తనకు తానే పాటగా పల్లవించింది | Pallavi singing from her childhood, say parents | Sakshi
Sakshi News home page

తనకు తానే పాటగా పల్లవించింది

Published Mon, Sep 30 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

తనకు తానే పాటగా పల్లవించింది

తనకు తానే పాటగా పల్లవించింది

యా కుందేందు తుషార హార ధవళా... యా శుభ్రవస్త్రాన్వితా...
 యా వీణా వరదండ మండిత కరా... యా శ్వేత పద్మాసనా....
 ‘హ్యాపీడేస్’ సాంగ్.
 పాడింది ప్రణవి!
 శుద్ధబ్రహ్మ పరాత్పర రామా... కాలాత్మక పరమేశ్వర రామా...
 శేషతల్ప సుఖ నిద్రిత రామా...బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా...
 ‘శ్రీరామదాసు’ సాంగ్
 పాడింది ప్రణవి!
 చాలు... నంది అవార్డు, ఇంకా అందిన అవార్డులు అన్నీ తర్వాత!
 శుభ్రగాత్రి, శుద్ధగాత్రి, మొత్తానికే ప్రణవి... ఓ దివ్యగాత్రి.
 ఇంత పవిత్రతని శ్రావ్యంగా పలికించిన, సరిగమలొలికించినఅమ్మానాన్నల ‘లాలిపాఠం’ గురించి కూడా తెలుసుకుంటేనే...
 ప్రణవి పాటను పూర్తిగా విన్నట్టు, స్వరమూర్తిని కొలిచినట్టు!!

 
 శ్రీరామదాసు సినిమా... ప్రేక్షకులు సినిమాలో లీనమై ఉండగా గోపన్న భార్య కమల ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ అంటూ భక్తిపారవశ్యంతో పాడుతుంది. తెరమీద స్నేహ ముఖంలో కనిపిస్తున్న భక్తితత్పరతకు దీటుగా పలుకుతోంది పాటలో గాయని స్వరం. పరిణతి చెందిన గాయనీమణి పాడినట్లుగా అనిపించిన ఆ లేత గొంతు ప్రణవిది. పాటే ప్రాణంగా పెరిగిన అమ్మాయి ప్రణవి. ఈ గాయనిని తీర్చిదిద్దడంలో తమకు ఎదురైన అనుభవాలను ఆమె తల్లిదండ్రులు రజని, విజయకుమార్ ఇలా చెప్పారు.
 
 ‘నేను వంట చేసుకుంటూ నేర్పిన పాటలే పిల్లలకు ‘స్వరాక్షరాల’య్యాయన్నారు రజని. ‘‘మా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములందరికీ సంగీతం వచ్చు. పాటలు రాసి, వాటికి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడుతాం. అలా... సంగీతం మా జీవితాల్లో ఒక భాగమైంది. అలాగే మా ముగ్గురమ్మాయిలకూ సంగీతం నేర్పించాం. అయితే పెద్దమ్మాయి గానాన్ని కెరీర్‌గా మలుచుకోలేదు, చిన్నమ్మాయి ఒక ఆల్బమ్‌లో పాడింది. పాటను కెరీర్‌గా తీసుకున్నది మాత్రం మధ్య అమ్మాయి ప్రణవి ఒక్కతే’’ అన్నారామె.
 
 పాటలో... పాత్రలో ఇమిడిపోతుంది!
 
 పాటను చిలుకపలుకుల్లా పలకకుండా స్వరాన్ని పాత్రకు, సన్నివేశానికి అనుగుణంగా పలికించే నేర్పు గురించి చెబుతూ ‘‘ప్రణవి బాల్యం ఎక్కువ భాగం కెమెరా ముందు, ఆడియో రికార్డింగ్ మైక్ ముందు గడిచింది, తాను చేయాల్సిన పనిని పూర్తిచేయడం అలవాటైంది. చుట్టూ ఎంత మంది ఉన్నా పరీక్ష రాసినట్లే ఇది కూడ’’ అంటారు ప్రణవి తండ్రి. ‘‘మాది కోనసీమ కొత్తలంకలో వ్యవసాయ కుటుంబం. పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, మా బావగారింట్లో ఉండి చదువుకుని స్కూల్ టీచర్‌నయ్యాను. ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నా ప్రవృత్తిని కొనసాగించడానికి రెక్కలు వచ్చినట్లు భావించాను. స్టేజీ నాటకాల్లో నటించాను. దూరదర్శన్‌లో క్యాజువల్ అనౌన్సర్‌గా చేశాను. టెలిస్కూల్‌కి స్క్రిప్టు రాశాను. ఎఫ్‌డిసి (ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) డాక్యుమెంటరీలు రాసి, నటించాను. ఒక నేషనల్‌యాడ్‌లో పిల్లలు ముగ్గురూ నటించారు. టెలిస్కూల్ ప్రోగ్రామ్‌లో ఒక ఎపిసోడ్‌లో కుటుంబమంతా నటించాం. అలా ప్రణవికి చిన్నప్పటి నుంచి పాత్రలో ఇమిడిపోవడం వచ్చేసింది’’ అన్నారు విజయ్‌కుమార్.
 
 పిల్లలకు తోడుగా!
 
 పిల్లలను విద్యేతర కార్యక్రమాలకు తీసుకెళ్లడం తల్లిదండ్రులకు అదనపు బాధ్యతే. కానీ తన విషయంలో అది కలిసొచ్చింది అంటారాయన. ‘‘తెలుగు టీచర్‌గా సాంస్కృతిక కార్యక్రమాలకు స్కూలు పిల్లలందరినీ తీసుకెళ్లే బాధ్యత నాదే. పదకొండు మంది పిల్లలను మద్రాసుకి తీసుకెళ్లి వాయిస్ టెస్ట్ చేయించాను కూడ. అలా నా పిల్లలను కూడ వాళ్లు ఆసక్తి చూపించిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనేటట్లు చూసేవాడిని. దాంతో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులు కావాలన్నా, చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ సహకారం కావాలన్నా ముందు నాకే కబురు వచ్చేది. బాలరామాయణం సినిమాకి వందమంది పిల్లల చేత డబ్బింగ్ చెప్పించాను. గుహుడి భార్య పాత్రకి ప్రణవి చేత స్వరసహకారం ఇప్పించాను. ప్రణవి టెన్త్‌క్లాస్ నుంచి డబ్బింగ్ మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఒకసారి దర్శకులు ఆదిత్య గారు ప్రణవి పాట పాడుతుందని తెలిసి కీరవాణిగారికి పరిచయం చేశారు. అలా శ్రీరామదాసు సినిమాకి పాడింది’’ అన్నారు విజయకుమార్. ఇంతలో రజని మాట్లాడుతూ ‘‘తొలిప్రయత్నంలోనే తన పాట ఓకే కావడంతో ప్రణవి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ సంగతి నాకొక్కదానికే చెప్పాలని నా వెంటే తిరిగింది. ఇంటినిండా బంధువులు ఉండడంతో ఆ పగలంతా నేను తనతో మాట్లాడటమే కుదర లేదు. రాత్రి పడుకునే ముందు నేను డైరీ రాస్తున్నప్పుడు వచ్చి నా ఒళ్లో తలపెట్టుకుని పడుకుని ‘కీరవాణి సార్ నా పాట ఓకే చేశారమ్మా’ అని చెబుతూ ‘ఈ హ్యాపీన్యూస్ మొదట నీకు ఒక్కదానికే చెప్పాలనుకుంటే నువ్వు నాతో మాట్లాడనే లేదు’ అంటూ బుంగమూతి పెట్టింది. తర్వాత ప్రణవి ఎన్ని పాటలు పాడినా, ఆఖరికి తను నంది అవార్డు అందుకున్నప్పటికీ నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన మాత్రం అదే’’ అన్నారామె మెరుస్తున్న కళ్లతో.
 
 తండ్రిగా ఎక్కువ ఆనందపడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ‘‘శాంతాబయోటెక్ వరప్రసాద్‌రెడ్డిగారు ప్రణవి పాడిన ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకున్నారు. ఇటీవల కలిసినప్పుడు ఆ ట్యూన్ వినిపించారు. ఆ సంతోషాన్ని మర్చిపోలేను’’ అన్నారు కుమార్.
 
 తండ్రిగా సూచన!
 
 గాయనిగా కెరీర్‌ను కొనసాగించే క్రమంలో ప్రణవికి ఇచ్చిన సలహాలు, సూచనల గురించి చెబుతూ... ‘‘స్టేజ్ షోలను ఒప్పుకోవద్దని చెప్పాను. రికార్డింగ్ స్టూడియోలో మైక్ ముందు పాడడానికి, స్టేజ్‌మీద ఓపెన్‌గా పాడడానికి చాలా తేడా. స్టేజి మీద గొంతు పెంచి పాడాలి. తరచూ ఇలా పాడితే గొంతు సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఎక్కువకాలం పాడలేరు. అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని తొందరపడితే దీర్ఘకాలం కొనసాగలేరు. జీవితానికి డబ్బు కావాలి, కానీ డబ్బే ప్రధానం కాదు అని కూడా చెబుతాను. సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన విలాసవంతమైన జీవితాన్ని ఆశించరాదని పిల్లలందరికీ చెప్తుంటాం. పిల్లలకు సాధారణ జీవితానికి సంబంధించిన పునాది బలంగా ఉండాలనే ఆలోచనతోనే మేము గతంలో ఎలాంటి ఇళ్లలో జీవించామో ఇప్పుడూ అలాగే ఉన్నాం’’ అన్నారు విజయ్‌కుమార్.
 
 ఎల్లప్పుడూ సంతోషంగా..!

 
 వృత్తిపరమైన బాధ్యతలు, క్రమశిక్షణ విషయానికొస్తే... ‘‘పిల్లలు ముగ్గురూ ఎవరికి నచ్చిన ఫీల్డులో వారు నిమగ్నమైపోయారు. ప్రణవికి దయ, కరుణ ఎక్కువ. ఒకసారి రికార్డింగ్‌కి వెళ్తూ, దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసి 108కి ఫోన్ చేసి, వారిని హాస్పిటల్‌కి పంపించింది. దాంతో స్టూడియోకి ఆలస్యంగా వెళ్లి చివాట్లు వేయించుకుంది కూడ. అప్పుడు తనేమైనా చిన్నబుచ్చుకున్నదేమో సర్ది చెబుదాం అనుకునేలోపుగా తనే ‘వాళ్ల షెడ్యూల్‌కి ఇబ్బంది కలిగితే అనరా మరి’ అనేసింది’’ అంటూ... ఒక్కోరోజు తెల్లవారు జామున మూడింటి నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక్కో వృత్తిలో ఒక్కోరకమైన ఒత్తిడి ఉంటుంది. దానికి సిద్ధం కావాలని చెప్తుంటాం. ముగ్గురు పిల్లల్లో తన ప్రత్యేకత ఏంటంటే... ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడైనా నేను కాస్త ముభావంగా కనిపిస్తే ‘ఎందుకమ్మా! అలా ఉన్నావు, ఎప్పుడూ సంతోషంగా ఉండాల’ంటుంది’’ అన్నారు రజని. పిల్లల కోసం చేసుకున్న రాజీలను గుర్తుచేసుకుంటూ... ‘‘నా వ్యాపకాలను తగ్గించుకున్నాను. రజని అయితే తనకు వీణ వచ్చన్న సంగతే మర్చిపోయినట్లుంది’’ అన్నారు విజయ్‌కుమార్.
 
 పిల్లల అల్లరిని తలచుకుంటూ ‘ఆడపిల్లలు, మా ఇంట్లో ఎన్నిరోజులుంటారు. ఎంత అల్లరి చేసినా ఈ వయసులోనే కదా’ అని నేను కేకలేసిందే లేదు, రజని కేకలేసినా నాకు నచ్చేది కాదు’ అంటున్నప్పుడు విజయకుమార్ ముఖంలో బాధ వ్యక్తమైంది. దేవుడు ఆడపిల్లలను ఇస్తే ఇలాంటి తండ్రికే ఇవ్వాలి అనిపించింది.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి
 
 ప్రణవి కుటుంబం:
 అమ్మ:    రజని. గృహిణి, కథారచయిత.
 
 నాన్న:    విజయ్‌కుమార్. విశ్రాంత ఉపాధ్యాయులు. టీవీ, రంగస్థల, సినిమా నటులు.
 
 అక్క :    వైష్ణవి... ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసింది, ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టులు చేస్తోంది, పర్యావరణం మీద ఆమె రాసిన వ్యాసాలు మలేసియా యూనివర్శిటీ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. చదువు, సోషల్ వర్క్ ఆమె ఇష్టాలు.
 
 చెల్లి :    తేజస్వి... డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు బెంగళూరులో ఎన్‌ఐసిసిలో ఫొటోగ్రఫీలో డిప్లమో కోర్సు చేస్తోంది.
 
 ప్రణవికి అందిన పురస్కారాలు:
 = 2012లో భరతముని అవార్డు (2007, 2008లలో కూడా)
 
 = 2011, 2009 లలో టిఎస్‌ఆర్ అవార్డు  2011, 2009లలో ఆలాపన అవార్డు  
 
 =2010 లో నందిఅవార్డు (స్నేహగీతం సినిమాలో ‘సరిగమపదని’ పాటకు)  
 
 =2008లో టీవీ నంది అవార్డు (తూర్పు వెళ్లే రైలు సీరియల్‌కి పాడిన ‘మొన్న ఎదురు చూశా’ పాటకి)  
 
 =రాష్ట్రస్థాయి కర్ణాటక సంగీతం పోటీల్లో ప్రథమస్థానం (మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా)
 
 = నవ్యనాటక సమితి నిర్వహించిన లలితగీతాల పోటీల్లో వరుసగా మూడేళ్లు విజేత  
 
 =2009లో మాటీవీ సూపర్ సింగర్స్ బెస్ట్ మెంటర్ అవార్డు ‘ఛోటా చాలెంజర్స్’  
 
 
 =2005లో ఘంటసాల స్టేట్ అవార్డు (ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ చేతుల మీదుగా)  
 
 =2005 లో గరుడ అవార్డు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement