భేష్... బెస్ట్ పేరెంట్స్!
కొత్త విషయం
నియాండర్తాల్ మానవజాతి గురించి మనం అర్థం చేసుకోవాల్సినంత స్థాయిలో అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. యాభై వేల ఏళ్ల క్రితమే నియాండర్తాల్స్, శవాలను సమాధి చేసే వారనే విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆశ్చర్యాల జాబితాలో ఇప్పుడు సరికొత్తది ఒకటి చేరింది.
నియాండర్తాల్స్ అనగానే మొరటు వాళ్లు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వని వాళ్లు అనే అభిప్రాయం ఉంది. కొత్త పరిశోధన ఒకటి ఆ అభిప్రాయం తప్పని చెబుతోంది.
నియాండర్తాల్స్‌కు పిల్లల పెంపకంలో మంచి నైపుణ్యం ఉండేది. పిల్లలను అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. పిల్లలలో వివిధ రకాల నైపుణ్యాలను వృద్ధి చేయడానికి రకరకాల ఆటలు ఆడించేవారు. ఇక పిల్లల విషయానికి వస్తే... కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా సమాజంలో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించేవారట!
నియాండర్తాల్స్ బాల్యం సంక్లిష్టంగా ఉండేదనీ, ప్రమాదకరంగా, కష్టాలతో కూడుకొని ఉండేదనీ చాలాకాలంగా నెలకొన్న అభిప్రాయాన్ని యూనివర్సిటీ ఆఫ్ యార్క్(కెనడా)కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు సవాలు చేశారు.
పిల్లలకు వారి తల్లిదండ్రులతో, చుట్టూ ఉన్న సమాజంతో బలమైన భావోద్వేగ బంధాలు ఉండేవని చెబుతున్నారు. జబ్బు పడిన , గాయపడిన పిల్లలను నెలల తరబడి కంటికి రెప్పలా చూసుకునేవారట. ఒకవేళ పిల్లలు ఎవరైనా చనిపోతే... వారి అంత్యక్రియలను ప్రత్యేకంగా నిర్వహించేవారట. నియాండర్తాల్స్‌కు... పిల్లలను పెంచడం అనేది సం క్లిష్టంగా ఉండేదనే అభిప్రాయాన్ని పరిశోధన బృందానికి నాయకుడైన డా.పెన్నీ స్కిపిన్స్ ఖండించారు. కేవలం జీవసంబంధమైన సాక్ష్యాధారాలపై మాత్రమే ఆధారపడకుండా నెదర్‌లాండ్స్ సమాధులలో నుంచి వెలికి తీసిన సాంఘిక, సాంస్కృతిక సాక్ష్యాలను లోతుగా అధ్యయనం చేశారు.