కీళ్ల మార్పిడి మేడ్‌ ఈజీ! | Joint exchange Made Easy | Sakshi
Sakshi News home page

కీళ్ల మార్పిడి మేడ్‌ ఈజీ!

Published Thu, Jul 28 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

కీళ్ల మార్పిడి మేడ్‌ ఈజీ!

కీళ్ల మార్పిడి మేడ్‌ ఈజీ!

కాళ్లరిగిపోయేలా తిరిగినా పని జరగడం లేదని మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బాధ పడే ఉంటారు. పనులు జరగడానికి కాళ్లు అరగాలా? అని ప్రశ్నించే కొంటె కోణంగులూ మనలో ఉంటారు. అందమైన తెలుగు భాషలో ఇదో చమత్కారమని సరిపెట్టుకున్నా.. నిజంగా ప్రతి ఒక్కరికీ కాళ్లు కాకపోయినా కీళ్లు అరిగే ముప్పు పొంచి ఉంటుందన్నది వాస్తవం. పెరిగే వయస్సూ, దాంతో పాటే వచ్చే రకరకాల సమస్యలు కీళ్ల అరుగుదలకు కారణమవుతున్నాయి. దాంతో మన కాళ్ల మీద మనం నిలబడలేని పరిస్థితి అక్షరాలా సంప్రాప్తిస్తోంది. ఒకప్పుడు ఈ సమస్యలకు సంక్లిష్ట శస్త్ర చికిత్సల వల్ల మాత్రమే కొంతలో కొంత పరిష్కారం లభించేది. కానీ వైద్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల అత్యధునాతన సర్జరీల ద్వారా అద్భుత ఫలితాలు లభించే అవకాశం దక్కుతోంది. నగరంలోని అనేక ఆస్పత్రుల్లో ఈ కీళ్ల సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ఈ కీళ్ల మార్పిడి మెడికల్‌ మ్యాజిక్‌పై కథనం..   
 

భీమారావు పేరుకు తగ్గట్టే భారీగా ఉంటాడు. తిండిపుష్టి ఉండడంతో ఇంతింతై అన్నట్టుగా పెరిగిన శరీరంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తాడు. వయస్సులో ఉన్నప్పుడు పుష్టిగా ఉన్నా క్రమంగా ఏళ్లు మీద పడుతున్న కొద్దీ అడుగు వేయడానికి కూడా ఆయాసపడాల్సి వస్తోంది. దానికి తోడు కొద్ది కాలంగా మోకాళ్ల నొప్పులు విసిగిస్తూ ఉండడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నొప్పి తగ్గడానికి ఎన్ని మాత్రలు మింగినా బాధ కాసేపు మాత్రమే ఉపశమించేది. చివరికి పేరున్న ఎముకల వ్యాధి నిపుణుడిని సంప్రదిస్తే, ఆర్థరైటిస్‌ తీవ్రంగా ఉందని, సర్జరీ తప్పదని చెప్పడంతో ఇంత మనిషీ బెంబేలెత్తే పరిస్థితి ఎదురైంది. కానీ సరికొత్తగా వచ్చిన పద్ధతితో సర్జరీతో వారం తిరక్కుండానే అతడు చలాకీగా నడవడం సాధ్యమైంది...

ఒకప్పటితో పోలిస్తే మోకీళ్లు, తుంటి మార్పిడి శస్త్రచికిత్స కొత్త పుంతలు తొక్కుతోందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. కీళ్ల వాతం (ఆర్థరైటిస్‌) వల్ల కానీ, ఇతర సమస్యల వల్ల కానీ మోకాలి చిప్పల అరుగుదలతో చాలా మంది అడుగు తీసి అడుగేయడం కూడా నరకప్రాయంగా ఉంటే వారికి ప్రస్తుతం నగరంలో లభ్యమవుతున్న మోకీళ్ల మార్పిడి వరంగా ఉంటోంది. ఒకప్పడు మొత్తం మోకాలిని లేదా తుంటిని తెరిచి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటే ఇప్పుడు ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సులువుగా మార్పిడి జరుగుతోంది. నగరంలోని అనేక కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మోకీళ్ల, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే వీలుంది. సర్జరీకి తక్కువ సమయం పట్టడం, తక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాల్సి రావడం, గరిష్ట స్థాయి ఫలితాల వల్ల చాలా మంది ఈ సర్జరీవైపు మొగ్గు చూపడం కనిపిస్తోంది.

ఆరోగ్యశ్రీ దూరం
ఆరోగ్యశ్రీ పరిధిలో మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవి నామమాత్రంగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు కేజీహెచ్‌లో స్టేట్‌ ఇల్‌నెస్‌ ఫండ్‌తో ఈ శస్త్రచికిత్సలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత నిధులు లేక ప్రభుత్వరంగంలో చేయించుకునే పేదవారికి ఈ శస్త్రచికిత్సలు అందని ద్రాక్షగా మిగిలాయి. గత ఐదేళ్ల కాలంగా కేజీహెచ్‌లో ఈ శస్త్రచికిత్సలు దాదాపుగా నిలిచిపోయాయి. కేజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి చేయించుకోవాలంటే రోగి పూర్తి సొమ్మును భరించాల్సిన దుస్థితి ఉంది. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ దష్టికి సమస్యను తీసుకురాగా..ఈ సర్జరీల నిర్వహణకు కేజీహెచ్‌తో పాటు తిరుపతి, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు  ఏడాదికి  కోటి వంతున ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎంప్లాయస్‌ హెల్త్‌ స్కీం పథకాలు  ప్రస్తుతం పెద్ద దిక్కుగా నిలిచాయి.

కార్పొరేట్‌కు కాసుల వర్షం
ఈ శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పరధిలో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని   ‘నీ పెయిన్‌ టూ నో పెయిన్‌’ నినాదంతో నగరంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు భారీ ఎత్తున వ్యాపారం సాగిస్తున్నాయి. విశాఖనగరం వైద్య పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రోగులే  కాకుండా కొందరు విదేశీయులు కూడా నగరానికి వచ్చి ఇటీవల కాలంలో ఈ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ఎక్కువగా చేయించుకుంటున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, థర్డ్, ఫిఫ్త్‌ జనరేషన్, కంప్యూటర్‌ నేవిగేషన్‌ శస్త్రచికిత్సల పేరిట సర్జరీలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో తక్కువలో తక్కువగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

కేంద్ర ఉద్యోగులకు వరం
విశాఖ నగరంలో పని చేసున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం పథకం(సీజీహెచ్‌ఎస్‌) ద్వారా మోకీళ్లు, తుంటి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. అనుమతి పొందిన ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ఉద్యోగులు ఈ చికిత్స చేయించుకుంటున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఎముకల అరుగుదల సహజం కాబట్టి, వీరిలో అరుగుదల 40– 50 శాతం ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు ఈ చికిత్సను సిఫార్సు చేస్తున్నాయి. పదవీ విరమణకు కాస్త ముందుగా వీరు వైద్యుల సలహా మేరకు ఈ సర్జరీలు చేయించుకుంటున్నారు.

ఆధునిక విజ్ఞానం.. కార్పొరేట్‌ పరం
మోకీలు, తుంటిమార్పిడి శస్త్రచికిత్సా విధానం ప్రస్తుతం కంప్యూటర్‌ ఆధారిత, ఆర్థోస్కోపీ పద్ధతిలో సాగుతోంది. ఇప్పుడు మూడు లేదా ఐదో జనరేషన్, కంప్యూటర్‌ నేవిగేషన్‌ శస్త్రచికిత్సా విధానాలు అమలవుతున్నాయి.  కేజీహెచ్‌లో ఓపెన్‌ పద్దతిలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అపోలో, కేర్, ఇండస్, మణిపాల్, ఓమ్నీ ఆర్కే, సెవెన్‌హిల్స్, ఎన్‌ఆర్‌ఐ, అమూల్య, ఐకాన్‌ కషి, క్యూ–1 నీ రీప్లేస్‌మెంట్‌ సెంటర్‌ తదితర ఆస్పత్రుల్లో ప్రధానంగా ఈ శస్త్రచికిత్సలు పెద్ద సంఖ్యలో చేస్తున్నారు.  క్యూ–1 రీప్లేస్‌మెంట్‌ సెంటర్లో మూడో తరం కంప్యూటర్‌ నేవిగేషన్‌ ద్వారా జర్మన్‌ టెక్నాలజీతో నగరంలో గత ఏడేళ్లుగా ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండగా ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో ఐదో తరం కంప్యూటర్‌ నేవిగేషన్‌ టెక్నాలజీ సహాయంతో అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో అధిక సంఖ్యలో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నగరంలో ఇటీవల ప్రారంభించిన ఎముకల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి అయిన అమూల్య ఆర్థోకేర్‌ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి, తుంటికి సంబంధించి మూడో తరం కంప్యూటర్‌ నేవిగేషన్, జర్మనీ టెక్నాలజీ సహాయంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.  ఇందుకు వాడే పరికరాలు, ఇంప్లాంట్‌లు (కీళ్లలో అమర్చే పదార్థాలు) అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే.

నివారణ ఇలా..
ఎముకల అరుగుదల నివారణకు శరీరం బరువు నియంత్రణలో ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమపద్దతిలో ఫిజియోథెరపీ, నిత్యం నడక చాలా అవసరం. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం మానేయడం మంచిది. మోకాళ్ల అరుగుదల తక్కువగా ఉన్నప్పుడు ఈ నివారణ పని చేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు ఆర్థోస్కోపీ శస్త్రచికిత్స వల్ల అరుగుదలను తగ్గించుకోవచ్చు. కానీ పూర్తిగా అరిగినప్పుడు కీళ్ల మార్పిడి ఒక్కటే మార్గం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement