమే. అలాగే కొంతమంది హైలూరానిక్ యాసిడ్ వంటి కందెనను ఎక్కిస్తామంటారు. కానీ దానితోనూ పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అలా కందెనను ఎక్కిస్తామనే వైద్యాన్నీ నమ్మడం సరికాదు. వాస్తవానికి... తీవ్రంగా అవసరం ఉంటేనే తప్ప అనుభవజ్ఞులైన వైద్యులు నీరు తీయడం అనే చర్యకు ఉపక్రమించరు. హైలూరానిక్ యాసిడ్ వంటి ద్రవాలను ఎక్కించే నిర్ణయాన్ని తీసుకోరు. అచ్చం... గర్భగుడిలోకి ప్రవేశించే ప్రధాన పూజారులను మినహాయించి ఎవరినీ అనుమతించనట్లే... మనం మోకాలి విషయంలోనూ దాన్ని అంతే పవిత్రంగా ఉంచాలన్నమాట. అయితే ఇలాంటి గుజ్జు ఎక్కించడాలు, స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేయడాలు అనేవి 80 ఏళ్లు దాటిన వారిలోనూ, సర్జరీని తట్టుకో లేనివారిలోనూ డాక్టర్లు ఒక ఉపశమన వైద్యంలా చేస్తుంటారు. వారిని మినహాయించి, ఇలాంటి వైద్యాలు అంతకంటే చిన్నవయసు వారికి తగవు. మహిళల్లో 4 రెట్లు ఎక్కువ సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువ. దీనికి నిర్దిష్టంగా కారణాలు తెలియవు. అయితే మహిళల్లో బరువు పెరగడం, స్థూలకాయం, హార్మోన్ల తేడాలు, వ్యాయామం అంతగా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణాలని చెప్పవచ్చు. కీళ్లనొప్పుల్లో ముఖ్యమైనది అవాస్క్యులార్ నెక్రోసిస్... భారతదేశంలో చాలామందికి ఒక వయసు దాటాక తుంటిఎముక నొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది. మన తొడ ఎముకపై భాగం ఒక గుండ్రటి బంతిలా ఉండి, అది తుంటి ఎముకలోని గిన్నె వంటి భాగంలో కదులుతూ ఉంటుందన్నది తెలిసిందే. కొంతమందిలో ఈ బంతివంటి భాగానికి రక్తసరఫరా అందదు. దాంతో ‘అవాస్క్యులార్ నెక్రోసిస్’ (ఏవీఎన్) అనే కండిషన్ ఏర్పడి తీవ్రమైన తుంటి నొప్పి వస్తుంది. మిగతా ఎముకలూ, కీళ్ల విషయంలోనూ ఇది జరగవచ్చు. కానీ ప్రధానంగా తుంటి ఎముక దగ్గర నొప్పి రావడమే మన దేశంలో చాలా ఎక్కువ. దీనికి కారణాలేమిటి అన్న విషయం నిర్దిష్టంగా తెలియదు. అయితే ఆల్కహాల్, స్టెరాయిడ్స్ కూడా ఇందుకు కొంతవరకు కారణం కావచ్చని తెలుస్తోంది. కాబట్టి ఎముకలు బలంగా, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్, స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. డాక్టర్ గురవారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ – చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కీళ్ల మార్పిడి మేడ్ ఈజీ!
కాళ్లరిగిపోయేలా తిరిగినా పని జరగడం లేదని మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బాధ పడే ఉంటారు. పనులు జరగడానికి కాళ్లు అరగాలా? అని ప్రశ్నించే కొంటె కోణంగులూ మనలో ఉంటారు. అందమైన తెలుగు భాషలో ఇదో చమత్కారమని సరిపెట్టుకున్నా.. నిజంగా ప్రతి ఒక్కరికీ కాళ్లు కాకపోయినా కీళ్లు అరిగే ముప్పు పొంచి ఉంటుందన్నది వాస్తవం. పెరిగే వయస్సూ, దాంతో పాటే వచ్చే రకరకాల సమస్యలు కీళ్ల అరుగుదలకు కారణమవుతున్నాయి. దాంతో మన కాళ్ల మీద మనం నిలబడలేని పరిస్థితి అక్షరాలా సంప్రాప్తిస్తోంది. ఒకప్పుడు ఈ సమస్యలకు సంక్లిష్ట శస్త్ర చికిత్సల వల్ల మాత్రమే కొంతలో కొంత పరిష్కారం లభించేది. కానీ వైద్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల అత్యధునాతన సర్జరీల ద్వారా అద్భుత ఫలితాలు లభించే అవకాశం దక్కుతోంది. నగరంలోని అనేక ఆస్పత్రుల్లో ఈ కీళ్ల సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ఈ కీళ్ల మార్పిడి మెడికల్ మ్యాజిక్‌పై కథనం.. భీమారావు పేరుకు తగ్గట్టే భారీగా ఉంటాడు. తిండిపుష్టి ఉండడంతో ఇంతింతై అన్నట్టుగా పెరిగిన శరీరంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తాడు. వయస్సులో ఉన్నప్పుడు పుష్టిగా ఉన్నా క్రమంగా ఏళ్లు మీద పడుతున్న కొద్దీ అడుగు వేయడానికి కూడా ఆయాసపడాల్సి వస్తోంది. దానికి తోడు కొద్ది కాలంగా మోకాళ్ల నొప్పులు విసిగిస్తూ ఉండడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నొప్పి తగ్గడానికి ఎన్ని మాత్రలు మింగినా బాధ కాసేపు మాత్రమే ఉపశమించేది. చివరికి పేరున్న ఎముకల వ్యాధి నిపుణుడిని సంప్రదిస్తే, ఆర్థరైటిస్ తీవ్రంగా ఉందని, సర్జరీ తప్పదని చెప్పడంతో ఇంత మనిషీ బెంబేలెత్తే పరిస్థితి ఎదురైంది. కానీ సరికొత్తగా వచ్చిన పద్ధతితో సర్జరీతో వారం తిరక్కుండానే అతడు చలాకీగా నడవడం సాధ్యమైంది... ఒకప్పటితో పోలిస్తే మోకీళ్లు, తుంటి మార్పిడి శస్త్రచికిత్స కొత్త పుంతలు తొక్కుతోందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. కీళ్ల వాతం (ఆర్థరైటిస్) వల్ల కానీ, ఇతర సమస్యల వల్ల కానీ మోకాలి చిప్పల అరుగుదలతో చాలా మంది అడుగు తీసి అడుగేయడం కూడా నరకప్రాయంగా ఉంటే వారికి ప్రస్తుతం నగరంలో లభ్యమవుతున్న మోకీళ్ల మార్పిడి వరంగా ఉంటోంది. ఒకప్పడు మొత్తం మోకాలిని లేదా తుంటిని తెరిచి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటే ఇప్పుడు ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సులువుగా మార్పిడి జరుగుతోంది. నగరంలోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో మోకీళ్ల, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే వీలుంది. సర్జరీకి తక్కువ సమయం పట్టడం, తక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాల్సి రావడం, గరిష్ట స్థాయి ఫలితాల వల్ల చాలా మంది ఈ సర్జరీవైపు మొగ్గు చూపడం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ దూరం ఆరోగ్యశ్రీ పరిధిలో మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవి నామమాత్రంగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు కేజీహెచ్‌లో స్టేట్ ఇల్నెస్ ఫండ్‌తో ఈ శస్త్రచికిత్సలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత నిధులు లేక ప్రభుత్వరంగంలో చేయించుకునే పేదవారికి ఈ శస్త్రచికిత్సలు అందని ద్రాక్షగా మిగిలాయి. గత ఐదేళ్ల కాలంగా కేజీహెచ్‌లో ఈ శస్త్రచికిత్సలు దాదాపుగా నిలిచిపోయాయి. కేజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి చేయించుకోవాలంటే రోగి పూర్తి సొమ్మును భరించాల్సిన దుస్థితి ఉంది. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దష్టికి సమస్యను తీసుకురాగా..ఈ సర్జరీల నిర్వహణకు కేజీహెచ్‌తో పాటు తిరుపతి, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు ఏడాదికి కోటి వంతున ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎంప్లాయస్ హెల్త్ స్కీం పథకాలు ప్రస్తుతం పెద్ద దిక్కుగా నిలిచాయి. కార్పొరేట్‌కు కాసుల వర్షం ఈ శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పరధిలో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ‘నీ పెయిన్ టూ నో పెయిన్’ నినాదంతో నగరంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు భారీ ఎత్తున వ్యాపారం సాగిస్తున్నాయి. విశాఖనగరం వైద్య పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రోగులే కాకుండా కొందరు విదేశీయులు కూడా నగరానికి వచ్చి ఇటీవల కాలంలో ఈ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ఎక్కువగా చేయించుకుంటున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, థర్డ్, ఫిఫ్త్ జనరేషన్, కంప్యూటర్ నేవిగేషన్ శస్త్రచికిత్సల పేరిట సర్జరీలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో తక్కువలో తక్కువగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కేంద్ర ఉద్యోగులకు వరం విశాఖ నగరంలో పని చేసున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పథకం(సీజీహెచ్ఎస్) ద్వారా మోకీళ్లు, తుంటి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. అనుమతి పొందిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ఉద్యోగులు ఈ చికిత్స చేయించుకుంటున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఎముకల అరుగుదల సహజం కాబట్టి, వీరిలో అరుగుదల 40– 50 శాతం ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు ఈ చికిత్సను సిఫార్సు చేస్తున్నాయి. పదవీ విరమణకు కాస్త ముందుగా వీరు వైద్యుల సలహా మేరకు ఈ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఆధునిక విజ్ఞానం.. కార్పొరేట్ పరం మోకీలు, తుంటిమార్పిడి శస్త్రచికిత్సా విధానం ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత, ఆర్థోస్కోపీ పద్ధతిలో సాగుతోంది. ఇప్పుడు మూడు లేదా ఐదో జనరేషన్, కంప్యూటర్ నేవిగేషన్ శస్త్రచికిత్సా విధానాలు అమలవుతున్నాయి. కేజీహెచ్‌లో ఓపెన్ పద్దతిలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అపోలో, కేర్, ఇండస్, మణిపాల్, ఓమ్నీ ఆర్కే, సెవెన్‌హిల్స్, ఎన్ఆర్ఐ, అమూల్య, ఐకాన్ కషి, క్యూ–1 నీ రీప్లేస్మెంట్ సెంటర్ తదితర ఆస్పత్రుల్లో ప్రధానంగా ఈ శస్త్రచికిత్సలు పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. క్యూ–1 రీప్లేస్మెంట్ సెంటర్లో మూడో తరం కంప్యూటర్ నేవిగేషన్ ద్వారా జర్మన్ టెక్నాలజీతో నగరంలో గత ఏడేళ్లుగా ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండగా ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో ఐదో తరం కంప్యూటర్ నేవిగేషన్ టెక్నాలజీ సహాయంతో అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో అధిక సంఖ్యలో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నగరంలో ఇటీవల ప్రారంభించిన ఎముకల సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి అయిన అమూల్య ఆర్థోకేర్ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి, తుంటికి సంబంధించి మూడో తరం కంప్యూటర్ నేవిగేషన్, జర్మనీ టెక్నాలజీ సహాయంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇందుకు వాడే పరికరాలు, ఇంప్లాంట్లు (కీళ్లలో అమర్చే పదార్థాలు) అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. నివారణ ఇలా.. ఎముకల అరుగుదల నివారణకు శరీరం బరువు నియంత్రణలో ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమపద్దతిలో ఫిజియోథెరపీ, నిత్యం నడక చాలా అవసరం. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం మానేయడం మంచిది. మోకాళ్ల అరుగుదల తక్కువగా ఉన్నప్పుడు ఈ నివారణ పని చేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు ఆర్థోస్కోపీ శస్త్రచికిత్స వల్ల అరుగుదలను తగ్గించుకోవచ్చు. కానీ పూర్తిగా అరిగినప్పుడు కీళ్ల మార్పిడి ఒక్కటే మార్గం. -
పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నేను ఏడాది నుంచి మెడనొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ నొప్పి వస్తోంది. హోమియోలో శాశ్వత చికిత్స ఉంటే తెలపండి. - నారాయణ స్వామి, నిజామాబాద్ స్పాండిలోసిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనీ, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు. కారణాలు : కాళ్లు, చేతులలో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్‌లో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్ వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్ని స్పాండిలోసిస్ అంటారు. వెన్నుపూసల మధ్య నరాలు వెళ్లడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్నబడితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : సర్వైకల్ స్పాండిలోసిస్ - మెడనొప్పి, తలనొప్పి, తల అటు ఇటు తిప్పడం కష్టం కావడం, మెడ బిగుసుకుపోయినట్లుగా ఉండటం, నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లంబార్ స్పాండిలోసిస్ : నడుము నొప్పితో పాటు కొన్నిసార్లు మెడనొప్పి కూడా ఉంటుంది. ఒకవైపు కాలు నుంచి పాదం వరకు నొప్పి వ్యాపిస్తుంటుంది. దీన్నే సయాటికా నొప్పి అని అంటారు. నరాలు ఒత్తిడికి గురై నడవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలూ కనిపిస్తాయి. నిర్ధారణ : లక్షణాలను బట్టి వ్యాధిని తెలుసుకోవడంతో పాటు, ఎక్స్-రే, ఎమ్మారై, సీటీ స్కాన్లూ నిర్ధారణకు ఉపయోగపడతాయి. నివారణ : స్పైన్‌కు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చోవడం, నిల్చోవడం చేయకూడదు. దూరప్రాంతాలకు నడవడం సరికాదు.హోమియోలో కాన్స్టిట్యూషనల్ చికిత్సతో క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా వ్యాధిని క్రమక్రమంగా తగ్గిస్తూ, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్‌ను వేశారు. ఇప్పుడు శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు డాక్టర్ నన్ను పరీక్షించి, గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట గుండె జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు. కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బరువు పెరగకుండా చూసుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు మూడు నెలలు. ఈమధ్య తరచూ ఏడుస్తోంది. డాక్టర్‌కి చూపిస్తే కడుపు నొప్పి వల్ల ఏడుస్తుండవచ్చు అని కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, కొత్తగూడెం పిల్లలు ఆగకుండా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్న సమస్య మొదలుకొని ప్రమాదకరమైన జబ్బుల వరకూ పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తారు.ఆకలిగా ఉన్నా, చెవి నొప్పి ఉన్నా సరే ఏడ్వడం ద్వారానే వాటిని తెలియబరుస్తుంటారు. పిల్లల ఏడుపుకు కొన్ని కారణాలు: ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, దాహం వేసినప్పుడు, డయపర్ తడిగా అయినప్పుడు, వాతావరణం వారికి చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద శబ్దాలు అవుతున్నప్పుడు, కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా, ఏవైనా నొప్పులు ఉన్నప్పుడు, పళ్ళు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను కూడా పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తం చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి కారణాలు. మీ పాప విషయంలో ఏడుపు బహుశా కడుపునొప్పి (ఇన్ఫెన్టైల్ కోలిక్) కారణం అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు ఫలానా అంటూ నిర్దిష్టంగా కారణం అని చెప్పలేకపోయినా... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెర ఎక్కువ కావడం వంటి కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్లను పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. చికిత్స : కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ప్రణతోస్మి దివాకరం
సూర్య నమస్కారాలు వెన్నెముక మొత్తాన్ని చైతన్యవంతం చేసి, భావోద్వేగాలను అదుపులో ఉంచే శక్తి సూర్య నమస్కారాలకు ఉంది. వీటిని శ్వాసమీద ధ్యాస ఉంచి చేయాలి. సరిగ్గా సాధన చేస్తే హృద్రోగ సమస్యలు దరిచేరవు. వీటిని నిదానంగా ప్రారంభించి-వేగవంతం చేసి- తిరిగి నిదానంగా పూర్వస్థితిలోకి రావాలి. నేరుగా వేగం పెంచితే కీళ్లు పట్టేసే ప్రమాదముంది. ఈ ఆసనాలు వేసేటప్పుడు అవి శరీరంలోని ఏ భాగం మీద పనిచేస్తాయో అక్కడే మనసును కేంద్రీకరించాలి. అందరూ ఈ ఆసనాలన్నీ చేయవచ్చు. నడుం నొప్పి ఉన్నవాళ్లు కూడా చేయవచ్చు. ఏ వయసు వారైనా ఈ ఆసనాలను నిత్యం చేయవచ్చు. అయితే శాస్త్రీయంగా సాధన చేయడం అవసరం. ప్రాతఃకాలంలో వాతావరణంలో పాజిటివ్ డ్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఉంటాయి. మనసును కేంద్రీకరించడానికి అది సరైన సమయం. జీవనశైలి ప్రకారం కుదరకుంటే ఏ సమయంలోనైనా చేయవచ్చు. కాని ఆహారం తీసుకున్న 4 గంటల తర్వాతే చేయాలి. కడుపు నిండా నీళ్లు తాగినట్లయితే కనీసం అరగంట విరామం ఇవ్వాలి. 1. ప్రణామాసనం: తూర్పుదిక్కుకు అభిముఖంగా నిల్చొని సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుందీ ఆసనం. శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థకు మంచిది. ప్రారంభంలో 4 - 5 సాధారణ శ్వాసలు తీసుకొని వదలాలి. దీనిలో ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. 2. హస్త ఉత్థానాసనం: మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచుతూ, చేతులను తల మీదుగా తీసుకుంటూ భుజాల వెనక్కి వెళ్లేలా ఉదరభాగాన్ని ముందుకు తీసుకోవాలి. ఈ భంగిమలో వెన్నెముక మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా నెమ్మదిగా గాలి పీల్చుతూ, వదులుతూండాలి. ఈ ఆసనం వల్ల వెన్ను, మెడ కండరాలు, నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతాయి. 3. పాదహస్తాసనం: కాళ్లను నిటారుగా ఉంచి, గాలి వదులుతూ నిదానంగా ముందుకు వంగాలి. వెన్నెముక మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తల మోకాలుకు ఆనేలా వీలయినంత వంగాలి. దీని వల్ల మూత్ర వ్యవస్థ, ప్రత్యుత్పతి వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. 4. అశ్వ సంచాలాసనం: గాలి నెమ్మదిగా పీల్చుకుంటూ చేతులను నేలకు ఆనించి, కుడికాలిని వెనక్కు తీసుకెళ్లి, ఛాతీని, తలని పెకైత్తాలి. హైపోథాలమస్ (మెదడులో భావోద్వేగానికి సంబంధించిన ఒక భాగం) మీద ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ధ్యాసను కనుబొమల మధ్యనే ఉంచాలి. దృష్టిని కుడికాలి బొటన వేలి నుంచి కనుబొమల దాకా తీసుకురావాలి. కుడివైపు భాగానికి చేస్తున్నాం కాబట్టి ఆ వైపు అంతా చైతన్యవంతం అవుతుంది. 5. చతురంగాసనం: గాలిని వదిలేస్తూ ఎడమకాలిని కుడికాలికి జత చేయాలి. నడుం మీద బరువు పడకుండా చూసుకోవాలి. పొట్ట, ఛాతీ. ఇలా నెమ్మదిగా గొంత ుదాకా మనసును తీసుకురావాలి. ఇది నాడీ వ్యవస్థ మీద, ఉదరం మీద పనిచేస్తుంది. 6. అష్టాంగ నమనాసనం: శరీరంలో 8 భాగాలు నేలను తాకుతాయి కాబట్టి దీనికీ పేరు. గాలి తీసుకుని, వదిలేస్తూ నెమ్మదిగా మోకాలిని, ఛాతీని, గడ్డాన్ని నేలకు ఆన్చాలి. మెడనొప్పి ఉన్నవాళ్లు నుదురును నేలకు ఆనించాలి. నడుం భాగం పైకి ఎత్తిపెట్టి ఉంచాలి, నేలకు ఆనకూడదు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 7. భుజంగాసనం: నెమ్మదిగా గాలి పీలుస్తూ చేతులు నేలకు ఆన్చి ఛాతీ, తలను పెకైత్తాలి. ఇది పునరుత్పత్తి, మూత్రవిసర్జన, రక్తప్రసరణ వ్యవస్థలపైనా, థైరాయిడ్ గ్రంథి మీద పనిచేస్తుంది. నడుమును బలోపేతం చేస్తుంది. 8. పర్వతాసనం లేదా అథోముఖ శ్వానాసనం: ఒత్తిడికి లోనైన వెన్నెముక విశ్రాంతి పొందేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఈ ఆసనం నడుం నొప్పికి ఔషధం అని చెప్పవచ్చు. ఈ ఆసనం వేసే సమయంలో నిదానంగా గాలిని వదులుతూ నడుమును పెకైత్తి, గాలిని లోపలికి తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. 9. అశ్వసంచాలనాసనం: (నాలుగో ఆసనంలో కుడివైపు చేశాం) ఇప్పుడు ఈ ఆసనంలో ఎడమ వైపు చేయాలి. రెండు మోకాళ్లను నేలకు ఆన్చి నెమ్మదిగా ఎడమ కాలును వెనక్కు తీసుకుంటూ ఛాతీని, తలను పెకైత్తాలి. 10. పాదహస్తాసనం: (3వ ఆసనం లాంటిదే) ఎడమకాలుని కుడికాలికి జత చేసి నడుమును పెకైత్తాలి. 11. హస్త ఉత్థానాసనం: నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మోకాళ్లకు కొద్దిగా ముందుకు వంచి, చేతులను భుజాల వెనక్కి తీసుకె ళ్లాలి. శరీరాన్ని సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. 12. ప్రణామాసనం: నిటారుగా నిల్చొనే స్థితికి వచ్చి, నెమ్మదిగా గాలిని వదిలేస్తూ రెండు చేతులను నమస్కార భంగిమలో హృదయస్థానం పైకి తీసుకురావాలి. -
కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మన కీళ్లు మనకు తెలియకుండా అవసరానికి తగినట్లుగా వంగిపోతూ రోజువారీ పనుల్లో పాల్గొంటుంటాయి. అవి ఏదైనా కారణాలతో వంగక తీవ్రమైన నొప్పితోనూ, వాపుతోనూ ఉంటే అప్పుడుగాని కీళ్లకు వచ్చిన సమస్య మనకు తెలియదు. అప్పటివరకూ మన దైనందిన కార్యకలాపాల్లో వాటి ప్రాధాన్యం మనకు అర్థం కాదు. కీళ్లనొప్పుల్లో అనేక రకాలు ఉన్నా... ప్రధానంగా చిన్న కీళ్లలో వచ్చే నొప్పుల్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా పేర్కొనవచ్చు. చలి ఎక్కువగా ఉండే రోజుల్లో సమస్య మరింతగా కనిపించే ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్న చిన్న కీళ్లలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యక్తమవుతుంది. నొప్పి, వాపు, ముట్టుకుంటే నొప్పి/మంటతో పాటు ముట్టుకోనివ్వని లక్షణాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. డయాబెటిస్, రక్తపోటు (హైబీపీ)లాగే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధే. అయితే ఇప్పుడు లభ్యమవుతున్న ఆధునిక వైద్య చికిత్సా ప్రక్రియతో గతంతో పోలిస్తే మరింత సమర్థంగా అదుపులో ఉంచేందుకు వీలైన వ్యాధి ఇది. మూడు ‘ఎస్’లతో గుర్తించడం తేలిక: మీకు కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అవి... ఊ స్టిఫ్నెస్ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం. ఊ స్వెల్లింగ్ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట) ఊ స్క్వీజింగ్ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు... షేక్‌హ్యాండ్ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్’ అయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందేమోనని చూసుకోవాలి. ఇతర లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... నొప్పి పెడతాయి. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయానికి పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. ఇక ఉదయాన్నే కీళ్ల కణుపుల వద్ద నొప్పి తగ్గడానికి చేతులను వేడినీళ్లలో ముంచితే తమకు ఉపశమనం కలుగుతుందేమోనని అనుకుంటుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్ తిప్పడం, షర్ట్ బటన్లు పెట్టుకోవడం వంటి సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు. అయితే మొదట్లో చిన్న కీళ్లకు (అంటే వేళ్ల కణుపులకు) పరిమితమైన నొప్పి... వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెద్ద కీళ్లకూ (అంటే.. మోచేయి, మోకాలు, మడమ... వంటివాటికి) వ్యాపిస్తుంది. ఎందుకు వస్తుందిది..? మన వ్యాధినిరోధక వ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. మన కీళ్లు ఎందుకో మన వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)కు కొత్తగా అనిపిస్తాయి. దాంతో ఆ వ్యవస్థ మన కీళ్లపై పోరాటం మొదలుపెడుతుంది. మన కీళ్ల కణుపులపై యాంటీబాడీస్‌ను క్షిపణుల్లా ప్రయోగిస్తుంటుంది. దాంతో ఎముకల కీళ్ల చివరన ఉండే సైనోవియమ్ అనే పొర దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల వద్ద, కీళ్ల చుట్టూ నొప్పి, వాపు, ముట్టుకోనివ్వనంత మంట కనిపిస్తాయి. నిర్ధారణ: ఊ లక్షణాలు కనీసం ఆరు వారాల పాటు అలాగే కొనసాగడం (అయితే ఇటీవల ఆరువారాల లోపే లక్షణాలు తీవ్రతరమవుతున్నాయి. దాంతో వ్యాధిని త్వరగా గుర్తించడం... ఫలితంగా చికిత్సకు స్పందన కూడా త్వరితంగా కనిపించడం జరుగుతోంది). ఊ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష: ఇది వ్యాధి పేరుతో ఉన్న పరీక్షే అయినా... ఒక్కోసారి వ్యాధి ఉన్నప్పటికీ ఇందులో నెగెటివ్ రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఒక్కోసారి కొందరిలో ఏ వ్యాధి లేనివారిలోనూ ఇది పాజిటివ్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి రుమటాలజిస్టులు కానివారు నిర్దిష్టంగా నిర్ధారణ చేయలేకపోవచ్చు. రుమటాలజిస్ట్ మాత్రమే ఈ వ్యాధిని సరిగా నిర్ధారణ చేయగలరు. ఊ యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్)తో నిర్ధారణ నిర్దిష్టంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ ఒక ప్రతికూలత ఉంది. అదేమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది రోగుల్లోనే యాంటీ-సీసీపీ కనపడుతుంది. వ్యాధిని ఎదుర్కోవడం ఇలా ... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయడం కంటే వ్యాధిని అదుపులో ఉంచడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రక్రియ. అందుకే వ్యాధిని ఎదుర్కునే క్రమంలో రోగికి వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, కొన్ని సూచనలు ఇవ్వడం, ఫిజియోథెరపీ వంటివి అవసరం. చికిత్సతో పాటు ఇవన్నీ కలగలిసి ఆచరించాల్సిన అవసరం ఉంది. ఊ రోగికి అవగాహన: వ్యాధిని అదుపులో పెట్టాలంటే ముందు వ్యాధిపట్ల రోగికి అవగాహన అవసరం. రోగి తెలుసుకోవాల్సిందేమిటంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. చికిత్స తీసుకోగానే టక్కున మాయమైనట్లుగా నయమయ్యేది కాదు. చికిత్స కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటూ ఉండాలి. గుణం కనిపించడం కూడా అంత త్వరగా జరగదు. (మందులు పనిచేయడం అన్నది ఆరు వారాలకు ముందుగా కనిపించదు). పాటించాల్సిన సూచనలు ఊ రోగి నిద్ర మేల్కోగానే పడకపైనుంచి లేచేముందుగా కనీసం ఐదు నిమిసాల పాటు అలాగే పడుకుని కీళ్లను ముడుస్తూ, రిలాక్స్ చేస్తూ ఉండాలి. దాంతో కండరాలన్నీ బిగుతును కోల్పోయి, సాఫ్ట్‌గా మారతాయి. ఊ కీళ్లు బిగుతుగా ఉంటే పొద్దున్నే వేణ్ణీళ్లతో స్నానం చేస్తే, ఆ బిగుతు తగ్గుతుంది. ఊ రోగి తాను పనిచేస్తున్నప్పుడు కనీసం ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పనికి బ్రేక్ ఇచ్చి ఒక ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. ఇలా రోజంతా చేయాలి. ఊ పతి కీలుపైనా పడే ఒత్తిడిని నిరోధించడానికి చేయాల్సిన వ్యాయామ విధానాలను డాక్టర్‌ను లేదా ఫిజియోథెరపిస్ట్‌ను అడిగి తెలుసుకుని, వాటిని పాటించాలి. ఊ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వాడాల్సిన కొన్ని ఉపకరణాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుని వాటిని వాడాలి. ఫిజియోథెరపీ : ఈ వ్యాధి వచ్చిన వారు తమ కీళ్ల పనితీరును మెరుగుపరచుకునేందుకు తరచూ ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారు సూచించిన వ్యాయామాలను చేయాలి. ముఖ్యంగా కీళ్లు కదలడానికి చేసే ప్రక్రియల వల్ల వాటిపై పడే ఒత్తిడిని తొలగించేలా / లేదా తగ్గించేలా ఈ వ్యాయామాలు ఉంటాయి. వాటిని విధిగా పాటించాలి. వైద్యచికిత్స : రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చేసే చికిత్స అనేకబరకాలుగా ఉంటుంది. తక్షణం నొప్పిని ఉపశమింపజేసేందుకు ఉపయోగించాల్సిన మందులు, మన ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతికూలంగా పనిచేయకుండా చూసేందుకు వాడాల్సిన మందులు, స్టెరాయిడ్స్ ఇలా రకరకాల మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. నొప్పినివారణకు: కీళ్లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సాధారణ నొప్పి నివారణ మందులు వాడితే వాటి ప్రభావం కొద్ది గంటలకు మించి ఉండదు. అందుకోసం వ్యాధిని అదుపులో పెడుతూనే, నొప్పిని తగ్గించగల మందులనూ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిన మందులను నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) అంటారు. ఈ జబ్బులో వాటిని వాడతారు. అసలు జబ్బుపై పనిచేయడానికి: ఇక ఈ వ్యాధిలో మన సొంత వ్యాధి నిరోధక శక్తే మనపై ప్రతికూలంగా పనిచేసి, మన కీళ్ల యాంటీబాడీలను ప్రయోగిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇలాంటి యాంటీబాడీస్ దాడులను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. అందుకోసం మన వ్యాధి నిరోధక శక్తి తాలూకు ప్రభావాన్నే కాస్తంత తగ్గించేలా మందులు వాడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు సొంత వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకుంటే అది ఇతరత్రా ప్రమాదం కావచ్చు కదా. అందుకే ఇతరత్రా వ్యాధి కారకాల విషయంలో తగ్గనంతగానూ, కేవలం మన సొంత కీళ్ల కణుపులు రక్షితమయ్యేంతగానూ ఉండేలా ఈ మందుల మోతాదులు చాలా సునిశితంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఇతరత్రా మనకు హాని కాకుండా కేవలం కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్ ప్రభావాన్ని తగ్గించే ఈ తరహా మందుల్ని ‘డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్’ (డీఎమ్‌ఏఆర్‌డీ) అంటారు. ఇవి కూడా తమ ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాల వ్యవధి పడుతుంది. స్టెరాయిడ్స్‌తో బ్రిడ్జింగ్ థెరపీ: మొదట నొప్పిని తగ్గిస్తూ... ఆ తర్వాత అసలు వ్యాధిపై పనిచేసేలా ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని ముందే తెలుసుకున్నాం. మరి ఈ లోపు... నొప్పితో కూడిన కణుపులతో బాధపడటమేనా? అందుకే అసలు ప్రభావం కనిపించే లోపు... ఉపశమనం కలిగించడానికి, వ్యాధిని అదుపుచేయడానికీ మధ్య వంతెనలా పనిచేయడానికి పనికి వచ్చేలా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇలా ఇవి వంతెన భూమికను నిర్వహిస్తాయి కాబట్టే ఈ స్టెరాయిడ్స్‌తో చేసే చికిత్సను ‘బ్రిడ్జింగ్ థెరపీ’ అంటూ అభివర్ణిస్తారు నిపుణులు. మొదట్లో అసలు కదిలించడానికే వీల్లేనంత తీవ్రంగా ఉండే వేళ్ల కీళ్లనూ, వాటి కణుపులనూ మామూలుగా మార్చడానికి కొంతమోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇవ్వడం మొదలు పెట్టి... నిపుణులు క్రమంగా ఆ మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. రోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మందులు వాడే సమయంలో కాస్తంత తెరిపి కనిపించినా... ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మానకూడదు. - నిర్వహణ: యాసీన్ కొత్త చికిత్సా విధానాలు మనలోని వ్యాధి నిరోధక శక్తే కొన్ని యాంటీబాడీస్‌ను మన కీళ్లపైకి ప్రయోగించడం వల్ల తీవ్రమైన బాధ కలుగుతుందన్న విష యం తెలిసిందే. అందుకే కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్‌ను అణిచేసేలా కొత్త మందు లు రూపొందించారు. ఇవి వ్యాధినిరోధకతకూ, కీళ్లకూ మధ్యలో వ్యాధి నిరోధకత సృష్టించే యాంటీబాడీస్‌ను అణిచేలా పని చేస్తాయి కాబట్టి ఇంటర్మీడియరీ పదార్థాలు అని కూడా అంటారు. వీటిని టీఎన్ఎఫ్-ఆల్ఫా, ఐఎల్-6 వంటి జీవసంబంధమైన (బయాలజిక్) పదార్థాలనుంచి రూపొందిస్తారు కాబట్టి వీటిని ‘బయాలజిక్ ఏజెంట్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ మందులు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు ఇన్‌ఫ్లిక్సిమాబ్, ఎటానెర్సెప్ట్, అబాటసెప్ట్, రిటుక్సిమాబ్. ఈ కేటగిరీలో టొఫాసిటినిబ్ అన్నది సరికొత్త మందు. త్వరలోనే భారతదేశంలోకి రానుంది. - డాక్టర్ కె. ధీరజ్, రుమటాలజిస్ట్, యశోదా హాస్పిటల్, మలక్‌పేట, హైదరాబాద్