
టైప్ చేస్తున్నప్పుడు వేళ్లు నొప్పి..!
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)గా పేర్కొంటారు.
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 28. ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. కంప్యూటర్‌పై టైపింగ్ పని ఎక్కువగా చేస్తుంటాను. ఇటీవల టైప్ చేస్తున్న సమయంలో నా వేళ్లు ఎంతో నొప్పిగా ఉంటున్నాయి. రాత్రివేళల్లో చేతిలో సూదులు గుచ్చుతున్నంత బాధ ఉంటోంది. నా చేతులు బలహీనమైనట్లుగా కూడా అనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- రాధిక, హైదరాబాద్
మన చేతులకు సంబంధించిన నరాలు మణికట్టు దగ్గర ఒక సన్నటి ద్వారం గుండా అరచేతుల్లోకి వెళ్తుంటాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మణికట్టులోని ఎముకలు అరుగుదలకు గురవుతుంటాయి. దాంతో మణికట్టు గుండె వెళ్లే నరాలకు మార్గం మరింత సన్నబడుతుంది. ఒక్కోసారి మహిళలు గర్భవతి అయినప్పుడు నీరు వచ్చినట్లగానే మణికట్టులోనూ నీళ్లు చేరుతుంటాయి. దాంతోపాటు టైపింగ్ సమయంలో మన మణికట్టును కాస్త ఒంచి టైప్ చేస్తుంటాం. దానివల్ల నరాల ప్రవేశద్వారం మరింత సన్నబడుతుంది. ఫలితంగా నరాలపై ఒత్తిడి పడి అరచేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్న బాధ కలుగుతాయి. మీ విషయంలో ఒకసారి నర్వ్ కండక్షన్ స్టడీ పరీక్షలు చేయించి, వ్యాధిని దాని తీవ్రతను తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
నా వయసు 30 ఏళ్లు. ఈ వయసులోనే నాకు మోకాళ్లలో నొప్పులు వస్తున్నాయి. మెట్లు ఎక్కులేకపోతున్నాను. మా అమ్మ, అమ్మమ్మ - వీళ్లిద్దరూ మోకాళ్లలో నొప్పులతో బాధపడ్డారు. వాళ్లిద్దరికీ ఆర్థరైటిస్ ఉందని తేలింది. ఇది వారసత్వంగా కుటుంబాల్లో రావచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. కుటుంబంలో అమ్మకు ఆర్థరైటిస్ వస్తే నాకూ వస్తుందా? దయచేసి వివరించండి.
- ధనలక్ష్మి, ఒంగోలు
మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి వస్తే... అది ఆర్థరైటిస్ కాకపోవచ్చు. మీ అమ్మ, అమ్మమ్మకు ఆర్థరైటిస్ అన్నది వయసుతో పాటు వచ్చిన సమస్య. మీరు ఆందోళన పడకుండా మీ సమస్య నిర్ధారణ కోసం ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
హోమియో కౌన్సెలింగ్
నాకు తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. హోమియో వైద్యవిధానంలో తగ్గే మార్గం చెప్పండి.
- సూర్యనారాయణ, మెదక్
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రా ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్ అంటారు.
కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కొందరిలో ఈ-కొలై అనే బ్యాక్టీరియా దీనికి కారణం కావచ్చు. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా ఉంటుంది. మలవిసర్జన సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ-కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్‌ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలి, జ్వరం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స: వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి - బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. ఇటీవల ఒకసారి రక్తం తగ్గితే, దాత నుంచి రక్తాన్ని స్వీకరించాను. ఆ తర్వాత నాకు హైఫీవర్ వచ్చింది. వైద్యపరీక్షలు చేయించుకుంటే, నాకు హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఈ వ్యాధి గురించి వివరాలు తెలపండి.
- ఒక సోదరుడు, గుంటూరు
హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ చాలా వేగంగా కాలేయానికి చేరి, సమస్యతు తెచ్చిపెడుతుంది. ఇది ఒక రకంగా హెచ్‌ఐవీ కంటే కూడా చాలా ఎక్కువరెట్లు ప్రమాదకరమైనది.ఇది రక్తం, లాలాజలం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచు కొంతమందిలో ఫ్లూ లాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబారటం వంటి కామెర్ల లక్షణాలు, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్లనొప్పులు రావచ్చు. దీన్ని గుర్తించేందుకు యాంటిజెన్ పరీక్షలు చేస్తారు. వైరస్ చేరిన వెంటనే పరీక్షలలో ఈ విషయం తెలియదు. ఇన్ఫెక్షన్ సోకిన ఆరు నుంచి పన్నెండు వారాల తర్వాత మాత్రమే పాజిటివ్ ఫలితం వస్తుంది. ఆ సమయంలో మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.
దీనికి బారిన పడిన పది మందులో తొమ్మిది మందికి ఆర్నెల్లలో అదే తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రమే వ్యాధి శరీరంలో ఉండిపోయి, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. దాంతో కాలేయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. లివర్ క్యాన్సర్‌గా రావడానికి హెపటైటిస్-బి ఒక ముఖ్య కారణం. ఇది సోకినప్పుడు ఇన్ఫెక్షన్ ముదరకుండా కాలేయం దెబ్బతినకుండా చికిత్స అందిస్తారు. ఇంటర్‌ఫెరాన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. కొన్నివారాలా పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది. కొన్సిసార్లు జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు.
శరీరంలో హెపటైటిస్-బి వైరస్ ఉండేవారి రక్తం నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి సూదులు, సిరంజీలు, బ్లేడ్‌లు, టూత్‌బ్రష్‌లతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. కాబట్టి ఇలాంటి వస్తువులు వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడకపోవడం ద్వారా హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్‌ను నివారించవచ్చు. రక్తమార్పిడితో పాటు అది వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను నివారించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు.