ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం లేదా బలహీనపడటం వల్ల కనిపించే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మన దేశంలో కనీసం 15 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు... అందునా మరీ ముఖ్యంగా మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంతమందిని బాధించే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుధీర్‌రెడ్డి చెబుతున్న విషయాలివి...
ప్రశ్న : ఆర్థరైటిస్ సమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వేరా?
జ: ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్‌లలో దాదాపు 200 రకాలు ఉంటాయి. అందులో సాధారణంగా వయసు పెరగడం వల్ల అరుగుదల వల్లగానీ లేదా చిన్నవయసులోనే అయితే యాక్సిడెంట్ల కారణంగా ఆస్టియో ఆర్ధరైటిస్ రావచ్చు. ఇదెలా వస్తుందంటే... రెండు ఎముకల మధ్య అంటే కీళ్ల (జాయింట్) దగ్గర ఘర్షణ తగ్గించడానికి ఎముకల చివరన కార్టిలేజ్ అనే మృదువైన పదార్థం ఉంటుంది.
దీన్నే చిగురు ఎముక అని కూడా అంటుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ అది అరగడం లేదా ఆటల్లాంటి/ప్రమాదాల్లాంటి ఏవైనా కారణాల వల్ల కార్టిలేజ్ దెబ్బతినడంతో కీళ్లమధ్యలో ఉండే గ్యాప్ తగ్గుతుంది. దాంతో ఎముకలు ఒకదారితో మరొకటి ఒరుసుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు అవి బిగుసుకుపోవడం (స్టిఫ్‌నెస్)తో పేషెంట్ ఎంతగానో బాధకు గురవుతారు.
ప్రశ్న : ఆస్టియో ఆర్థరైటిస్‌ను తెచ్చిపెట్టే ముప్పుల్లాంటివి ఏవైనా ఉన్నాయా?
జ: నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పెరుగుతున్న వయసే ఆర్థరైటిస్‌కు ప్రధాన రిస్క్‌ఫ్యాక్టర్. పైగా ఇది నివారించలేనిది కూడా. కొందరిలో వంశపారంపర్యంగానూ కనిపిస్తుంది. అంటే కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశాలూ ఎక్కువే. అలాగే బరువు మోసే వృత్తుల్లో ఉన్నవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా వస్తుంటుంది.
ప్రశ్న : ఇందుకు కారణాలు ఏమిటి?
జ: ∙ఎక్కువ బరువు ఉండటం/స్థూలకాయం
♦కీళ్లకు బలమైన దెబ్బ తగలడం (ట్రామా)
♦వృత్తిపరంగా కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో
♦కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) ♦రుమటాయిడ్ ఆర్థరైటిస్ ∙డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం
♦కొన్ని రకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదాహరణకు కార్టికోస్టెరాయిడ్స్).
ప్రశ్న : ఏయే లక్షణాలతో ఆర్థరైటిస్ బయటపడుతుంది?
జ: ∙నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువ. కదలికల వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది.
♦స్టిఫ్‌నెస్: కీళ్లు బిగుసుకుపోవడం... దాంతో కీళ్లలో కదలికలు తగ్గడం.
♦కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి కలుక్కుమనే శబ్దాలు వినిపిస్తాయి.
♦వాపు: కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్‌డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు.
♦వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్‌నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రశ్న : దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు?
జ: కీళ్ల భాగాల ‘ఎక్స్–రే’తో ఈ వ్యాధిని తేలిగ్గానే గుర్తించవచ్చు.
ప్రశ్న : నివారణ కోసం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
జ: ∙ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. ∙పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం.
♦కంటినిండా తగినంత నిద్రపోవడం, నాణ్యమైన నిద్రవల్ల జీవననాణ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు... దీనివల్ల ఎన్నో కీళ్లవాతాలకు కారణమైన ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు.
♦సమతులాహారం ఎంతో ముఖ్యం. క్యాల్షియం, విటమిన్– డి పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలతో పాటు ఆకుకూరలు, గుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ♦క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోగికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులు వ్యాయామాలను సూచిస్తారు. సాధారణంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా వంటివి చేసుకోవచ్చు. అయితే మొదట్లో ఈ వ్యాయామాల కారణంగా బాధ ఎక్కువైనట్లు అనిపించే అవకాశాలున్నప్పటికీ క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా శారీరకంగా చురుకుదనం పెరగడం, పరిస్థితి మెరుగుపడుతుంది.
♦వైద్యుల సలహా మేరకు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ తరహా సమస్యలకు సాధారణంగా వాడే స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ఎవరూ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాటివల్ల కిడ్నీల వంటి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
♦బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం)
♦విటమిన్–డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం.
ప్రశ్న : దీనికి చికిత్స అందుబాటులో ఉందా?
జ: నొప్పి కనిపించినప్పుడు తప్పనిసరిగా మెడికల్ స్పెషలిస్టులు / ఆర్థోపెడిక్ నిపుణులకు చూపించాలి. వారు నొప్పిని తగ్గించడానికి ఎన్‌ఎస్‌ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి సూచిస్తారు. ఇటీవల న్యూట్రాస్యూటికల్స్ అనే కొత్త రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటివల్ల ఆర్థరైటిస్ మరింతగా పెరగడం తగ్గుతుంది లేదా ఆగుతుంది.
కొన్ని రకాల ఇంజెక్షన్స్ అంటే హైలురానిక్ యాసిడ్ వంటివి, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ) వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... అరుగుదల వేగం తగ్గేవిధంగా కొన్ని వ్యాయామాలను సైతం సూచిస్తారు. ఆ సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పరిస్థితి బాగా విషమించి... మోకాలి కీళ్ల వంటివి మరీ ఎక్కువగా అరిగిపోయినప్పుడు పేషెంట్స్‌కు కీళ్ల మార్పిడి (నీ జాయింట్ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్స వంటివి అవసరం పడవచ్చు.
ఇంటర్వ్యూ
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment