
పంచపాండవుల ఆలయం
తెలుసుకుందాం
శ్రీకృష్ణుడి ఆలయాలు దేశం నలుచెరగులా ఉన్నా, పంచపాండవుల ఆలయాలు మాత్రం బహు అరుదు. తమిళనాడులోని మహాబలిపురంలో ఇలాంటి అరుదైన ఆలయం ఉంది. కొండగుహలో నిర్మించిన పురాతన ఆలయం ఇది. చెన్నై నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. పల్లవుల నాటి శిల్పకళా వైవిధ్యానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో నిర్మించారు.
యాభై అడుగుల పొడవున ఉన్న కొండగుహ వెలుపల నిర్మించిన రాతి స్తంభాలు, వాటి అడుగున తీర్చిదిద్దిన సింహాల ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం లోపల నిర్మించిన పంచపాండవుల మండపం, రాతిగోడపై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను రక్షిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.