ఏపీ సీఎం మిషన్‌ చాలా మంచిది! | Palagummi Sainath Special Interview on YSR Jayanthi | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం మిషన్‌ చాలా మంచిది!

Published Tue, Jul 9 2019 11:47 AM | Last Updated on Tue, Jul 9 2019 1:53 PM

Palagummi Sainath Special Interview on YSR Jayanthi - Sakshi

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌తో‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌
టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ  

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారిని అమరావతిలో కొద్ది రోజుల క్రితం కలిసి వ్యవసాయ సంక్షోభంపై చర్చించినప్పుడు.. సీనియర్‌ మంత్రి అధ్యక్షతన అధికారాలతో కూడిన వ్యవసాయ కమిషన్‌ను నియమించాలని సూచించాను. స్వామినాథన్‌ కమిషన్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో వేసిన వ్యవసాయ కమిషన్లకు అధికారాలేమీ లేవు. అవి కేవలం సిఫారసులు చేయడానికే పరిమితం.కాబట్టి, మానవ హక్కుల కమిషన్‌కు ఉన్నట్లుగా మాన్‌డేటరీ పవర్స్‌తో కూడిన స్వతంత్ర, శాశ్వత వ్యవసాయ కమిషన్‌ను నియమించాలని సూచించాను. అయితే, జగన్‌ గారు స్వయంగా తన అధ్యక్షతనే వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు. ముఖ్యమంత్రినేతృత్వంలో ఏర్పాటైన మిషన్‌ కాబట్టి ఎగ్జిక్యూటివ్‌ పవర్‌ ఉంటుంది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం.

రైతే రాజుగా విరాజిల్లాల్సిన ఈ దేశంలో అన్నదాతలు అప్పులతో ఆత్మహత్యలపాలవుతున్న దుస్థితికి చేరుకున్నాం.. వ్యవసాయ రంగంలో ఈ సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణాలు ఏమిటి?
వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన మూల కారణాలన్నమాట. 1990వ దశకం మొదటి నుంచి మన ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి విధానం ఇందుకు మూలం. చిన్న రైతులు, రైతు కూలీల ప్రయోజనాలకు ఇది పూర్తి ప్రతికూలమైనది. మొదట మార్కెట్‌ బేస్‌డ్‌ ప్రైసింగ్‌ అమల్లోకి వచ్చింది. దాని వల్ల విత్తనాలు వంటి వ్యవసాయ ఉత్పాదకాల ధరలు 300%–500% పెరిగాయి. ఉదాహరణకు.. హైబ్రిడ్‌ పత్తి విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ. 250–300 ఉండేది. బీటీ కాటన్‌ వచ్చాక రూ. 1600 –1800 వరకు పెరిగింది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రఘువీరారెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు బీటీ పత్తి విత్తనాల ధరలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఆ కేసు కోర్టు ముందుకు విచారణకు రాకముందే.. రాత్రికి రాత్రే మోన్‌శాంటో–మహికో కంపెనీ బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధరను రూ. 925కి తగ్గించింది. సగానికి సగం ధర తగ్గించిన తర్వాత కూడా వారికి లాభాలు వస్తూనే ఉన్నాయి. అంటే, అంతకుముందు ఎంత ఎక్కువ లాభాలు పొందారో చూడండి.

ఆ విధంగా విత్తనాలు ఒక్కటే కాదు.. రసాయనిక ఎరువుల ధరలు కూడా అంతే. 1991లో 50 కిలోల డి.ఎ.పి. బస్తా ధర రూ. 1,067 ఉండేది. ఇప్పుడు 45 కిలోల డి.ఎ.పి. బస్తా ధర రూ. 1,450 ఉంది. చూడండి.. ధర పెరిగించారు, తూకం తగ్గించారు.. అదొక మోసం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. ఇవన్నీ కార్పొరేట్‌ కంపెనీల నియంత్రణలోకి వెళ్లాయి. భూమి యాజమాన్య హక్కు, రోజువారీ వ్యవసాయ పనులు తప్ప వ్యవసాయంలో మిగతా వన్నీ కంపెనీల అజమాయిషీలోకి వెళ్లాయి.

సాగు ఖర్చు 300% నుంచి 500% వరకు పెరిగింది. కానీ, రైతుకు ఇచ్చిన ధర ఎంత పెరిగింది?
సాధారణం.. చాలా సాధారణంగానే పెరిగింది.వ్యవసాయ ఉత్పత్తుల విలువతో పోల్చితే ఇతర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా పెరిగాయి. మహారాష్ట్రలో 1973లో క్వింటా పత్తి అమ్మితే వచ్చే డబ్బుతో 15 గ్రాముల బంగారం కొనుక్కో గలిగేవారు. ఇవ్వాళ 10 గ్రాముల బంగారం కొనాలంటే ఎన్ని క్వింటాళ్ల పత్తి అమ్మాల్సి ఉంటుందో మీరే లెక్కగట్టండి తెలుస్తుంది.. ధరల విషయంలో రైతులు ఎంత మోసపోతున్నారో. దీనంతటికి మూల కారణం 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు.  ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత రైతుల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఈ విధానాలు రైతులు, కూలీల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం. రైతులకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయి. వ్యవసాయ రుణాలను రెట్టింపు, మూడింతలు పెంచామని వచ్చిన ప్రతి ప్రభుత్వమూ చెబుతూ ఉంటుంది. అది నిజమే. అయితే, వ్యవసాయ రుణాల పేరుతే ఇస్తున్న రుణాలన్నీ రైతులకు వెళ్లటం లేదు. మహారాష్ట్రలో వ్యవసాయ రుణాల్లో 53% ముంబై నగర పరిధిలో ఇచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ముంబైలో రైతులు లేరు. కానీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కంపెనీల కేంద్ర కార్యాలయాలు ముంబైలో ఉన్నాయి. రాష్ట్రంలో రైతులందరికీ ఇచ్చిన రుణాల కన్నా ఎక్కువ మొత్తంలో వ్యవసాయ రుణాలు వీరికి ఇచ్చారన్నమాట. వ్యవసాయ ఉత్పాదకాల ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయోత్పత్తులకు సరైన ధర ఇవ్వటం లేదు. రుణం తగ్గించారు.. ఇందుకే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.

వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించి, రైతును నిలబెట్టుకునే మార్గం ఏమిటి?
మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను సమూలంగా తిరగరాయాలి. డా. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన గల జాతీయ వ్యవసాయ కమిషన్‌ చాలా ఏళ్ల క్రితమే అద్భుతమైన నివేదికలు ఇచ్చింది. 2004 డిసెంబర్‌లో మొదటి నివేదిక ఇచ్చారు. 2006 అక్టోబర్‌లో ఐదో నివేదికలోని రెండో సంపుటాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత, ధరలు, భూసార పరిస్థితులు, మార్కెట్లు, మార్కెట్‌ లింకేజీల దగ్గరి నుంచి చిన్న, సన్నకారు రైతుల సమస్యలు, కౌలు రైతులు, మహిళా రైతుల సమస్యలు వంటివన్నిటినీ స్వామినాథన్‌ అన్ని కోణాల నుంచి లోతుగా విశ్లేషించడమే కాదు అద్భుతమైన పరిష్కారాలను కూడా సూచించారు.

కానీ, అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌కు ఈ నివేదిక నచ్చలేదు. స్వామినాథన్‌ కమిషన్‌ను నియమించిన ఆయనే ఆ నివేదికను తొక్కేశాడు. పదిహేనేళ్లు గడుస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, పార్లమెంటులో ఆ నివేదికలపై ఒక్క గంట కూడా చర్చ జరగలేదు. అందుకే వివిధ రాష్ట్రాల ప్రజలతో కలిసి ‘నేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌’ పేరిట గత నవంబర్‌లో ఢిల్లీలో రాజకీయ పక్షాల తోడ్పాటుతో కలిసి పెద్ద ర్యాలీ చేశాం. వ్యవసాయ సంక్షోభం గురించి చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్నది మా ప్రధాన డిమాండ్‌. జీఎస్టీ అంశంపై అయితే ఆఘమేఘాల మీద పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టారు. వ్యవసాయదారుల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలపైనే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉందనడానికి ఇదే నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పాటైన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మిషన్‌ను నియమించింది. అందులో మీరూ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ చర్యలపై మీ అభిప్రాయం ఏమిటి?
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారిని అమరావతిలో కొద్ది రోజుల క్రితం కలిసి వ్యవసాయ సంక్షోభంపై చర్చించినప్పుడు.. సీనియర్‌ మంత్రి అధ్యక్షతన అధికారాలతో కూడిన వ్యవసాయ కమిషన్‌ను నియమించాలని సూచించాను. స్వామినాథన్‌ కమిషన్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో వేసిన వ్యవసాయ కమిషన్లకు అధికారాలేమీ లేవు. అవి కేవలం సిఫారసులు చేయడానికే పరిమితం. కాబట్టి, మానవ హక్కుల కమిషన్‌కు ఉన్నట్లుగా మాన్‌డేటరీ పవర్స్‌తో కూడిన స్వతంత్ర, శాశ్వత వ్యవసాయ కమిషన్‌ను నియమించాలని సూచించాను. అయితే, జగన్‌ గారు స్వయంగా తన అధ్యక్షతనే వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటైన మిషన్‌ కాబట్టి ఎగ్జిక్యూటివ్‌ పవర్‌ ఉంటుంది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం.
ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా కార్యనిర్వాహక అధికారాలున్న వ్యవసాయ కమిషన్‌లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయడం మంచి నిర్ణయం. ఆదివాసీ రైతుల హక్కుల గురించి, రైతుల రుణ విముక్తి గురించి, నీటి అత్యవసర పరిస్థితి గురించి కూడా మిషన్‌ పరిశీలించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి రైతుల సమస్యలపై చర్చించాలి. అలాగే, రైతుల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కూడా కేంద్రాన్ని అసెంబ్లీ డిమాండ్‌ చేయాలి. ఈ చర్యలన్నీ రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న భరోసాను రైతుల్లో కలిగిస్తాయి. వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి దోహదపడతాయి. స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

పాలేకర్‌ జీరో బడ్జెట్‌ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించింది.. మీరేమంటారు?
రైతుల అసలు సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, దశల వారీగా కృషి చేయాలి. వ్యక్తుల కేంద్రంగా ఉండే పద్ధతులు కాకుండా.. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మంచివని నేను అనుకుంటాను. వీటిని కూడా.. రైతుల జీవన అనుభవాల ప్రాతిపదికగా, అంశాల వారీగా అమలుకు కృషి జరగాలి.

మన రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులే. వాతావరణ మార్పుల నేపథ్యంలో వీరిని వ్యవసాయంలో నిలబెట్టడం సాధ్యమేనా?
మీరన్నట్లు చిన్న, సన్నకారు రైతులపైనే దృష్టి కేంద్రీకరించాలి. అయితే, సంక్షోభం వీరికే పరిమితం కాలేదు. మధ్య తరగతి రైతులతోపాటు యావత్‌ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా కౌలు రైతులు, మహిళా రైతులు, అదివాసీ రైతులు, దళిత రైతులను గురించి కూడా పట్టించుకోవాలి.– ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement