కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..! | joints pain specialist | Sakshi
Sakshi News home page

కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!

Published Tue, Dec 10 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!

కీళ్లను ముట్టుకుంటే మంట.. పట్టుకుంటే తంటా..!

  రుమటాయిడ్ ఆర్థరైటిస్

 మన కీళ్లు మనకు తెలియకుండా అవసరానికి తగినట్లుగా వంగిపోతూ రోజువారీ పనుల్లో పాల్గొంటుంటాయి. అవి ఏదైనా కారణాలతో వంగక తీవ్రమైన నొప్పితోనూ, వాపుతోనూ ఉంటే అప్పుడుగాని కీళ్లకు వచ్చిన సమస్య మనకు తెలియదు. అప్పటివరకూ మన దైనందిన కార్యకలాపాల్లో వాటి ప్రాధాన్యం మనకు అర్థం కాదు. కీళ్లనొప్పుల్లో అనేక రకాలు ఉన్నా... ప్రధానంగా చిన్న కీళ్లలో వచ్చే నొప్పుల్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా పేర్కొనవచ్చు. చలి ఎక్కువగా ఉండే రోజుల్లో సమస్య మరింతగా కనిపించే ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’పై అవగాహన కోసం ఈ కథనం.
 
 చిన్న చిన్న కీళ్లలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యక్తమవుతుంది. నొప్పి, వాపు, ముట్టుకుంటే నొప్పి/మంటతో పాటు ముట్టుకోనివ్వని లక్షణాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. డయాబెటిస్, రక్తపోటు (హైబీపీ)లాగే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధే. అయితే  ఇప్పుడు లభ్యమవుతున్న ఆధునిక వైద్య చికిత్సా ప్రక్రియతో గతంతో పోలిస్తే మరింత సమర్థంగా అదుపులో ఉంచేందుకు వీలైన వ్యాధి ఇది.
 
 మూడు ‘ఎస్’లతో గుర్తించడం తేలిక: మీకు కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అవి...
 ఊ స్టిఫ్‌నెస్ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం. ఊ స్వెల్లింగ్ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట) ఊ స్క్వీజింగ్ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు... షేక్‌హ్యాండ్ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్’ అయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందేమోనని చూసుకోవాలి.
 
 ఇతర లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... నొప్పి పెడతాయి. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయానికి పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. ఇక ఉదయాన్నే కీళ్ల కణుపుల వద్ద నొప్పి తగ్గడానికి చేతులను వేడినీళ్లలో ముంచితే తమకు ఉపశమనం కలుగుతుందేమోనని అనుకుంటుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్ తిప్పడం,  షర్ట్ బటన్లు పెట్టుకోవడం వంటి సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు. అయితే మొదట్లో చిన్న కీళ్లకు (అంటే వేళ్ల కణుపులకు) పరిమితమైన నొప్పి... వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెద్ద కీళ్లకూ (అంటే.. మోచేయి, మోకాలు, మడమ... వంటివాటికి) వ్యాపిస్తుంది.
 
 ఎందుకు వస్తుందిది..?
 మన వ్యాధినిరోధక వ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి ఇది. మన కీళ్లు ఎందుకో మన వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)కు కొత్తగా అనిపిస్తాయి. దాంతో ఆ వ్యవస్థ మన కీళ్లపై పోరాటం మొదలుపెడుతుంది. మన కీళ్ల కణుపులపై యాంటీబాడీస్‌ను క్షిపణుల్లా ప్రయోగిస్తుంటుంది. దాంతో ఎముకల కీళ్ల చివరన ఉండే సైనోవియమ్ అనే పొర దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల వద్ద, కీళ్ల చుట్టూ నొప్పి, వాపు, ముట్టుకోనివ్వనంత మంట కనిపిస్తాయి.
 
 నిర్ధారణ: ఊ లక్షణాలు కనీసం ఆరు వారాల పాటు అలాగే కొనసాగడం (అయితే ఇటీవల ఆరువారాల లోపే లక్షణాలు తీవ్రతరమవుతున్నాయి. దాంతో వ్యాధిని త్వరగా గుర్తించడం... ఫలితంగా చికిత్సకు స్పందన కూడా త్వరితంగా కనిపించడం జరుగుతోంది).
 
 ఊ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష: ఇది వ్యాధి పేరుతో ఉన్న పరీక్షే అయినా... ఒక్కోసారి వ్యాధి ఉన్నప్పటికీ ఇందులో నెగెటివ్ రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఒక్కోసారి కొందరిలో ఏ వ్యాధి లేనివారిలోనూ ఇది పాజిటివ్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి రుమటాలజిస్టులు కానివారు నిర్దిష్టంగా నిర్ధారణ చేయలేకపోవచ్చు. రుమటాలజిస్ట్ మాత్రమే ఈ వ్యాధిని సరిగా నిర్ధారణ చేయగలరు.
 
 ఊ యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్)తో నిర్ధారణ నిర్దిష్టంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ ఒక ప్రతికూలత ఉంది. అదేమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది రోగుల్లోనే యాంటీ-సీసీపీ కనపడుతుంది.
 
 వ్యాధిని ఎదుర్కోవడం ఇలా ...
 రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయడం కంటే వ్యాధిని అదుపులో ఉంచడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రక్రియ. అందుకే వ్యాధిని ఎదుర్కునే క్రమంలో రోగికి వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, కొన్ని సూచనలు ఇవ్వడం, ఫిజియోథెరపీ వంటివి అవసరం. చికిత్సతో పాటు ఇవన్నీ కలగలిసి ఆచరించాల్సిన అవసరం ఉంది.  
 
 ఊ రోగికి అవగాహన: వ్యాధిని అదుపులో పెట్టాలంటే ముందు వ్యాధిపట్ల రోగికి అవగాహన అవసరం. రోగి తెలుసుకోవాల్సిందేమిటంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. చికిత్స తీసుకోగానే టక్కున మాయమైనట్లుగా నయమయ్యేది కాదు. చికిత్స కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటూ ఉండాలి. గుణం కనిపించడం కూడా అంత త్వరగా జరగదు. (మందులు పనిచేయడం అన్నది ఆరు వారాలకు ముందుగా కనిపించదు).
 
 పాటించాల్సిన సూచనలు
 ఊ రోగి నిద్ర మేల్కోగానే పడకపైనుంచి లేచేముందుగా కనీసం ఐదు నిమిసాల పాటు అలాగే పడుకుని కీళ్లను ముడుస్తూ, రిలాక్స్ చేస్తూ ఉండాలి. దాంతో కండరాలన్నీ బిగుతును కోల్పోయి, సాఫ్ట్‌గా మారతాయి. ఊ కీళ్లు బిగుతుగా ఉంటే పొద్దున్నే వేణ్ణీళ్లతో స్నానం చేస్తే, ఆ బిగుతు తగ్గుతుంది.          ఊ రోగి తాను పనిచేస్తున్నప్పుడు కనీసం ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పనికి బ్రేక్ ఇచ్చి ఒక ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. ఇలా రోజంతా చేయాలి. ఊ పతి కీలుపైనా పడే ఒత్తిడిని నిరోధించడానికి చేయాల్సిన వ్యాయామ విధానాలను డాక్టర్‌ను లేదా ఫిజియోథెరపిస్ట్‌ను అడిగి తెలుసుకుని, వాటిని పాటించాలి. ఊ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వాడాల్సిన కొన్ని ఉపకరణాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుని వాటిని వాడాలి.
 
 ఫిజియోథెరపీ : ఈ వ్యాధి వచ్చిన వారు తమ కీళ్ల పనితీరును మెరుగుపరచుకునేందుకు తరచూ ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారు సూచించిన వ్యాయామాలను చేయాలి. ముఖ్యంగా కీళ్లు కదలడానికి చేసే ప్రక్రియల వల్ల వాటిపై పడే ఒత్తిడిని తొలగించేలా / లేదా తగ్గించేలా ఈ వ్యాయామాలు ఉంటాయి. వాటిని విధిగా పాటించాలి.
 
 వైద్యచికిత్స : రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చేసే చికిత్స అనేకబరకాలుగా ఉంటుంది. తక్షణం నొప్పిని ఉపశమింపజేసేందుకు ఉపయోగించాల్సిన మందులు, మన ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతికూలంగా పనిచేయకుండా చూసేందుకు వాడాల్సిన మందులు, స్టెరాయిడ్స్ ఇలా రకరకాల మందులు ఉపయోగించాల్సి ఉంటుంది.
 
  నొప్పినివారణకు: కీళ్లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సాధారణ నొప్పి నివారణ మందులు వాడితే వాటి ప్రభావం కొద్ది గంటలకు మించి ఉండదు. అందుకోసం వ్యాధిని అదుపులో పెడుతూనే, నొప్పిని తగ్గించగల మందులనూ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిన మందులను  నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీ) అంటారు. ఈ జబ్బులో వాటిని వాడతారు.
 
 అసలు జబ్బుపై పనిచేయడానికి: ఇక ఈ వ్యాధిలో మన సొంత వ్యాధి నిరోధక శక్తే మనపై ప్రతికూలంగా పనిచేసి, మన కీళ్ల యాంటీబాడీలను ప్రయోగిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇలాంటి యాంటీబాడీస్ దాడులను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. అందుకోసం మన వ్యాధి నిరోధక శక్తి తాలూకు ప్రభావాన్నే కాస్తంత తగ్గించేలా మందులు వాడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు సొంత వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకుంటే అది ఇతరత్రా ప్రమాదం కావచ్చు కదా. అందుకే ఇతరత్రా వ్యాధి కారకాల విషయంలో తగ్గనంతగానూ, కేవలం మన సొంత కీళ్ల కణుపులు రక్షితమయ్యేంతగానూ ఉండేలా ఈ మందుల మోతాదులు చాలా సునిశితంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఇతరత్రా మనకు హాని కాకుండా కేవలం కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్ ప్రభావాన్ని తగ్గించే ఈ తరహా మందుల్ని ‘డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్’ (డీఎమ్‌ఏఆర్‌డీ) అంటారు. ఇవి కూడా తమ ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాల వ్యవధి పడుతుంది.
 
 స్టెరాయిడ్స్‌తో బ్రిడ్జింగ్ థెరపీ: మొదట నొప్పిని తగ్గిస్తూ... ఆ తర్వాత అసలు వ్యాధిపై పనిచేసేలా ప్రభావాన్ని చూపడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని ముందే తెలుసుకున్నాం. మరి ఈ లోపు... నొప్పితో కూడిన కణుపులతో బాధపడటమేనా? అందుకే అసలు ప్రభావం కనిపించే లోపు... ఉపశమనం కలిగించడానికి, వ్యాధిని అదుపుచేయడానికీ మధ్య వంతెనలా పనిచేయడానికి పనికి వచ్చేలా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇలా ఇవి వంతెన భూమికను నిర్వహిస్తాయి కాబట్టే ఈ స్టెరాయిడ్స్‌తో చేసే చికిత్సను ‘బ్రిడ్జింగ్ థెరపీ’ అంటూ అభివర్ణిస్తారు నిపుణులు. మొదట్లో అసలు కదిలించడానికే వీల్లేనంత తీవ్రంగా ఉండే వేళ్ల కీళ్లనూ, వాటి కణుపులనూ మామూలుగా మార్చడానికి కొంతమోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఇవ్వడం మొదలు పెట్టి... నిపుణులు క్రమంగా ఆ మోతాదును తగ్గించుకుంటూ వస్తారు.
 రోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మందులు వాడే సమయంలో కాస్తంత తెరిపి కనిపించినా... ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మానకూడదు.
 - నిర్వహణ: యాసీన్
 
 కొత్త చికిత్సా విధానాలు
 మనలోని వ్యాధి నిరోధక శక్తే కొన్ని యాంటీబాడీస్‌ను మన కీళ్లపైకి ప్రయోగించడం వల్ల తీవ్రమైన బాధ కలుగుతుందన్న విష యం తెలిసిందే. అందుకే  కీళ్లపై పనిచేసే యాంటీబాడీస్‌ను అణిచేసేలా కొత్త మందు లు రూపొందించారు. ఇవి వ్యాధినిరోధకతకూ, కీళ్లకూ మధ్యలో వ్యాధి నిరోధకత సృష్టించే యాంటీబాడీస్‌ను అణిచేలా పని చేస్తాయి కాబట్టి  ఇంటర్మీడియరీ పదార్థాలు అని కూడా అంటారు. వీటిని టీఎన్‌ఎఫ్-ఆల్ఫా, ఐఎల్-6 వంటి జీవసంబంధమైన (బయాలజిక్)  పదార్థాలనుంచి రూపొందిస్తారు కాబట్టి వీటిని ‘బయాలజిక్ ఏజెంట్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ మందులు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు ఇన్‌ఫ్లిక్సిమాబ్, ఎటానెర్‌సెప్ట్, అబాటసెప్ట్, రిటుక్సిమాబ్. ఈ కేటగిరీలో టొఫాసిటినిబ్ అన్నది సరికొత్త మందు. త్వరలోనే భారతదేశంలోకి రానుంది.
 
 -  డాక్టర్ కె. ధీరజ్,
 రుమటాలజిస్ట్,
 యశోదా హాస్పిటల్,
 మలక్‌పేట, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement