నాన్నగారి ఉద్యోగం రీత్యా మేము కొన్ని సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. మేము ఉండే కాలనీలో పోకిరి కుర్రాళ్ల బెడద ఎక్కువగా ఉండేది.
దారిన పోయే అమ్మాయిలను రకరకాల కామెంట్లు చేస్తూ ఉండేవారు. కొందరు తేలికగా తీసుకునేవారు. కొందరు మనసులోనే బాధ పడుతూ ఎవరికీ చెప్పుకునేవారు కాదు. ఒకరోజు... కాలేజికి టైమ్ అవుతోందని పరుగులాంటి నడకతో బస్‌స్టాప్ వైపు వెళుతుంటే...
‘‘అరేబియా గుర్రం పరుగెడుతోంది’’ అని వినిపించింది.
వెనక్కి తిరిగిచూస్తే పోకిరి కుర్రాళ్ల గుంపు!
భయమేసింది. ఏమీ అనలేకపోయాను. క్లాసులో పదే పదే ఈ విషయమే గుర్తుకు వచ్చి మనసును ముల్లులా గుచ్చుతోంది. ‘‘ఆ వెధవలను తిట్టి ఉంటే బాగుండేది’’ అనుకున్నాను. విషయాన్ని నాన్నకు చెబితే ‘‘ఈసారి ఎవడైనా ఏమైనా అంటే చెప్పు. పోలీసులను పిలిచి తన్నిస్తాను’’ అన్నారు. ఆరోజు కూరగాయలు తేవడానికి మార్కెట్‌కు వెళుతున్నాను.
‘‘అరేయ్...అదిగో అరేబియా గుర్రం’’ అన్నాడెవడో. వెనక్కి తిరిగిచూస్తే ఆరోజు నేను చూసిన వాళ్లే! ‘‘చెప్పుతో కొడతాను’’ అన్నాను వాళ్ల వైపు చూస్తూ. మాటా మాటా పెరిగింది. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు చోద్యం చూస్తున్నారు తప్ప ఒక్కరూ మాట్లాడడం లేదు. ఇంతలో- ‘‘మీ ఇంట్లో ఆడమనుషులు లేరా? ఎందుకలా అమ్మాయిని ఏడిపిస్తున్నారు’’ అని ఒక గొంతు వినిపించింది. అతను ఓ బిచ్చగాడు. ఒక కాలు లేదు. కర్ర సహాయంతో నడుస్తుంటాడు.
‘‘ఉన్న ఒక్క కాలు కూడా తీసేస్తాం. ఇక్కడి నుంచి వెళ్లు’’ అని అరిచారు ఆ కుర్రవాళ్లు.
‘‘ఏదీ...తీయండ్రా’’ అని చేతిలో ఉన్న కర్రతో వాళ్ల మీదికి కోపంగా వెళ్లాడు బిచ్చగాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు ధైర్యం వచ్చింది. తలో మాట అనడం మొదలుపెట్టారు. ‘‘పోలీస్‌లకు ఫోన్ చేయండి’’ అని అరిచారు ఎవరో. పోకిరి కుర్రాళ్లు జడుసుకొని తలో దిక్కుకు పారిపోయారు. ఈ సంఘటన నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. ఆ బిచ్చగాడు వృద్ధుడు. పైగా ఒక కాలు లేదు. అయినా ధైర్యం చేసి ఆ కుర్రాళ్లను చావు తిట్లు తిట్టాడు. అందుకే నా దృష్టిలో అతను ఒక్క మగాడు!
-సి. వసంత, కొత్తగూడెం