సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు.
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment